పీతల మంగం అంటే ఏమిటో తెలుసా..?
పీతల్ని పట్టుకొన్న తరవాత వాటిని వేసే బుట్టను మంగం అంటారు. కింద వెడల్పుగా.. పైన మూతి సన్నగా అందులోంచి ఒక పీత మాత్రమే వేసేలా ఉంటుంది. అందులో వేసిన పీతలు మళ్ళీ పైకి ఎగబాకి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంటాయి. ఒకటి పైకి ఎక్కుతోంటే మిగతావి కిందకు లాగేస్తుంటాయి. అందుకే, ఐకమత్యం లేకుండా ఉండేవాళ్ళను ‘పీతల మంగం’తో పోలుస్తుంటారు. సరిగ్గా ఈ మాట ఇప్పుడు తెలుగు సినిమా వాళ్ళకు అన్వయించవచ్చు.
సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలిపేస్తోంది.. భయపడకుండా వెళ్ళి చర్చించండి.. అని పవన్ కల్యాణ్ కొంతకాలం కిందట అంటే.. సినిమా పరిశ్రమకు పెద్ద తలకాయలాంటి ఫిల్మ్ ఛాంబర్ నేతలు భయపడ్డారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాకు సంబంధం లేదు అంటూ లేఖలు ఇచ్చారు. అప్పటి నుంచి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమావాళ్లను వంచడం మొదలుపెట్టి ఇప్పుడు నేల నాకించేస్తోంది.
వైసీపీ పార్టీకి స్టార్స్.. బడా నిర్మాతలు.. దర్శకులు అండగా లేరు అనేది మొదటి నుంచి అందరికీ తెలిసిన విషయమే. జగన్ అధికారంలోకి వచ్చిన తరవాత వైసీపీ ముఖ్యులు సినిమా వాళ్ళను దారిలోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని అస్త్రాలు సిద్ధం చేశారు. పవన్ కల్యాణ్ మీద కక్ష సాధింపు కలర్ ఇచ్చినా వాళ్ళ టార్గెట్ మాత్రం టాలీవుడ్ అనేది కాలక్రమంలో బోధపడింది. వీళ్లపై ట్యాక్స్ లు పెంచో.. మరో విధంగానో కాకుండా ఆర్థిక మూలాల మీద కొడితే అన్నీ దారిలోకి వస్తాయని చూపించారు.
అందుకే బాక్సాఫీసును కొట్టారు. టికెట్స్ ఆన్లైన్ విధానంతోపాటు, టికెట్ ధర తగ్గింపు వరకూ అన్నీ నిర్మాతలను, తద్వారా స్టార్స్ మార్కెట్‌ను ప్రభావితం చేసేవే. సినిమా నిర్మాతలు, స్టార్స్ తో వైసీపీ ప్రభుత్వానికి ఉన్న ఘర్షణ అంతిమంగా సినిమా హాల్స్ యజమానుల వ్యాపారాన్ని కొట్టింది.
వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చిత్ర పరిశ్రమ మనుగడను ప్రభావితం చేస్తాయి అనే వాస్తవాన్ని ప్రజలకు తెలియచేయడంలో తెలుగు సినీ పెద్దలు విఫలం అయ్యారు. ముందుగా ప్రభావంపడే సినిమా హాళ్లలో ఎంతమందికి ఉపాధిపోతుంది అనేది కూడా చెప్పలేకపోతున్నారు. సినిమా టికెట్ ధరల తగ్గింపులో శాస్త్రీయత ఏమిటి.. ఆన్లైన్ టికెట్ విధానం ఏ మేరకు ఆచరణ సాధ్యం అనే ప్రశ్నలను లేవనెత్తలేకపోయారు. అలాగే సినిమా ఇండస్ట్రీ పెద్దలు ధైర్యం చేసి ఏపీ ప్రభుత్వంతో చర్చించలేకపోయారు.
