ఎన్నికలు రాగానే పోసాని తెగ యాక్టివేట్ అవుతాడు.. ఆవేశంగా అరిచి అరిచి ఉపన్యాసాలు ఇస్తాడు. ఆంధ్రలో, వచ్చినా, తెలంగాణలో వచ్చినా మనోడికి ఫరక్ లేదు. ఎడాపెడా ఒక పార్టీకి అనుకూలంగా ఉపదేశాలిస్తాడు. ఆంధ్రలో అయితే… జగన్మోహన రెడ్డి అనుకూల వైఖరి.. జగన్ కోసమే ఏమో గానీ.. ఇక్కడ టీఆర్ఎస్ అనుకూల వైఖరితో చెలరేగిపోతున్నాడు…
హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో దర్శకుడు ఎన్.శంకర్, పోసాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సహజంగానే పోసాని- కేసీఆర్ కు తెగ సపోర్టిచ్చారు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికల్లో ప్రజలంతా తెరాసకే ఓటు వేయాలని ఈ సందర్భంగా ఆయన గ్రేటర్ ప్రజలను అభ్యర్ధించారు. ఢిల్లీలో అంత పెద్ద మనిషి (?) కూడా ఏమీ చేయలేకపోయారని, కానీ కేసీఆర్ తెలంగాణలో పలు మంచిపనులు చేశాడని, అయితే కొన్నింటిని మాత్రం చేయలేకపోయారని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
అసలు ముఖ్యమంత్రి అంటే అప్పట్లో ఎన్టీఆర్ తర్వాత ఇప్పుడు కేసీఆరే నని, కేసీఆర్ హైదరాబాద్ లో మతకలహాలు లేకుండా చేశాడని అన్నారు. తాను విమానంలో వెళుతుంటే కిందికి చూస్తే తెలంగాణ అంతా పచ్చగా కనిపించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
నిజానికి కేసీఆర్ కు కొందరు ఆంధ్రా నాయకులంటేనే కోపమని..(?), కానీ ఆయనకు ప్రజల మీద ఎలాంటి కోపం లేదని కితాబిచ్చారు. ఇదే హైదరాబాద్ లో వంద సంవత్సరాల క్రితం పెద్ద వర్షం వస్తే అప్పటి నవాబు ఒక్కరిని కూడా కాపాడలేకపోయారని, అయితే కేసీఆర్ వరదబాధితులను ఆదుకొనేందుకు ఏదో ప్రయత్నం చేశారని, నిజానికి నాలాలను ప్రజలు, ఛోటామోటా నాయకులే కబ్జా చేశారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు.
నిజానికి అంతపెద్ద వరద వచ్చినపుడు కేసీఆర్ కాదు… ఇంకో వందమంది కేసీఆర్ లు వచ్చినా కూడా ఏమీ చేయలేరని ఆయన అన్నారు. తెలంగాణలో కేసీఆర్ లక్షల కోట్లు పెట్టి పలు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టారని, కానీ నిధులు లేని కారణంగా వాటి పనులు మెల్లిగా నడుస్తున్నాయని ఆయన అన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రత్యేక కథనాల కోసం click చేయండి
ఇప్పుడుకూడా ముఖ్యమంత్రిని గెలిపిస్తేనే హైదరాబాద్ మరింతగా అభివృద్ధి చెందుతుందని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఆరేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించిరని, అయితే అన్ని పనులను ఒకేసారి చేయాలంటే ఎవరికి కూడా సాధ్యం కాదని ఈ సందర్భంగా కేసీఆర్ ను వెనకేసుకొచ్చారు.
పోసాని సాధారణంగా ఏపీలో ఎన్నికలు వచ్చినప్పుడు చాలా చురుగ్గా ప్రెస్ మీట్లు పెడుతూ.. తాను ఓటర్లను ప్రభావితం చేసేయగలను అనుకుంటూ మాట్లాడేస్తుంటాడు. ఇప్పుడు చూస్తోంటే.. ఆయనకు తాను హైదరాబాద్ నగర ఓటర్లను కూడా ప్రభావితం చేసేయగలను అనే భావాలతో ఉన్నట్టుగా ఉన్నాడు.
.

Discussion about this post