ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణ ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్. కానీ, తమకు తాము ఉద్యమ నాయకులుగా చెప్పుకునే తెరాస నేతలకు మాత్రం ఇది పీడకల. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇక్కడ అడుగు పెట్టరు గాక పెట్టరు. పెడితే ఎలాంటి పరాభవాలు అనివార్యంగా ఎదురవుతాయో.. ఆయనకు తెలుసు. అలాంటి నేపథ్యంలో.. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతుండగా.. అదనుచూసి.. ఎన్నికలకు గులాబీ సారథ్యం వహిస్తున్న కేటీఆర్‌కు కమలదళం ప్రత్యర్థి రామచందర్ రావు భలే సవాలు విసిరారు. ఈ సవాలును కేటీఆర్ స్వీకరించడం కష్టమే!
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఉద్యోగాల రగడ
ఉద్యోగాల కల్పనపై కేటీఆర్ తో చర్చకు సిద్దంగా ఉన్నానంటూ.. ఎమ్మెల్సీ రామచంద్రరావు మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. సోమవారం ఈ చర్చ నిమిత్తం ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని కేటీఆర్ కు రామచంద్రరావు సవాల్ విసిరారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద చర్చకు సిద్దంగా ఉంటానని.. ధైర్యముంటే ఈ చర్చకు కేటీఆర్ రావాలని అన్నారు.
తెలంగాణకు బీజేపీ ఏమి చేసిందో కేటీఆర్ తో చర్చించటానికి తాను సిద్ధంగా ఉన్నానని, అలాగే.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. యువతకు ఉద్యోగాల కల్పనలో వారేం సాధించారో ఆయన చెబితే చాలునని రామచందర్ రావు అంటున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక విధానాలను మండలిలో ప్రశ్నించే గొంతుక నాది అని చెప్పుకున్న ఈ బీజేపీ అభ్యర్థి ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర చాలా కీలకం అని, ఈ ప్రభుత్వం ప్రతిపక్షాల పీక నొక్కేయడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. తన పోరాటం వలనే అడ్వకేట్స్ కు ప్రభుత్వం వంద కోట్లు కేటాయించిందని ఆయన చెప్పుకుంటున్నారు.
అయితే ఈ సవాలును స్వీకరించి… ఉస్మానియా యూనివర్సిటీకి కేటీఆర్ వెళ్లడం అసాధ్యం అనే మాట పలువురిలో వినిపిస్తోంది. సాధారణంగానే… ఇలాంటి సవాళ్లు ప్రతి సవాళ్లకు ఎవ్వరూ స్పందించరు. ఏ అయితే ప్రత్యేకించి ఈ సందర్భంలో.. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే.. పాలక గులాబీ పార్టీలో భయం ఉన్న నేపథ్యంలో.. వ్యూహాత్మకంగా బీజేపీ అదే స్థలాన్ని వేదికగా ఎంచుకుని చర్చకు పిలవడం మరింత ఇరుకున పెట్టే అంశం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
.

Discussion about this post