పరాక్రమానికి ప్రతిరూపమై దుష్టశిక్షణ చేసే దుర్గామాతను దుర్గాసూక్తం ద్వారా పఠిస్తే సంసార సాగరంలో ఉన్న దుర్గతులు తొలగిపోతాయని ఎస్వీ వేద వర్సిటీ రిజిస్టార్ ఆచార్య అంబడిపూడి రాధేశ్యామ్ ఉద్ఘాటించారు. టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని మైదానంలో జరుగుతున్న శ్రీ శ్రీనివాస చతుర్వేద హవనం శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. రాత్రి 7 గంటలకు ఆచార్య రాధేశ్యామ్ “దుర్గా సూక్తము – విశిష్టత” అనే అంశంపై ఉపన్యసిస్తూ దుర్గా సూక్తాన్ని పఠించడం ద్వారా శత్రుత్వం నశిస్తుందని, శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారని చెప్పారు. నిశ్చలంగా ఉన్న నీటిపై పడవ ప్రయాణం ఎంత హాయిగా సాగుతుందో, అదేతరహాలో దుర్గామాత మనల్ని రక్షించి సంసార సాగరాన్ని తేలికగా దాటిస్తుందన్నారు.
కాగా, ఉదయం చతుర్వేద హవనంలో భాగంగా విష్ణుసూక్తం, గరుడ సూక్తం, ఇంద్రాది దేవతలు, అగ్ని, వరుణ సంబంధిత వేదమంత్రాలు, పంచభూతాలను పవిత్రం చేసే దేవతా సూక్తాలను పండితులు పఠించారు.
ఆకట్టుకున్న భక్తి సంగీత కార్యక్రమాలు
సాయంత్రం జరిగిన భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు డా.కె.వి కృష్ణ బృందం వయోలిన్ కచేరీ జరిగింది. ఈ బృందానికి మృదంగంపై కె.యస్ శంకర్, ఘటంపై రఘురాం సహకారం అందించారు. సాయంత్రం 6.30 నుండి 7 గంటల వరకు ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు వి.సురేష్ బాబు బృందం సంగీత కచేరీ నిర్వహించారు. రాత్రి 8 నుండి 8.30 గంటల వరకు సి.హరనాథ్ బృందం “బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం” నృత్య రూపకాన్ని చక్కటి హావభావాలతో
పద్రర్శించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవో సదా భార్గవి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ, ఎస్వీ సంగీత కశాశాల ప్రిన్సిపాల్ ఉమా ముద్దుబాల ఇతర అధికారులు పాల్గొన్నారు.
Discussion about this post