కేంద్రంలోని మోడీ ప్రభుత్వం.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేన్నయినా సహించే స్థితిలో ఉన్నది గానీ.. హిందూత్వ వినాశనానికి ఎవరైనా ప్రయత్నిస్తే మాత్రం ఉపేక్షించే స్థితిలో లేదు. అలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి సారథ్యంలో హిందూ వ్యతిరేక శక్తులు మితి మీరుతున్నాయని.. ఒక ప్రచారం చాలా రోజులుగా ఉంది. జగన్ స్వయంగా క్రిస్టియన్ కావడం వలన.. హిందూత్వ వ్యతిరేక చర్యలు ఎక్కడ జరిగినా కూడా, వాటికి ప్రభుత్వ మద్దతు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. జగన్ వ్యతిరేక శక్తులు అలాంటి దుర్ఘటనల్ని భూతద్దంలో చూపుతున్నారా? లేదా? అనేది పక్కన పెడితే.. ఇప్పుడు పరోక్షంగా జగన్ పాత్రను ప్రస్తావిస్తూ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణే.. స్వయంగా.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అవుతోంది.
అమరావతి నుంచి రాజధాని తరలిపోకూడదనే పట్టుదలతో స్థానికులు ఉద్యమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మహిళా జేఏసీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రాజధాని తరలిపోదని, తరలిస్తోంటే చూస్తూ ఊరుకోం అని కన్నా లక్ష్మీనారాయణ వారికి హామీ ఇచ్చారు. వైకాపాతో పొత్తు ఉండదని కూడా దృవీకరిస్తూ.. స్థానిక ఎన్నికల్లో జనసేనతో కలిసి బరిలో ఉంటామని కూడా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన మరికొన్ని వ్యాఖ్యలు గమనించదగినవి.
‘కొందరు హిందూ ఆలయాలపై దాడులు చేస్తూ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు.. రథాలు తగల బెడుతున్నారు.. మతమార్పిడులకు పాల్పడుతున్నారు.. ఎప్పుడు ఫిర్యాదు చేసినా.. మతిస్థిమితం లేని వ్యక్తులు చేస్తున్నట్లుగా పోలీసులు బుకాయిస్తున్నారు.. ప్రతిసారీ మతిస్థిమితంలేనివాళ్లే అయితే.. ప్రతిసారీ ఒకే మతానికి సంబంధించిన వాటిపై దాడులకు పాల్పడతారా’ అంటూ కన్నా ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాల మేరేకే ఈ దాడులు జరుగుతున్నట్లుగా తాను భావిస్తున్నానని కూడా చెప్పారు.
అంటే… జగన్ ప్రభుత్వం మద్దతుతో హిందూ మతాన్ని దెబ్బతీసే శక్తులు పెచ్చరిల్లుతున్నాయన్నది సారాంశం. ఇది సాక్షాత్తూ భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడి నోటినుంచి వచ్చిన మాట. ఇది ఏదో ఒక నివేదిక రూపంలో కేంద్రానికి కూడా ఈసరికే అందిఉండవచ్చు కూడా. తద్వారా జగన్ మీద యాంటీ-హిందూ ముద్ర పడుతోంది. ఇలాంటి వ్యాఖ్యలు నిజమేనని కేంద్రం కూడా విశ్వసించేలోగా.. జగన్ తన నిష్కళంకతను ఎలా నిరూపించుకుంటారు?
హిందూ ఆలయాల క్రతువులన్నింటిలోనూ సంప్రదాయబద్ధంగా పాల్గొంటూ, కేంద్ర పెద్దలను కలిసినప్పుడు తిరుమలేశుని ప్రతిమలను కానుకలుగా ఇస్తూ ఉండే జగన్.. అదంతా పైపైన బూటకం కాదని నమ్మించడానికి, ఇలాంటి మతపరమైన దాడుల పట్ల కఠినంగా వ్యవహరించే క్రియాశీలతను ఎంచుకోవాలి.
.

Discussion about this post