సినిమాకు సామాజిక ప్రయోజనం ఉందని భావించే దర్శకులు తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నా, సీరియస్ పొలిటికల్ సినిమాలు తెలుగులో రావడం తక్కువే. సినిమా అనేది కళాత్మక వ్యాపారం తప్పితే వ్యాపారాత్మక కళ కాదు అనే అంశం గుర్తించిన దర్శకుల్లో వేణు వుడుగుల ఒకరు. అయన మొదటి సినిమా ” నీది నాది ఒకటే కధ” మంచి సినిమాగా పేరు తెచ్చుకొంది. దర్శకుడు వేణు రెండో సినిమా విరాట పర్వం గురించి అభిరుచి గల ప్రేక్షకులు ఎదురు చూశారనడంలో అతిశయోక్తి లేదు.
కథ విషయానికి వస్తే వెన్నెల ( సాయి పల్లవి) అనే ఒక అమ్మాయి డిగ్రీ చదువుతూ విప్లవ సాహిత్యం చదువుతుంది. అరణ్య ( రవన్న) అనే రచయిత ను చూడకుండానే ప్రేమిస్తుంది. నక్సలైట్ దళం లో పనిచేసే రవన్న (రాణా దగ్గుబాటి) ను కలవడానికి ఇల్లు వదిలి వెళుతుంది. రవన్నను కలిసి తన ప్రేమను వ్యక్తపరిచినా, విప్లవ పార్టీ దానిని అంగీకరించదు. వెన్నెల తన లక్ష్యాన్ని చేరుకుందా అనే అంశం ప్రేక్షకులను చివరి వరకు ఆసక్తిగా నిలిపింది.
ప్రేమకు, విప్లవానికి ముడిపెడుతూ దర్శకుడు వేణు ఒక చక్కని ప్రేమకథను రాసుకుని, దానికి అద్భుతంగా తెర కెక్కించాడు. విప్లవ సిద్ధాంతాన్ని ప్రమోట్ చేసే అర్.నారాయణ మూర్తి తరహా సినిమా కాదు ఇది. తూము సరళ అనే అమ్మాయి 1990 ప్రాంతంలో నక్సలైట్లలోకి వెళ్ళి కోవర్ట్ అనే ముద్ర పడి వారి చేతుల్లోనే ప్రాణం కోల్పోవడం దర్శకుడు వేణు ను కలచి వేసింది. ఆ విషయాన్ని దర్శకుడు సినిమా చివరలో తన గొంతులో స్వయంగా చెప్పడం ఒక కొసమెరుపు.
సామాజికసృహతో, నిజాయితీతో వేణు తీసిన ఈ సినిమా మనని అడుగడుగునా ఆలోచింపజేస్తుంది. REVOLUTION IS AN ACT OF LOVE అని దర్శకుడు చెప్పినా, హింసను ఎక్కడా గ్లోరిఫై చేయలేదు. వెన్నెల పాత్రలో మొండి తనం ఉన్నా, ఆ పాత్ర లో ఒక నిజాయితీ ఉంది. తండ్రి ఒగ్గు కళాకారుడు అవడం ఆ పాత్రకు ఒక బలం వచ్చింది. సినిమాలో ప్రతి సన్నివేశం వాస్తవికంగా ఉంది. ఫోటోగ్రఫీ గొప్పగా వుంది. అడవులు, తెలంగాణ పల్లెలు… అన్ని సహజంగా చూపించారు. సురేష్ బొ బ్బిలి సంగీతం ఆకట్టుకుంది. సాహిత్యం, సంగీతం ల అత్యుత్తమ మేళవింపు ఈ సినిమాలో జరిగింది. దర్శకుడు వేణు ప్రతి సన్నివేశాన్ని చక్కగా రాసుకున్నాడు. దానికి చక్కగా తీశాడు. ” మా అందరికీ స్టేట్ ఫోబియా (STATE PHOBIA) పట్టుకుంది” అని రవన్న అనే మాటలు మన హృదయాన్ని తాకుతాయి.
సాయి పల్లవి తన పాత్రకు ప్రాణం పోసింది. రాణా దగ్గుబాటి కూడా. నందితా దాస్, జరీనా వహెబ్, ప్రియమణి, నవీన్ చంద్ర, సాయి చంద్, ఈశ్వరి రావు.. ప్రతి ఒక్కరూ చక్కగా నటించారు.
గతంలో సింధూరం లాంటి సినిమాలు నక్సలిజం, దళం గురించి చర్చించినా, వాటిలో స్పష్టత లేదు. కథ చివరకు విషాదాంతం అయినా సిద్ధాంతపరమైన గందరగోళం లేకుండా సామాజిక సృహతో తీసిన ఈ సినిమా మంచి సినిమాగా మిగిలిపోతుందనటంలో ఎటువంటి సందేహం లేదు!
Discussion about this post