సామాన్యుడు వ్యాపారం చేసుకుంటాను.. కొన్ని లక్షల రూపాయలు అప్పు ఇవ్వండి అని వెళితే.. బ్యాంకులు సవాలక్ష ప్రశ్నలు వేస్తాయి. అదే బడాబాబులకు వందల కోట్ల రూపాయలు అప్పనంగా ఇచ్చేస్తాయి. అలా వందల కోట్లు పుచ్చుకునే బడాబాబుల్లో చాలా మంది ఆ అప్పులను ఎగ్గొడతారని, వన్ టైం సెటిల్మెంటు కింద కొన్ని కోట్ల రూపాయలను ఎగవేసి.. నామమాత్రంగా చెల్లింపులు చేస్తారని.. ముందే తెలిసినప్పటికి కూడా.. బ్యాంకులు వారికి అప్పులు కట్టబెడుతుంటాయి. ఎగవేసిన వాళ్లు విదేశాలకు పారిపోతే కళ్లప్పగించి చూస్తూ ఉంటాయి. ఇలాంటి అనేకానేక అపభ్రంశాల మధ్య ఈ ఉదాహరణ పరాకాష్ట వంటిది. 200 కోట్ల ప్రాజెక్టుకు 500 కోట్ల రూపాయల రుణం కట్టబెట్టిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా వారి తీరు గమనించి.. హైకోర్టు న్యాయమూర్తులే విస్తుపోయిన సందర్భం ఇది. బ్యాంకు అధికారులు వితరణ విషయంలో శిబిచక్రవర్తిని మించిపోయారంటూ న్యాయమూర్తులు వ్యాఖ్యానించిన వైనం ఇది.
హైదరాబాదు సమీపం రావిర్యాలలోని ఫ్యాబ్ సిటీ సెజ్ లో సెమ్ ఇండియా ఫ్యాబ్ కంపెనీకి కేటాయించిన వంద ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని సవాలు చేస్తూ బెంగుళూరు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కోర్టుకు వెళ్లింది. సదరు కంపెనీ తమ వద్ద రుణం తీసుకుని చెల్లించకపోవడం వల్ల తాము భూమి స్వాధీనం చేసుకుంటూ 2012లోనే నోటీసు ఇచ్చినట్టు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. రికవరీ జరుగుతుండగానే.. ప్రభుత్వ నోటీసులు వచ్చాయని అభ్యంతరం పెట్టారు. అయితే న్యాయమూర్తి జోక్యం చేసుకుని 200 కోట్ల ప్రాజెక్టుకు 500 కోట్ల రుణం ఎలా ఇచ్చారని ప్రశ్నించినప్పుడు.. అంత రుణం ఇవ్వలేదని, వడ్డీ సహా అంత మొత్తం రావాల్సి ఉందని అన్నారు. కోర్టు ఊరుకోలేదు. ‘మీరు చెప్పిన లెక్కల ప్రాకరమే రూ.624 కోట్లు అంటున్నారు.
హైకోర్టు స్టే ఉన్న భూమికి రుణం మంజూరు చేసిన అధికారిపై సీబీఐకి ఫిర్యాదు చేశారా? కేసు నమోదైందా?’ అని అడిగారు. ఒకవేళ ఫిర్యాదు చేయకపోయి ఉంటే.. సుమోటోగా ఈ కోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తుందని కూడా చెప్పారు. ప్రజలు నమ్మకంగా బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ముతో అడ్డగోలుగా రుణాలిచ్చేస్తున్నారని ఆగ్రహించారు. కొందరు బడాబాబులు పరిశ్రమలు పెడతాం అంటూ ప్రభుత్వాల నుంచి భూములు తీసుకుని, వాటిని తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్యాంకులను దివాలా తీయిస్తున్నారని అన్నారు.
