తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఓయస్డి గా పనిచేస్తున్న డాలర్ శేషాద్రి హఠన్మరణం చెందారు. ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 72 సంవత్సరాలు.
విశాఖ పట్టణంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన డాలర్ శేషాద్రికి, సోమవారం వేకువజామున గుండేపోటు రావడంతో మృతి చెందారు. ఆసుపత్రికి తరలించేలోపుగానే ఆయన మరణించారు.
1978 వ సంవత్సరం నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో తరిస్తున్నారు. 2007లో ఆయన ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు. అయినప్పటికీ శ్రీవారి సేవలోనే జీవించడానికి ప్రభుత్వం ఆయనకు అనుమతి ఇచ్చింది. శేషాద్రి సేవలు టిటిడికి తప్పనిసరి కావడంతో ఒయస్డిగా కొనసాగిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా సరే.. స్వామి వారి సేవనే నమ్ముకున్న డాలర్ శేషాద్రి పదవికి ఎలాంటి ముప్పు రాకుండా రోజులు గడచిపోతున్నాయి.
తన తుదిశ్వాస వరకు శ్రీవారి సేవలోనే ఉండాలన్నదే తన కోరికగా డాలర్ శేషాద్రి తరచూ చెబుతుండేవారు. ఆయన కోరికను శ్రీనివాసుడు మన్నించాడు. కార్తీక దీపోత్సవం కార్యక్రమాల్లో సేవలందించడానికి విశాఖ వెళ్లిఉండగా ఆయన మరణించారు. డాలర్ శేషాద్రి మరణించే చివరి క్షణం వరకు స్వామి సేవలో తరించాడని అందరూ కొనియాడుతున్నారు.
డాలర్ శేషాద్రి హఠాన్మరణం పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగ్మోహనరెడ్డి సంతాపం వెలిబుచ్చారు.
.