జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటినుంచి.. ఆయన కేసీఆర్ తో నెరపుతున్న సత్సంబంధాలపై అనేక దెప్పిపొడుపులు కూడా వచ్చాయి. సాధారణంగా పొరుగు రాష్ట్రాలతో స్నేహసంబంధాలు కలిగి ఉండడం.. రాష్ట్ర ప్రగతికి సంబంధించి శుభపరిణామం. గతంలో అయిదేళ్లపాటూ చంద్రబాబునాయుడు ఆ విషయంలో ఫెయిలయ్యారని అనుకున్న ప్రజలు, జగన్- కేసీఆర్ తో సత్సంబంధాలు ఉండేసరికి సంతోషించారు. పరస్పర సహకారం ఉంటుందని అనుకున్నారు.
అయితే.. కేసీఆర్ డైరక్షన్ లో జగన్ నడుస్తున్నారంటూ తెలుగుదేశం పదేపదే విమర్శించింది. అలాంటి ఆరోపణలు కూడా నిజమేనేమో అనిపించేట్లుగా.. ఇప్పుడు పరిస్థితి మారింది. సాక్షాత్తూ జగన్ కేబినెట్లోని మంత్రి చెబుతున్న మాటలే.. ఇలాంటి విమర్శలకు ఊతమిచ్చే విధంగా ఉన్నాయి. మంత్రి పేర్ని నాని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్న సమయంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దన్నారని, ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు ప్రభుత్వమే భరించడం అనేది పెద్ద గుదిబండగా మారుతుందని హెచ్చరించారని వెల్లడించారు.
ఈ మాటలను పేర్ని నాని.. జగన్ కు కీర్తి ఆపాదించడానికే చెప్పి ఉండొచ్చు గాక.. ఎంతో మంది.. వద్దన్నప్పటికీ కూడా.. జగన్ ఆర్టీసీ కార్మికులకోసం దృఢచిత్తంతో వారిని ప్రభుత్వంలో విలీనం చేశాడని చాటడానికే అని ఉండొచ్చు గాక..! కానీ.. బిట్వీన్ ది లైన్స్ ఇక్కడో సంగతి అర్థమవుతోంది. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయానికీ కేసీఆర్ గైడెన్స్ ఉంటున్నదో.. లేదా సంప్రతింపులు ఉంటున్నాయా అనిపిస్తోంది. లేకపోతే.. ఏదో ఎగువ రాష్ట్రం గనుక.. నీటి పంపకాలు వంటి విషయాల్లో పొరుగు రాష్ట్రంతో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం తప్పదు గానీ.. రాష్ట్రంలో సంక్షేమానికి సంబంధించి ప్రతి నిర్ణయాన్నీ ఆయన ముందు పెట్టి కేసీఆర్ అభిప్రాయాలు తెలుసుకోవడం జరుగుతోందా అనే సందేహం కలుగుతుంది.
పేర్ని నాని మాటలు.. జగన్ మీద సందేహాలు రేకెత్తించడం మాత్రమే కాదు.. పొరుగు రాష్ట్రం సీఎం కేసీఆర్ ఇమేజిని కూడా నష్టపరిచేవిగా ఉన్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన వ్యవహారాలు చూసుకోకుండా.. పొరుగు రాష్ట్రం తీసుకునే నిర్ణయాల్లో కూడా వేలు పెడుతూ.. అక్కడి ప్రజల సంక్షేమాన్ని కూడా అడ్డుకుంటూ.. వారి నోరు కొట్టడానికి కేసీఆర్ ప్రయత్నిస్తునానడనే అభిప్రాయాలు కలిగించేలా ఉన్నాయి. మరి పేర్ని నాని అలా ఎందుకు మాట్లాడినట్లో?
.

Discussion about this post