దేశభక్తి అంశంగా తెలుగు సినిమాలు ఎప్పటినుంచో వస్తున్నాయి. అయితే ఎక్కువ శాతం సినిమాలు సైనికులు సెలవులో వచ్చినప్పుడు సమాజంలో అన్యాయాలపై చేసే తిరుగుబాటు, పోరాటం అంశాలుగా వచ్చినవే. అయితే అడవి శేష్ ‘మేజర్’ సినిమా దేశ భక్తిని, పోరాటాన్ని ప్రధాన అంశంగా తీసుకుని చేసిన ప్రయత్నం.
ముంబై లో 2009 లో ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమంలో వీరోచితంగా బందీలను రక్షించి అసువులు బాసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం స్ఫూర్తి గా తీసుకుని తీసిన ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి.
కథ విషయానికి వస్తే సందీప్ (అడవి శేష్) కి చిన్న తనం నుంచే దేశ సేవ చేయాలని ఉంటుంది. డాక్టరో, ఇంజనీరో కావాలని తల్లిదండ్రులు కోరుకుంటారు.
ఇంటర్ చదువుతున్నప్పుడు ఇషా (సాయి మంజ్రేకర్) పరిచయం అవుతుంది. ఎన్ డీ ఏ పరీక్ష రాయాలని నిర్ణయం తీసుకుంటాడు గానీ తల్లితండ్రులకు చెప్పడు. సందీప్, ఇషా ఒకరి నొకరు ఇష్టపడతారు. ఎన్ డీ ఏ లో అడ్మిషన్ రాగానే తల్లితండ్రులను ఒప్పించి పూణే వెళతాడు. ట్రైనింగ్‌లో ప్రధ ముడిగా నిలుస్తాడు. ఇషా ను పెళ్ళిచేసుకుంటాడు. బొంబాయి లో తాజ్ హోటల్ లో ఉగ్రవాదులు దాడి చేస్తారు. ట్రైనింగ్ లో వున్న వారిని ఆపరేషన్స్ కి పంపరు. అయినా బాస్ ను ఒప్పించి మిలిటరీ ఆపరేషన్ లో పాల్గొంటాడు సందీప్.
ఈ తరహా సినిమా తీయడం చాలా కష్టం. చాలా లోకేషన్స్ లో తీయాల్సి ఉంటుంది. అయితే అడవి శేష్ బృందం మంచి స్క్రిప్ట్ తో, గొప్ప ప్రొడక్షన్ డిజైన్ తో ఈ సినిమా తీసింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే సందీప్ కుటుంబ సన్నివేశాలు అంత గొప్పగా అనిపించవు. అయితే సందీప్, ఇషా ప్రేమ వ్యవహారం ఆసక్తి కరంగా ఉంది. ఇషా “ఐ లవ్ యు” చెప్పే సన్నివేశం బావుంది.
ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఇషా రాసిన లెటర్స్ సందీప్ కు చేరవు. అన్ని లెటర్స్ ఒకే సారి చూస్తాడు. ఆ సన్నివేశం గొప్పగా ఉంది.
అబ్బూరి రవి డైలాగ్స్ బాగున్నాయి. సైన్యం లో కి వెళ్ళ వద్దన్న తల్లితో “ప్రతి అమ్మా ఇలా ఆలోచిస్తే ఎలా” అంటాడు సందీప్. “నువ్వు ఒంటరి గా ఉన్నావని రాలేదు, నీ ఒంటరితనం పోగొట్టాలని వచ్చాను’’ ఇలాంటి మంచి డైలాగులు ఉన్నాయి.
శశి కిరణ్ తిక్క దర్శకత్వం బావుంది. కథ, స్క్రీన్ ప్లే అడవి శేష్ ది ఆయినా దర్శకుడు పని తీరు ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది. సందీప్ వ్యక్తి గత జీవితంలో ఒడి దుడుకులును ప్రధాన కథకు బాగా కలిపి అతని అంకిత భావాన్ని బాగా హైలైట్ చేశారు.
సినిమా చివర్లో సందీప్ చనిపోయినప్పుడు అతను కూర్చుని వున్న విధానం గ్రేస్ ఫుల్ గా వుంది. చరణ్ పాకాల నేపథ్య సంగీతం సూపర్.
ద్వితీయార్థం లో సినిమా పట్టుగా సాగుతుంది. ఒక పక్క హోటల్ లో పోరాట దృశ్యాలు, భార్యాభర్తల మధ్య విబేధాలు, తల్లితండ్రుల ఆందోళన ..
అన్ని అంశాలను చక్కగా కలుపుకుంటూ, టెంపో ను మెయింటైన్ చేశాడు దర్శకుడు.
ఫోటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల విషయానికి వస్తే అడవి శేష్ తన పాత్రలో అద్భుతంగా రాణించాడు. సాయి మంజ్రేకర్ ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్ అయితే గొప్పగా చేశాడు. అలాగే మురళీ శర్మ, సోబిత దూలిపాల.. అందరూ బాగా నటించారు. మేజర్ సందీప్ పోరాటం, మరణం మనను కంటతడి పెట్టిస్తుంది. మనలో దేశభక్తిని రగులుస్తుంది.
Discussion about this post