అమ్ముడైన టికెట్లు, దక్కిన వసూళ్లలో వాటాలు పంచుకుని పుచ్చుకునే మార్గం ఆశ్రయిస్తే తప్ప.. తెలుగు సినీ పరిశ్రమకు మనుగడ దక్కేలా కనిపించడం లేదు. కరోనా దెబ్బకు థియేటర్లు మొత్తం ఏడాదిగా మూతపడి, యజమానులు తీవ్ర నష్టాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరిగి తెరవాలంటే.. అనేక కండిషన్లు చర్చల్లోకి వస్తున్నాయి.
తెలంగాణ సినిమా థియేటర్స్ యజమానులు, నిర్మాతలు తాజాగా సమావేశం అయ్యారు. మల్టీప్లెక్స్ థియేటర్స్ పద్దతిలో పర్సెంటేజ్ విధానానికి సినిమా నిర్మాతలు అంగీకరించాలని థియేటర్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. వారు పెడుతున్న డిమాండ్లు కొన్ని ఈ విధంగా ఉంటున్నాయి.
థియేటర్లో సినిమా విడుదలకు OTT లో విడుదలకు మధ్య పెద్ద సినిమాలకు 6 వారాల గ్యాప్, చిన్న సినిమాలకు 4 వారాల గ్యాప్ ఉండాలని వాళ్లు కండిషన్ పెడుతున్నారు. ఇంతకంటె తక్కువ వ్యవధితో సినిమాలు ఓటీటీలో వచ్చేస్తుండడం వల్ల థియేటర్లు నాశనం అయిపోతున్నాయి. అన్నిరోజులైనా కలెక్షన్లు లేకపోతే.. థియేటర్ నిర్వహణ కష్టమని, కరెంటు ఖర్చులు కూడా రావనే అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది.
ఈ డిమాండ్లకు నిర్మాతలు అంగీకరించక పోతే మార్చి 1 నుండి తెలంగాణ లో థియేటర్లు మూసివేస్తామని థియేటర్స్ ఓనర్లు చెబుతున్నారు.