ఇప్పుడు దేశవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి ఎలాంటి తేడాలు లేకుండా సాద్యమైనంత వరకు అందరినీ పలకరించి పోతోంది. కొందరిని సాంతం ముంచేస్తే… మరికొందరు వైద్య ప్రభావం, వారి శరీరంలోని రోగనిరోధక శక్తి ప్రభావం ఏదైతేనేం బతికి బయటపడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పటికీ రోడ్లపై చాలామంది అజాగ్రత్తగానే తిరుగుతున్నారు.
కొవిడ్ జాగ్రత్తలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ముఖానికి మాస్కు ధరించడం. అయితే ఇప్పడు రోడ్డుపై వెళుతున్న వారిలో పదిమందిలో కనీసం ఐదుమంది మాస్కులు ధరించడం లేదంటే కొవిడ్ విషయంలో వారు ఎంతటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలుస్తోంది. ఇలాంటి వాళ్ల వల్లే ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోంది అని చెప్పవచ్చు. మొన్నటి వరకు లాక్ డౌన్ నిబంధనలు ఉండడం వల్ల మాస్కు లేకుండా బయటికి వస్తే పోలీసులు తమ ప్రతాపం చూపిస్తూ వచ్చారు. పోలీసులు లాఠీ ఝళిపించడం పలువురి విమర్శలకు కూడా దారితీసింది. తీరా ఇప్పుడు లాక్ డౌన్ నిబంధనలను సడలించేశారు. దీంతో చాలామంది కొవిడ్ జాగ్రత్తలను పాటించడం లేదు. దీంతో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వాలు కూడా ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపధ్యంలో మాస్కు లేకుండా రోడ్డుపైకి వెళితే సదరు వ్యక్తిని పది గంటలపాటు జైల్లో పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని కలెక్టర్ మాస్కు పెట్టుకోని వారిని పది గంటలపాటు జైల్లో ఉంచాలని తీర్మానించారు. దీనికి సంబంధించిన గైడ్ లైన్సు కూడా ఆయన విడుదల చేశారు. ఈ విషయంగా కలెక్టర్ ఆశీష్ సింగ్ మాట్లాడుతూ కొవిడ్ మహమ్మారిని అదుపులోకి పెట్టాలంటే మాస్కు కచ్చితంగా ధరించాలని, అలాగే సోషల్ డిస్టెన్స్ పాటించని వారిపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు. పోలీసులు కూడా ఇంటింటికీ తిరిగి కరోనా బాధితుల పేర్లను, వివరాలను సేకరించి, వారు బయట తిరగకుండా చూడాలని ఆయన ఆదేశించారు. మొత్తానికి ఉజ్జయిని కలెక్టర్ తీసుకున్న నిర్ణయం కరోనా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని కట్టడిచేస్తే… అలాగైనా కరోనాను కట్టడి చేయవచ్చేమో.. చూద్దాం.!
Discussion about this post