సెప్టెంబర్ 25వ తేదీన రిపబ్లిక్ సినిమా వేడుకలో పవన్ కల్యాణ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని వైసీపీ టార్గెట్ చేసిన తీరుని ఎండగట్టారు. సినిమా హాల్ దశ నుంచి కట్టడి చేసే పనిలో వైసీపే ప్రభుత్వం ఉంది అనే విషయాన్ని చెబుతూ సినిమా వ్యాపారం అనేది సంపద సృష్టిలో భాగమే.. సంపద సృష్టించకుండా డబ్బులు ఎలా వస్తాయి అని ప్రశ్నించారు. నా పై కోపాన్ని ఇండస్ట్రీపై చూపిస్తున్నారు.. అలా చేయవద్దు అన్నారు. ఎవరు కూడా భయపడొద్దు. నిజాయితీగా మాట్లాడండి అని సినిమా పెద్దలకు సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడే బాధ్యతను మోహన్‌బాబు తీసుకోవాలన్నారు. ‘మోహన్ బాబు గారు కూడా స్పందించాలి. చిత్ర పరిశ్రమను హింసించొద్దు. మీరు బంధువులు కదా, పవన్ కళ్యాణ్ సినిమాలను ఆపండి కాని చిత్ర పరిశ్రమ జోలికి వెళ్లొద్దు అని చెప్పండి. వారు చిత్ర పరిశ్రమకు అప్లై చేసిన రూల్ మీ స్కూల్‌కి కూడా అప్లై చేయొచ్చు. కాబట్టి మీరు వారికి చెప్పండి’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
అంటే ఏదొక రోజు వైసీపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తుందని ముందుగానే అందరినీ హెచ్చరించారు. మీ పథకాల కోసం మమ్మల్ని బలి చేస్తారా అంటూనే ప్రైవేటు పెట్టుబడితో సినిమా తీస్తే ప్రభుత్వ పెత్తనమేంటి? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ రిపబ్లిక్ వేడుకలో లేవనెత్తిన అంశాలు, సూచనలు, హెచ్చరికలు, ప్రశ్నలు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, రాజకీయంగాను, ప్రజల్లోనూ చర్చకు దారి తీశాయి. వైసీపీ ప్రభుత్వ వైఖరిపై ఆ రోజే సినీ పరిశ్రమ నిజాయతీతో చర్చించుకొని, ప్రభుత్వంతో సమాలోచనలు చేసుకోవాల్సింది. అది చేయకపోగా ఫిల్మ్ చాంబర్ అధ్యక్షులు నారాయణదాస్ నారంగ్ ఒక లేఖ విడుదల చేసి అది పవన్ కల్యాణ్ వ్యక్తిగత అభిప్రాయం ఇండస్ట్రీకి సంబంధం లేదు అంటూ ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగానే చెప్పారు.
ఆ క్రమంలోనే వైసీపీ మంత్రులు పవన్ కల్యాణ్ పై మాటల దాడి పెంచారు. దిల్ రాజు, బన్నీ వాసు, మైత్రీ మూవీస్ నవీన్ లాంటివాళ్లు ఉరుకులుపరుగుల మీద మచిలీపట్నం వెళ్ళి మరీ రాష్ట్ర మంత్రి పేర్ని నాని దగ్గరకు వెళ్ళి ఆన్లైన్ టికెట్ విధానం ఆహా ఓహో అన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్న స్థాయిలో మాట్లాడారు. తీరా నారాయణదాస్ నారంగ్ తీసిన లవ్ స్టోరీ సినిమా సమయంలోగానీ ఆయనకు నొప్పి తెలియలేదు. అఖండ, పుష్ప లాంటి సినిమాల వసూళ్లపై ఏపీ థియేటర్ టికెట్ ధరల తగ్గింపు ప్రభావం, ప్రత్యేక షోలు రద్దు కూడా పడింది.
