జగన్ కనీసం మందలించరా?🤔

175

కనిగిరి ఎమ్మెల్యే వీరంగం వేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేను నేను చెప్తే కూడా వినరా? అంటూ రంకెలు వేశారు. పోలీసులతో కయ్యం పెట్టుకున్నారు. పోలీసులు కూడా ఏమీ తగ్గలేదు. కాకపోతే.. ‘అధికార పార్టీ’ అనబడు ఆయన ట్యాగ్ లైన్ కు మర్యాద ఇచ్చి.. వారు కాస్త వెనక్కు తగ్గి.. తమ డీఎస్పీ దొరవారికి నివేదించుకున్నారు. ఆయన నేరుగా రంగంలోకి వచ్చి.. నచ్చజెప్పి.. సదరు ఎమ్మెల్యే గారి దందాకు ఫుల్ స్టాప్ పెట్టి- గండాన్ని గట్టు దాటించారు.

ప్రకాశం జిల్లా కనిగిర ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ ఈ వివాదానికి కేంద్రబిందువు. కరోనా లాక్ డైన్ నిబంధనలు, నిషేధాజ్ఞలు దేశమంతా అమల్లో ఉండగా, సదరు కనిగిరి ఎమ్మెల్యే మాత్రం బెంగుళూరు దాకా ఎలా వెళ్లగలిగారో తెలియదు. తాజాగా బుధవారం నాడు, బెంగుళూరులోని తన అనుచరులందరినీ వెంటబెట్టుకుని అయిదు కార్లలో ఒక కాన్వాయిలాగా బయల్దేరారు. నిజానికి బెంగుళూరు పరిసర, కన్నడ ప్రాంతాల్లో కూడా లాక్ డైన్ నిషేధాజ్ఞలు ఉన్నాయి. వాళ్లందరి కళ్లుగప్పి ఎలా వచ్చారో గానీ, మొత్తానికి చిత్తూరు జిల్లాలో ఏపీ సరిహద్దుల దాకా రాగలిగారు.

మదనపల్లె సమీపంలోని చీకలబైలు చెక్ పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అప్పటిదాకా స్ట్రెయిట్ మార్గాలు కాకుండా రకరకాల దారుల్లో ప్రయాణించి వచ్చిన ఎమ్మెల్యే గారికి ఆగ్రహం వచ్చింది. అధికార పార్టీ ఎమ్మెల్యేని.. నా మాట  కూడా వినరా… నన్ను కూడా అడ్డుకుంటారా? అంటూ రంకెలు వేశారు. పోలీసులు తాము నిమిత్త మాత్రులం అంటూ డీఎస్పీకి సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి చాలా సేపు సర్దిచెప్పిన తర్వాత.. ఎమ్మెల్యే అనుచరులందరూ అక్కడినుంచి వెనుదిరిగి వెళ్లారు.

ఇప్పుడు అసలు చర్చ ఏంటంటే…

అధికార పార్టీ ఎమ్మెల్యే అయినంత మాత్రాన తన మాటను రాష్ట్రవ్యాప్తంగా పోలీసుగణాలు అన్నీ వినితీరాలని పట్టుబట్టే సంస్కృతి వారికి ఎలా అలవాటు అయింది? అనేది ప్రశ్న! కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రాణాలకు, ప్రజల ప్రాణాలకు తేడా ఉండదు. కరోనాకు హోదాలు తెలియవు. హైదరాబాదు నుంచి వందల మంది విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు స్వస్థాలకు వెళ్లాలని వస్తే.. సరిహద్దుల దగ్గర ఆపేశారు. రాదలచుకుంటే ముందు క్వారంటైన్ కు పంపిన తర్వాతే ఇంటికి అనుమతిస్తాం అని తేల్చి చెప్పారు.

ఈ విషయాలన్నీ ప్రముఖంగా వార్తాపత్రికల్లో వచ్చిన తర్వాత కూడా, ఒక ఎమ్మెల్యే తన అధికార పార్టీని అడ్డు పెట్టుకుని బెంగుళూరు నుంచి రాష్ట్రం దాటించి 36 మంది అనుచరుల్ని తీసుకు రావాలనుకోవడం చర్చనీయాంశం. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఇలాంటి వాళ్లకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు. డిసిప్లిన్ అనేది అందరికీ ఒకటే, నిబంధనలు మన పార్టీకి విడిగా ఉండవు అని ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నారు?

మోడీకి కూడా చంద్రబాబు అదే చెప్పారా?

ఒక సాధారణ పార్టీ కార్యకర్త ఇలాంటి దుడుకు పనికి పాల్పడితే.. జగన్ కు ముడిపెట్టవలసిన అవసరం లేదు. కానీ.. వివాదానికి కేంద్రబిందువు చట్టాలను తయారుచేసే సభలో సభ్యుడు. ఇలాంటి వారిని కూడా సభానాయకుడు దార్లో పెట్టుకోలేకపోతే ఎలా? జగన్ క్రమశిక్షణ విషయంలో తన నియమబద్ధతను నిరూపించుకోవడానికి ఇలాంటి వారికి కనీసం ఒక హెచ్చరిక చేస్తారని, మందలిస్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Facebook Comments