ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదంటే అందుకు ఏకైక కారణం వైఎస్ జగన్మోహన రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అనే హోదాలో పార్టీని స్థాపించిన జగన్ కు ముఖ్యమంత్రిగా ఒక అవకాశం ఇచ్చి చూద్దామని రాష్ట్ర ప్రజలు అనుకున్నారు. కేవలం ఆయన మొహం చూసి మాత్రమే.. పార్టీ తరఫున నిలబడిన వారందరినీ కూడా గెలిపించారు. జగన్ హవా లేకపోయినా గెలవగలిగిన సొంతబలం గల నాయకులు ఆ పార్టీలో అతికొద్దిమంది మాత్రమే. ఊరూ పేరూ లేని కొత్త అభ్యర్థులు కూడా చాలా చోట్ల గెలిచారంటే.. కేవలం జగన్ పట్ల ప్రజా సానుకూలత మాత్రమే కారణం.
ఆ విషయం జగన్ కు కూడా స్పష్టంగా తెలుసు. అందుకే ఆయన అధికారం చేపట్టిన నాటినుంచి చెలరేగిపోతున్నారు. ముఖ్యమంత్రిగా చెలరేగిపోవడం అనేది వేరే సంగతి. పార్టీ అధినేతగా కూడా చెలరేగిపోతున్నారు. మీరెవ్వరూ స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదంటూ.. పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు అందరినీ అదుపాజ్ఞల్లో ఉంచేశారు. ఎవ్వరికీ నిర్ణయం తీసుకునేంత గానీ, స్వతంత్రంగా వ్యవహరించేంతగానీ వెసులుబాటు లేదు. జగన్ కనుసన్నల్లో నడవాల్సిందే. ఇదంతా కూడా పార్టీ అంతర్గత వ్యవహారం. దీనిని పెద్దగా తప్పుపట్టేదేమీ లేదు. ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచిన వాళ్లు ఆయన మాటకు కట్టుబడి ఉండాల్సి వస్తే.. అందులో చర్చ కూడా లేదు.
కానీ ప్రజల సంగతి ఏమిటి? ప్రజలందరూ కూడా అదే తరహాలో జగన్ మొహం చూసే ఓట్లు వేశారు. తమకు మంచి చేసినా చెడు చేసినా.. అది జగన్ చేస్తాడని వారు ఆశించారు. ఇవాళ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రాజధాని అనే పదం చుట్టూ.. వివాదాస్పదంగా మలుపులు తిరుగుతున్న వేళ.. తాము ఎవడిని నమ్మి అధికారం అప్పజెప్పామో.. అదే జగన్మోహన రెడ్డి స్వయంగా తమకు స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుకుంటే అది అత్యాశ కాదు.
రాజధాని అమరావతిలో ఉండొచ్చు.. విశాఖకు తరలిపోవచ్చు. కానీ, ఆ సంగతిని తాము నమ్మిన జగన్ చెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ జగన్ మాత్రం.. ప్రజలకు పరీక్ష పెడుతున్నట్లుగా ఈ విషయంపై తన పార్టీ నాయకులతో విచ్చలవిడిగా మాట్లాడింపజేస్తూ సంకేతాలు ఇస్తూ.. వివాదాలకు కారణం అవుతున్నారు. సాధారణంగా ఇది చంద్రబాబు శైలి. నిర్ణయాల్లో మంచి చెడులు ఏమిటనేది నిలకడ మీద తేలుతుంది. కానీ, తనను చూసి ఎన్నుకున్న ప్రజలకు తానే స్వయంగా విషయం చెప్పాలని, అది తన బాధ్యత అని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తెలుసుకుంటే బాగుంటుంది.
.

Discussion about this post