రాష్ట్రంలో సంవత్సరాల తరబడి రగులుతున్న సంచలన కేసులో.. ఎట్టకేలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి.. కేసును సీబీఐకు అప్పగించడానికి అంగీకరించారు. ఈ విషయంలో తమ కుమార్తెకు జరిగిన అన్యాయం గురించి ఆవేదన చెందుతున్న తల్లిదండ్రులకు ఆయన ఊరట కలిగించారు. ఈ కేసును సీబీఐకు అప్పగించాల్సిందేనంటూ గతంలోను పలుమార్లు డిమాండ్ చేసిన, ఇటీవల పెద్ద ప్రద్శన కూడా నిర్వహించిన పవన్ కల్యాణ్ వినతిని ముఖ్యమంత్రి జగన్ మన్నించారు. మొత్తానికి కర్నూలులో అనుమానాస్పదంగా మృతి చెందిన సుగాలి ప్రీతి కేసులో.. సీబీఐ ద్వారా విచారణ జరగనుంది.
కర్నూలు నగరంలో 2017లో పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమాస్పదంగా మృతి చెందింది. తాను చదువుకుంటున్న పాఠశాల గదిలోనే ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో ఆమె మరణించింది. అయితే తమ కుమార్తెది ఆత్మహత్య కాదని, హత్యాచారం కారణంగానే ఆమె చనిపోయిందని బాధిత కుటుంబపు వాదన. దీనికి బలం చేకూరుస్తూ ఈ ఘటనపై విచారణకు నియమించిన కమిటీ కూడా ప్రీతిని హత్యాచారం చేశారని నివేదిక ఇచ్చింది. సాక్ష్యాలు బలంగా ఉండటంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కానీ 23 రోజులకే నిందితులకు బెయిల్ లభించి కేసు నీరుగారిపోయింది.
ఈ నేపథ్యంలో తమకు న్యాయం జరిపించాలని ప్రీతి తల్లిదండ్రులు పోరాటం ప్రారంభించారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని అనేక మంది నేతలను కలిసి అభ్యర్థించారు. ప్రీతి తల్లి పార్వతి దివ్యాంగురాలు అయినప్పటికీ అలుపెరగని పోరాటం చేశారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలవగా ఆయన సానుకూలంగా స్పందించారు. తగిన న్యాయం జరిగేందుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
ఘటన జరిగి రెండున్నరేళ్లు గడుస్తున్నా కేసులో పురోగతి లేకపోయింది. ఇంతలో రాష్ట్రంలో ఎన్నికలు వచ్చి కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. కాగా తమ పాలనాపర నిర్ణయాల్లో భాగంగా కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్ చేస్తామని వైసీపీ సర్కారు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సుగాలి ప్రీతి కేసు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. దానికి పవన్ కళ్యాణ్ పోరాటం ఊపునిచ్చింది. సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని కర్నూలులో భారీగా మార్చ్ చేసి.. విషయం సీఎం వరకు చేరడంలో సఫలీకృతుడయ్యారు.
తాజాగా మంగళవారం కర్నూలులో పర్యటించిన సీఎం జగన్ బాధిత కుటుంబంతో భేటీ అయ్యారు. కేసును సీబీఐకి అప్పగించేందుకు హామీ ఇచ్చారు. జగన్ తీసుకున్నీ ఈ నిర్ణయం తెదేపా నేతలకు చిక్కులు తెచ్చిపెట్టేదిగా ఉంది. సదరు స్కూలు తెదేపా నేతది కాగా వారి కుమారులే తమ కుమార్తెను పొట్టనపెట్టుకున్నారని బాధితుల ఆరోపణ. అలాగే ఘటన జరిగినప్పటినుంచి రెండేళ్లు అధికారంలో ఉన్న తెదేపా తమకు న్యాయం చేయలేదని, కేసును నీరుగార్చారని బాధితుల వాదనగా ఉంది. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ జరిగితే నేరం తమ నే‘తల’కు చుట్టుకునే అవకాశముందని తెదేపా నేతలు భావిస్తున్నారు. అది మొత్తానికి పార్టీ ప్రతిష్టకే మాయనిమచ్చగా మారిపోయి నేతలకు చిక్కులు తప్పవని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
.
Discussion about this post