తిరుమల వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి టికెట్ల విషయంలో బ్లాకులో విక్రయించే దళారీలు యథారీతిగా చెలరేగిపోతున్నారు. సుపథం టికెట్లను కూడా బ్లాకులో విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిఆర్వో ని అని చెప్పుకుంటూ ఈ టికెట్ల దళారీదందా నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు.
స్వామివారి ప్రత్యే దర్శనం టికెట్ రూ.300 ఉంటుంది. దీనినే సుపథం టికెట్ గా వ్యవహరిస్తుంటారు. ఇవి పొందడం కూడా అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఆన్ లైన్ లో కొందరికి లభిస్తాయి. వీఐపీల, ఎమ్మెల్యేల సిఫారసు ఉత్తరాలకు కొన్ని కేటాయిస్తుంటారు. ఏ కోటాలోంచి దారి మళ్లిన టికెట్లో గానీ.. మొత్తానికి సుపథం టికెట్లు బ్లాక్ మార్కెట్ కు చేరాయి. తిరుమలలో దళారీని పోలీసులు అరెస్ట్ చేశారు.
కాణిపాకం ఆలయంలో అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న కరుణాకర్ అనే వ్యక్తి తిరుమలలో పిఆర్ఓ అంటూ చలామణి అవుతున్నాడు. ఇంతకూ అతను చేసేది.. కాణిపాకం ఆలయంలో గ్యాస్ ఆపరేటర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగం. 300 రూపాయల సుపధం ఎంట్రీ టికెట్లు 12 టికెట్లను 32 వేలకు కరుణాకర్ అమ్మినట్లు గుర్తించారు. భక్తుల ఫిర్యాదుతో కరుణాకర్ ను తిరుమల టు టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇందులో కాణిపాకం ఏఈఓ కు సంబంధం ఉందా లేదా అన్న విషయమై సందేహాలున్నాయి. కాణిపాకం ఏఈఓ ని కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.
.

Discussion about this post