బ్యాంకులలో కీలకంగా, నిర్ణయాత్మకంగా ఉండే వ్యక్తుల దందాలు, దళారీ తనాలు న్యాయమూర్తి వ్యాఖ్యల్లో బయటపడుతున్నాయి. రుణం మంజూరు దగ్గరినుంచి, 200 కోట్ల ప్రాజెక్టు అని కోర్టు అంటుండగా.. రుణం మంజూరు చేసిన వారు.. ఆ ప్రాజెక్టు వ్యయం కంటె రుణభారం దాటిపోతున్నప్పుడే చర్యలు తీసుకోవాలి కదా! ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని సంకేతాలు అందితే చాలు.. ముందే భూమి స్వాధీనానికి నోటీసులు ఇచ్చేసి, కోర్టుల్లో కేసులు వేసి.. ఆ భూమిని ప్రభుత్వం తిరిగి వెనక్కు తీసుకోకుండా బ్యాంకులే దళారీల్లాగా ఈ స్వాహారాయుళ్లకు సాయం చేస్తున్నాయనే అనుమానాలు ప్రజలకు కలగితే తప్పేముంది. ప్రభుత్వం ప్రాజెక్టుకు సంబంధించిన భూమి అయినప్పుడు.. ప్రాజెక్టు ప్రారంభం కాకముందే భూమి మీద రుణాలు ఇచ్చేయడం అనే అపభ్రంశపు ధోరణుల వల్లనే ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి.
సామాన్యులకు లక్షల్లో ఇచ్చే రుణాల విషయంలో వంద రకాల హామీలు సెక్యూరిటీలు తీసుకుంటారు. వంద నిబంధనలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారు. ఈఎంఐల చెల్లింపులో ఒకటో రెండో కంతులు ఆలస్యం అయినా సరే.. నోటీసులు ఇచ్చి వెంటపడతారు. ఏమాత్రం జాప్యం చేయకుండా వేలం వేసేసి.. తమకు దఖలుపడాల్సిన సొమ్ము వస్తే చాలు అన్న ధరకు వాటిని తెగనమ్మించేస్తారు. ఇన్ని రకాలుగా వ్యవహరించే బ్యాంకులు.. ఇలాంటి బడాబాబుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు గమనిస్తే- కుమ్మక్కు అవుతున్నారనే అభిప్రాయమే ఎవరికైనా కలుగుతుంది.
ఇప్పుడు తెలంగాణ హైకోర్టు తప్పుపట్టిన ఈ వ్యవహారం మాత్రమే కాదు.. సాధారణంగా ప్రభుత్వాల నుంచి ప్రాజెక్టులకు ముడిపెట్టి భూములు తీసుకునే అనేకమంది అక్రమార్కుల విషయాల్లో ఇలాగే జరుగుతోంది. నయాపైసా చేతినుంచి పెట్టకుండా.. ప్రభుత్వానికి మాయమాటలు చెప్పి పరిశ్రమలు పెడతాం అంటూ భూములు తీసుకుని, తీసుకున్న భూముల విలువను ఎక్కువగా చూపించి.. వాటి విలువకు మించి బ్యాంకు రుణాలు తీసుకుని పరిశ్రమలు పెట్టకుండానే పరారవుతున్న వారు అనేకమంది ఉంటున్నారు. ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సర్కారు ప్రయత్నించినప్పుడు.. బ్యాంకు రుణాల చిక్కులన్నీ వెలుగులోకి వస్తాయి.
ఇలాంటి వక్రమార్కుల దోపిడీ ఆగాలంటే.. ప్రభుత్వాలనుంచి పారిశ్రామికవేత్తలు తీసుకున్న భూములపై బ్యాంకులు రుణాలు ఇవ్వకుండా కట్టడి చేయాలి. పరిశ్రమ స్థాపించిన తర్వాత, లేదా, స్థాపించేందుకు మాత్రమే రుణాలు ఇవ్వాలి. హైకోర్టు ఆదేశిస్తున్నట్టుగా.. స్థాయికి మించిన రుణాలు ఇచ్చిన బ్యాంకు అధికారుల మీద సీబీఐ కేసులు నమోదు చేసి.. వారినుంచే రికవరీలు చేస్తే తప్ప.. అక్రమార్కులకు వత్తాసుగా నిలిచే బ్యాంకు దళారీలకు భయం ఏర్పడదు. రుణాలు ఎగవేసే బడాబాబుల వల్ల బ్యాంకులు వందలవేల కోట్ల లోటులో పడ్డప్పుడు.. సాయం అందించి ఆదుకోవడం కాకుండా.. ప్రభుత్వాలు బ్యాంకుల వ్యవస్థలోనే ఇలాంటి కుమ్మక్కు వ్యవహారాలు చోటుచేసుకోకుండా నిబంధనల్ని ఏర్పాటుచేస్తే మంచిది.
.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె
ఎడిటర్, ఆదర్శిని

.
Discussion about this post