భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఆడాడు. తన కెరీర్ లోనే టి20 మ్యాచ్ లలో మొట్టమొదటి శతకాన్ని నమోదు చేశాడు. అది కూడా ఆషామాషీగా కాదు నాటౌట్ గా మిగిలి, ఒక మ్యాజికల్ ఇన్నింగ్స్ తో ఆ రికార్డును నమోదు చేశాడు. అయితే ఆయన ప్రతిభా పాటవాలు సాధించిన సెంచరీని మాత్రం యూజ్‌లెస్ అనాల్సిందే!
విజయం అనేది ఏ మాత్రం ఉపయోగపడని మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం ఆయన అభిమానులకు ఏడవాలో నవ్వాలో తెలియని పరిస్థితిని కల్పించింది. టి20 ఆసియా కప్ మ్యాచ్ లలో కాస్త మెరుగైన ప్రదర్శనమే కనబరుస్తూ వచ్చిన విరాట్ కోహ్లీ ఈ సిరీస్లో భారత్ చివరి ఆటలో మాత్రం ఒక రేంజ్ లో చెలరేగిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన చివరి మ్యాచ్ నిజానికి ఎందుకు ఉపయోగపడని మ్యాచ్. ఫైనల్ కు చేరడానికి భారత్ అవకాశాలు ఆల్రెడీ అంతరించిపోయిన తర్వాత జరిగిన మ్యాచ్ ఇది.
అయినా సరే ఏ మ్యాచ్ అయినా విజయం కోసమే ఆటగాళ్లు పరితపిస్తారు. ఈ మ్యాచ్ లో కూడా అదే జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ తొలిత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్కు దిగిన భారత్ 212 పరుగుల భారీ స్కోరును ప్రత్యర్థి జట్టు ముందు ఉంచింది. ఆ టాప్ స్కోరులో కోహ్లీ వాటా సగానికి పైగా ఉండడం విశేషం. కేవలం 61 బంతులలోనే విరాట్ కోహ్లీ 122 పరుగుల స్కోరును నమోదు చేశాడు. అయితే ఈ ఘనత జట్టును ఆఫ్గానిస్థాన్పై గెలిపించగలిగింది గాని, ఆసియా కప్ టోర్నీలో భారత్ ఆశలకు ఏమాత్రం ఉపయోగపడలేకపోయింది.
అయినప్పటికీ అనేక రికార్డులు కోహ్లీ ఖాతాలో జమ అయ్యాయి 3 ఫార్మాట్ల క్రికెట్ లోనూ సెంచరీలు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డ్ సృష్టించాడు. అలాగే 71 సెంచరీలతో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును సమం చేశాడు. టీమిండియా తరఫున అంతర్జాతీయ టి20 లలో అత్యధిక పర్సనల్ స్కోరు సాధించిన బ్యాట్స్మెన్ గా విరాట్ కోహ్లీ అవతరించాడు ఇవన్నీ రికార్డులే!
.