తెలుగులో ఒక అగ్రశ్రేణి టీవీఛానల్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా ఉంటూ.. టాక్ షో లు నిర్వహిస్తున్న సీనియర్ జర్నలిస్టు మురళీకృష్ణ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
‘‘Dear all one #BIGNEWS నేను రాజీనామా చేశాను. ఈ రోజే official గా రిలీవింగ్ లెటర్ తీసుకున్నా. తదుపరి ప్రయాణం త్వరలో..’’ అని ఆయన తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. సుదీర్ఘకాలంగా ఆ అగ్రశ్రేణి టీవీ ఛానల్ తో ముడిపడిఉన్న మురళీకృష్ణ పాత్రికేయ ప్రస్థానానికి ఇక్కడ తెరపడి, పెద్ద మలుపు తీసుకుంది.
విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి జర్నలిస్టు మురళీకృష్ణ త్వరలోనే ఎన్ టీవీలో చేరబోతున్నారు. తన కొత్త ప్రస్థానానికి సంబంధించి.. మంతనాలు నిర్ణయాలు అన్నీ పూర్తయ్యాయని తెలుస్తోంది. తన రాజీనామా విషయాన్ని బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించిన మురళీకృష్ణ.. కొంత విరామం తీసుకుని తర్వాత ఎన్టీవీలో చేరుతారని మీడియా వర్గాల్లో వినిపిస్తోంది.
ఛానల్ లో పొసగనందునే..
ప్రస్తుతం పనిచేస్తున్న ఛానెల్ లో రజనీకాంత్ తో పొసగకపోవడం వల్లనే.. మురళీకృష్ణ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉదయం మీడియా వాచ్ కార్యక్రమంతో పాటు, మురళీకృష్ణ టాక్ షో లు కూడా నిర్వహిస్తుంటారు. అయితే మురళీకృష్ణకు కొన్ని వారాలుగా టాక్ షోలు కూడా కేటాయించడం లేదని సమాచారం. ఈ విషయమై అడగబోతే.. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా హోదా ఉంది కదా.. టాక్ షోలు లేకపోతే మాత్రం ఏమైందని అన్నారని… కినుక వహించిన మురళీకృష్ణ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినప్పుడు వాళ్లు నిర్లిప్తంగా ఉపేక్షించారని సమాచారం. ఈ పోకడలను అర్థం చేసుకున్న మురళీ కృష్ణ రాజీనామా నిర్ణయానికి వచ్చారు.
ముందే ఎన్టీవీ వారితో మాట్లాడి అక్కడ చేరడానికి నిర్ణయించుకున్న తర్వాతే రాజీనామా చేశారు. బుధవారం నాడు రిలీవింగ్ లెటర్ తీసుకున్న తర్వాతే ట్విటర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. అయితే.. ఈ వ్యవధిలో రాజీనామా నిర్ణయం బయటకు పొక్కకుండా.. ఆఫీసులో కూడా ఎక్కువ మందికి తెలియకుండా గోప్యత పాటించారని తెలుస్తోంది.
మురళీకృష్ణ అగ్రశ్రేణి టీవీ ఛానెల్ జర్నలిస్టుగానే చాలా పాపులర్ అయ్యారు. సాక్షి టీవీ వచ్చిన తర్వాత.. కొన్నేళ్లపాటు అక్కడ పనిచేశారు. తొలుత సిటీకేబుల్ లో జర్నలిస్టుగా తన ప్రస్థానం ప్రారంబించిన మురళీకృష్ణ తర్వాత ఈటీవీలో చేరారు. అక్కడినుంచి టీవీ9కు వచ్చి.. తర్వాత సాక్షి కి వెళ్లారు. తిరిగి టివి 9 కే వచ్చారు. సంస్థాగతంగా మారుతున్న పరిణామాల్లో ఆయన ప్రాధాన్యం కూడా బాగా పెరుగుతూనే వచ్చింది. అయితే తిరిగి పరిస్థితులు యూటర్న్ తీసుకోవడంతో రాజీనామా చేశారు.
ఇక ఎన్టీవీలో మురళీకృష్ణ టాక్ షోలు మళ్లీ కొత్తదనంతో సందడి చేయబోతాయన్నమాట.
Dear all one #BIGNEWS Tv9 కి నేను రాజీనామా చేశాను. ఈ రోజే official గా రిలీవింగ్ లెటర్ తీసుకున్నా. తదుపరి ప్రయాణం త్వరలో… pic.twitter.com/J7IRTrMH4K
— Murali Krishna TV9 (@encounterwithmk) December 29, 2021
.