‘జగమునేలిన తెలుగు’ తెలుగుభాష ఆనవాళ్లు మరుగవుతున్నాయని అందరూ ఆలోచిస్తున్న ఈరోజుల్లో.. సుమారు ఒకటిన్నర సహస్రాబ్ది కిందటి ఇదే తెలుగు జాతి ప్రాచీన వైభవ ఆనవాళ్లను వెతికిపట్టి.. మనందరికీ పరిచయం చేసే పుస్తకం.
ఆ తెలుగుజాతి ప్రాచీన వైభవం.. సిద్ధాంత, పరిశోధన వ్యాసాలుగా సెమినార్లలో వినిపించే సమాచారం రూపంలో మేధావుల వర్గానికి వెల్లడయ్యేది మాత్రమే కాదని నిరూపించి.. సృజనాత్మక సాహిత్యం రూపంలో తెలుగులో ప్రతి సామాన్య పాఠకుడికి కూడా చేరువ అయ్యేలా చేసిన ప్రయత్నం.
సీనియర్ పాత్రికేయురాలు డి.పి. అనురాధ రాసిన ‘జగము నేలిన తెలుగు- గోదావరి నుంచి జావా దాకా.. చరిత్ర లోకి అన్వేషణ’ నవల చదివితే.. ఇవాళ్టి తెలుగు ప్రజలకు ఒక తప్పనిసరి అవసరం అనిపిస్తుంది.
చాలా ఆసక్తి కరంగా సాగే నవల ఇది. పఠనీయం. ఆలోచింపచేసేదిగా ఈ చారిత్రక పరిశోధన నవల ఉంది. ఇన్ని దేశాలు తిరిగి రావడానికి, ఫోటోలు, వ్యక్తుల సహా.. సమాచార సేకరణకు, సేకరించిన అనల్పమైన సమాచారాన్ని గుదిగుచ్చి ఒక పుస్తకంగా రాయటానికి రచయిత్రి డిపి అనురాధ పడ్డ శ్రమ మనకు పుస్తకంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆ శ్రమలో ఇసుమంత కూడా వృథా కాలేదన్నది నా నిశ్చితాభిప్రాయం.
ఏళ్ల తరబడి పరిశ్రమ.. పరిశోధన.. వాటికి తగిన ఆధారాలు.. రుజువులూ.. చిత్రాలు.. రచయిత్రి ప్రయాణం.. ప్రయత్నం ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగా అభినందించదగినవి.
తెలుగుజాతి చరిత్ర గురించి లోతైన అవగాహన లేని వారికి, ఈ పుస్తకం చదువుతోంటే ప్రతి పేజీ కూడా కనుల ముందు ఓ అద్భుతం లాగా ఆవిష్కృతమవుతుంది. తెలుగుజాతి ప్రాచీన మూలాలు ఇంత సుసంపన్నమైనవా అనే గర్వం కలుగుతుంది. చరిత్ర తెలియని వారిని ఈ పుస్తకం ఎంతగా అబ్బురపరుస్తుందో.. చరిత్ర తెలిసిన వారిని.. ఆగ్నేయాసియా దేశాలలో తెలుగు జాతి విస్తరణ గురించి అంతో ఇంతో అవగాహన ఉన్న వారిని కూడా అదేస్థాయిలో అబ్బుర పరుస్తుంది. పుస్తకంలో ఉన్న గాఢత, తెలుగుజాతి మూలాల అన్వేషణలో ఉన్న పటిమ అలాంటివి.
నవల చదువుతోంటే అప్పుడప్పుడు అవునా.. నిజమేనా.. తెలుగు జాతీయులు ఏళ్ల కిందటే ఇంత విస్తరించారా.. ఇప్పటికీ అనేక దేశాల్లో ఇంతగా ఉనికి చాటుతున్నారా.. గౌరవం పొందుతున్నారా అని అన్పిస్తుంది. గర్వంగా అనిపిస్తుంది.
అదంతా ఒక ఎత్తు అయితే.. సరళమైన భాష.. పదాలు.. వాక్యాలు.. ఇవన్నీ కలిసి.. అంత సుదీర్ఘమైన పరిశోధనను మనసుకు హత్తుకునే ఒక చిన్న ప్రేమకథను అంతర్లీనంగా అల్లి.. మనలోకి చేరవేస్తాయి. మొత్తానికి చాలా మంచి ప్రయత్నం.
అంతే కాకుండా పూజ్యనీయలు, విజ్ఞానఖని, మాలాంటి వారెందరికో ప్రియ గురువులైన తల్లాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి పేరును సముచితమైన రీతిలో రాష్ట్రపతి పాత్రకు వాడుకోవడంలో రచయిత్రి పరిణితి, గురుభక్తి కనిపిస్తుంది. ఈ నవలను సీరియల్ గా ప్రచురించిన ‘అమ్మనుడి’ సంపాదకుడు సామల రమేష్‌బాబుకు, నవలగా ప్రచురించిన తెలుగుజాతి ట్రస్టు వారిని కూడా తప్పకుండా అభినందించాలి.
ఏది ఏమైనా ఈ పుస్తకం తెలుగు వారందరూ.. మరీ ముఖ్యం గా చరిత్ర అధ్యయనానికి సంబంధించిన వారు, చరిత్ర తెలుసుకునే ఆసక్తి ఉండేవారు అందరూ తప్పక చదవాలి. అలాగే రచయిత్రి ఈ పుస్తకాన్ని డిజిటల్ రూపంలో కూడా తీసుకొని వస్తే బావుంటుంది. రచయిత్రి డి.పి. అనురాధ.. తెలుగుజాతి వైభవం అందరికీ తెలిసేలా భవిష్యత్ లో మరిన్ని మంచి పుస్తకాలు రాయాలని ఆశించవచ్చు.
.. తాళ్లూరి మార్క్స్ బాబు
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
Discussion about this post