టికెట్ ధరలు నియంత్రిస్తూ ఇచ్చిన జీవో నెం.35పై కొంతమంది ఎగ్జిబిటర్లు హైకోర్టుకు వెళ్తే ఆ జీవోను సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ అనేది కోర్టుకు వెళ్ళిన సినిమా హాళ్లకే వర్తింపు అంటూ రాష్ట్ర హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ మెలిక వేశారు. చివరకు ఆ మెలికను కూడా హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు సినిమా హాల్స్ లైసెన్స్ లు, ఫైర్ సర్వీస్ అనుమతులు, క్యాంటిన్ ధరలు లాంటి అంశాలపై దృష్టిపెట్టి దాడులు చేస్తూ థియేటర్ యాజమానుల నుంచి నిర్మాతల వరకూ అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. టికెట్ ధరలపై కోర్టు ద్వారా తేల్చుకొంటారు సరే.. రెవెన్యూ, ఫైర్, మున్సిపల్, హెల్త్ డిపార్టుమెంట్ లతో ముడిపడ్డ అంశాలలో బిగిస్తే ఏం చేస్తారు అని పంతానికి పోతున్నట్లుగా ఉంది ప్రభుత్వ వైఖరి.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
ఈ వివాదం నడుస్తుండగానే హీరో నాని చేసిన కామెంట్స్ మరింత హీట్ పెంచాయి. ‘టికెట్ ధరలు తగ్గించి ప్రజలను అవమానించారు’ అనడంతో వైసీపీ ప్రభుత్వానికి మండింది. ధరలు తగ్గిస్తే అవమానించడం ఎలా అవుతుంది? మేం దోపిడీని అరికడుతున్నాం అని ఏకీపారేయడం మొదలుపెట్టారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగాక ధరలు తగ్గించడం వారి కొనుగోలు శక్తిని అవమానించడమే అనే కోణంలో అంటూనే సినిమా హాల్ కలెక్షన్ కంటే కిరాణా కొట్టు కలెక్షన్ బెటర్ గా ఉంది అని నాని అన్నారు.
నాని మాటల్లో వాస్తవం ఉంది అని నిర్మాతలు కూడా ఒప్పుకొంటున్నారు. నిర్మాత శోభు యార్లగడ్డ కూడా టికెట్ ధరల తగ్గింపుపై ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడారు.
ఇప్పటికీ తెలుగు సినిమా పెద్దల్లో భయంపోలేదు. బయటకు వచ్చి మాట్లాడితే వైసీపీవాళ్ళ నుంచి ఇంకెన్ని ఇబ్బందులు వస్తాయో అనే వణుకు ఉంది. సెప్టెంబర్ 25న పవన్ కల్యాణ్ మాట్లాడిన దాంట్లో నిజం ఉంది అని ఇప్పుడు అంతర్గత చర్చల్లో ఒప్పుకొంటున్నారు. ఆ రోజు నుంచి మాట్లాడటం మొదలుపెట్టి ఉంటే సమస్య ఇంతదాకా వచ్చేది కాదు అంటున్నారు.
ఇప్పుడు నాని కామెంట్స్‌తో ఏడవలేకపోతున్నారు. బయటకు వచ్చి తమ బాధ చెప్పుకొంటే చులకనైపోతాం.. ఆ రోజు పవన్ చెప్పినప్పుడే ధైర్యం చేసి ఉండాల్సింది అనే మాటలు పడాల్సి వస్తుంది అని ఇండస్ట్రీ తలకాయల కంగారు! ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ సినిమా పెద్దల తీరుని తప్పుబడుతున్నారు. సంక్రాంతికి వచ్చే పెద్ద సినిమాల వరకూ చూసీచూడనట్లు వదిలేస్తామ్.. ఆ తరవాత వచ్చే భీమ్లా నాయక్ ను అడ్డుకొంటామ్ అని ఎవరైనా రాయబారం నడిపితే ఇండస్ట్రీ పెద్దలు కిమ్మనకుండా ఉంటారు. పాలకులకు తెలుసు – సినిమావాళ్ళల్లో ఐకమత్యం ఉండదు.. ఎవరి సొంత గోల వాళ్ళదే – ఇదొక ‘పీతల మంగం’ అని.
.. భాస్కర రావు
Discussion about this post