కొన్నేళ్ల కిందట మెట్రోమ్యాన్ శ్రీధరన్ విశాఖకు వచ్చారు. విశాఖలో మెట్రో వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఈనాటిది కాదు. దీనికి సంబంధించి కసరత్తు చాలా కాలంనుంచి జరుగుతూనే ఉంది. ఆ కసరత్తులో భాగంగానే.. శ్రీధరన్ కూడా వచ్చారు. మెట్రో ఏర్పాటుకు గల అవకాశాలను అక్కడ పరిశీలించిన తర్వాత.. ఆయన ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్లో విలేకర్లు సూటిగా.. ఈ నగరానికి అసలు మెట్రో అవసరం ఉందా? ఏర్పాటు చేస్తే.. ఆర్థికంగా వర్కవుట్ అవుతుందా? అనే ప్రశ్నలు అడిగారు.
నిజానికి విశాఖ నగరానికి మెట్రో అనవసరం అన్నది.. అప్పటికి స్థానికుల్లో కూడా ఉన్న అభిప్రాయం. అదే అభిప్రాయాన్ని శ్రీధరన్ కూడా నర్మగర్భంగా చెప్పారు. ఇక ఆర్థిక విషయానికి వస్తే.. ఏ మెట్రో కూడా లాభాల బాట పట్టిన దాఖలాలు లేవని.. విశాఖ అందుకు మినహాయింపు కాదని.. విశాఖలో మెట్రో వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ వర్కవుట్ కాదని ఆయన సెలవిచ్చారు. కుండబద్దలు కొట్టినట్లు తేల్చి చెప్పారు. విశాఖకు అనవసరం అనే మాట తప్ప.. దాదాపుగా అదే సంగతి చెప్పారు.
కానీ ఆరోజుకు, ఇవాళ్టికి పరిస్థితిలో మార్పు ఉందని అనుకోవచ్చు. ఇవాళ విశాఖ రాజధాని అవుతోంది. ఇదివరకు ఉన్న పొటెన్షియల్‌కు ఇప్పుడుండే పొటెన్షియల్‌కు చాలా తేడా వస్తుంది. నగరానికి ప్రాధాన్యం పెరుగుతుంది. వచ్చిపోయే ఫ్లోటింగ్ జనాభా నాలుగైదు రెట్లు అవుతుంది. రాజధాని కేంద్రం గనుక.. స్థిర నివాసాలుండే.. ప్రజల జనాభా కూడా కనీసం రెట్టింపు అవుతుంది. అన్ని రకాలుగా.. విశాఖలో సాంద్రత పెరుగుతుంది. ఈ లెక్కన.. విశాఖకు మెట్రో అవసరమా లేదా అనే విషయంలో ఇదివరకటి అభిప్రాయాలకు విలువలేకపోవచ్చు.
కానీ.. జగన్మోహన రెడ్డి మెట్రోతో పాటు, ట్రామ్ వ్యవస్థను కూడా ఆ నగరం కోసం ప్లాన్ చేస్తున్నారు. నగరంలో ఉన్న రోడ్ల లోనే ఒక పక్కన ట్రామ్ వ్యవస్థ ఏర్పాటు అవుతుందనే వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ పనులు జరగడం మొదలైతే గనుక.. విశాఖ నగరానికి నరకం కనిపిస్తుందన్నది నిజం. రాజధాని రావడం వల్ల భూముల విలువ పెరగడం, ఆర్థిక లబ్ధి ఇవన్నీ కొందరికి ఎలా కుదురుతాయో.. అలాగే.. రోడ్ల వెడల్పు, ఇళ్ల కూల్చివేత వంటి నరకప్రాయమైన అంశాలు కూడా అనేకమందికి తప్పవు. రాజధాని వచ్చింది.. అనే ముసుగులో కనీసం పదేళ్లపాటూ ఊహల్లో ఉండే నగరాన్ని అందుకునే ప్రయత్నంలో విశాఖ వాసులు నరకప్రాయమైన జీవితానికి సిద్ధపడాల్సి ఉంటుంది.
.