ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి నిర్వహించిన సమావేశంలో పార్టీ సారథి కేటీఆర్.. నాయకులపై ఫైర్ అయ్యారు. కొందరు నాయకులు పనిచేయకుండా తప్పించుకోవాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఎవరు పనిచేయడంలేదో గమనిస్తున్నాం అని.. వారి స్థానంలో మరొకరిని ప్రోత్సహిస్తామని కూడా హెచ్చరించారు.
పార్టీ నేతలతో సమావేశంలో శనివారం నిర్వహించిన సమావేశంలో సీరియస్ అయిన కేటీఆర్ పార్టీ నేతలకు క్లాస్ తీసుకున్నారు. అలిగి ప్రచారం చేయకుండా ఉంటె చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మిమ్మల్ని ఎవరు బతిలాడరని, ఈ మీటింగ్ కు ఎవరు రాలేదో చూస్తున్నానని అన్నారు.
పదవుల కోసం ఎన్నో ఏళ్ళు ఎదురుచూసిన వాళ్ళుంటారు, అవకాశాన్ని బట్టి పదవులొస్తాయ్.. అంతే తప్ప, మేము పని చేయం అని మీరు అంటే చూస్తూ ఉరుకోము…మీరు కాదంటే కొత్త నేతలతో పని చేయిస్తాం అని తారక రామారావు నేతలకు చెప్పుకొచ్చారు.
గెలిచి తీరాల్సిన ఎన్నికలివి..
హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన నగర ఎమ్మెల్యేలు మరియు కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులతో తెలంగాణ భవన్ లో సమావేశమైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు వారికి దిశానిర్దేశం చేశారు. ఏ పార్టీకైనా ప్రతి ఎన్నిక అత్యంత కీలకమైనది అనే విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసికట్టుగా ముందుకు నడిచి విజయం సాధించే దిశగా కార్యక్రమాలు తీసుకుందామని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు.
పార్టీ అభ్యర్థి పీవీ నరసింహారావు కూతురు సురభి వాణి దేవి అభ్యర్థిత్వాన్ని మన ప్రత్యర్థులు సైతం అభినందించేంత సానుకూల పరిస్థితులు మనకు ఉన్నాయని, ఆమెకున్న అత్యంత క్లీన్ ఇమేజ్ కచ్చితంగా గ్రాడ్యుయేట్లకు నచ్చుతుందనే నమ్మకం ఉన్నదని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే అన్ని వర్గాల నుంచి మన పార్టీ అభ్యర్థికి సానుకూల స్పందన లభిస్తున్నదని చెప్పారు.
ప్రతిపక్ష పార్టీ ముఖ్యంగా బీజేపీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా అసత్య ప్రచారాలు చేయడమే తన పనిగా పెట్టుకుందని, మిషన్ భగీరథ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం ద్వారా ఇంటింటికీ నల్ల నీరు మన ప్రభుత్వం అందిస్తోంటే బిజెపి నాయకత్వం తమ ఘనతగా చెప్పుకుంటున్నదని ఎద్దేవా చేశారు. వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా తమ ఆసత్యాలను పంచుకుంటున్నదన్నారు.
బిజెపి చేస్తున్న అసత్య ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని, ఇంత పెద్ద ఎత్తున నిర్భయంగా అసత్యాలను ప్రజల్లోకి తీసుకుపోతున్న ఆ పార్టీ తీరును మనం ప్రజల్లో ఎండగట్టాలని అన్నారు. తెలంగాణలో ఓట్లు అడిగేందుకు బిజెపి వద్ద ఒక్కటంటే ఒక్క కారణం కూడా లేదన్నారు. పెరిగిన ధరలు ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను ప్రతి ఒక్కరికి గుర్తు చేయాలన్నారు. మన ప్రభుత్వం గత ఆరు సంవత్సరాలుగా చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మన బాధ్యతగా గ్రాడ్యుయేట్ల కి మరోసారి గుర్తు చేయాలన్నారు. ఉద్యోగాల భర్తీ పైన ప్రతిపక్షాల అసత్యాలను దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలన్నారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో లేని విధంగా ఇప్పటికీ 133000 ఉద్యోగాలను మనం భర్తీ చేశాం అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలోనూ సుమారు 14 లక్షల ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడంలో మనం విజయం సాధించాం అని ప్రకటించారు.
తెరాస ప్రభుత్వ విధానాలు పరిపాలన వలన హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతున్న తీరు తద్వారా జరిగిన సానుకూల మార్పును తెలియజేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో తెరాసది పేగుబంధం అంటూ ఉద్యోగులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ఏర్పాటు కాగానే భారీ పీఆర్సీని మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారన్నారు.
.

Discussion about this post