ఫ్రీగా అందే వస్తువులపై మక్కువ పెంచుకోవడం సర్వసాధారణం! ఉచితంగా లభించే వాటికోసం ఆశ పడడం తప్పు- అని చెప్పలేం. కానీ ‘ఉచితం’ అని తెలిస్తే చాలు.. వేరే గతిలేనట్టు, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నట్టు ఎగబడిపోవడం.. అలాగే ఉచితంగా వస్తుందంటే హద్దూ అదుపూ లేకుండా చెలరేగడం ఒకరకమైన వ్యసనం లాంటిది. వ్యసనం ఏదైనా సరే అది వ్యక్తి పతనానికి దారితీస్తుంది. వ్యసనం అంటేనే వ్యక్తిత్వ వినాశనం!!
తాజాగా బెంగుళూరులో జరిగిన ఒక వ్యవహారం వార్తలలో ఆసక్తిగా చదివింపజేస్తోంది. ‘ఉచితం’ అనే ఆఫర్ కనిపిస్తే చాలు పేద ధనిక వ్యత్యాసాలు ఎరగకుండా అందరూ ఎంతగా ఎగబడుతుంటారో తెలియజెప్పే సంఘటన ఇది! బెంగళూరులోని ఒక రెస్టారెంట్ జూన్ 29 నుంచి జూలై 1 వరకు మూడు రోజులపాటు ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నట్లుగా ప్రకటించింది. దీంతో బెంగుళూరు వాసులు వేలం వెర్రిగా ఆ రెస్టారెంట్ వద్దకు పోటెత్తారు! వారందరూ తిండికి గతిలేని వాళ్లు, డబ్బు పెట్టి కొనుక్కోలేని వాళ్లు అనుకుంటే పొరబాటే! ఉచితంగా వస్తోంది గనుక.. ఎగబడ్డారంతే!!
రెస్టారెంట్ ఎదురుగా చేద్దాడంత క్యూలైన్లు ఏర్పడ్డాయి. ఉచితంగా వచ్చే భోజనం కోసం మూడు గంటలు నిరీక్షించి మరి క్యూ లైన్ లలోని వాళ్లు తిని వెళ్లారు. ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ ఈ క్యూ లైన్ లను ఫోటో తీసి ఇది మన దేశ ప్రజలలో ఉన్న మానసిక పేదరికం అంటూ వ్యాఖ్యానించారు! ఇది మానసిక పేదరికం అవుతుందో లేదో తెలియదు గానీ కచ్చితంగా వ్యక్తి పతనానికి క్రమంగా వినాశనానికి దారి తీసే వ్యసనం మాత్రం అనిపించుకుంటుంది. ఉచితంగా భోజనం పెడుతున్నారంటే ఎగబడిన ఇలాంటి సంఘటన మాత్రమే కాదు. షాపింగ్ చేసేటప్పుడు ఉచిత ఆఫర్లు కూడా మనలో ప్రతి ఒక్కరిలోనూ అంతర్లీనంగా ఉండే ఇలాంటి వ్యసనాన్ని ప్రకోపింప చేస్తుంటాయి. మనం దినసరి వెచ్చాలు తెచ్చుకోవడానికి ఒక సూపర్ మార్కెట్ కు వెళ్తాం! పప్పు ఉప్పులు కిరాణాకొట్టులోకంటె కొంత చవగ్గా ఇచ్చే సూపర్ మార్కెట్ కు పనిగట్టుకుని వెళ్తాం. మన నిత్యజీవితంలో అవసరమయ్యే సరుకులు మాత్రమే మనం రాసుకున్న లిస్టులో ఉంటాయి. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత రెండు లీటర్ల కూల్ డ్రింక్ బాటిల్ కొంటే 100 రూపాయల బాటిల్ 70 రూపాయలకు వస్తుంది!- అనే అందమైన ప్రకటన మనల్ని ఆకర్షిస్తుంది. అది మన జాబితాలోనూ లేదు. నిజానికి మనకు కూల్ డ్రింక్ అవసరం ఉండదు. ఒకవేళ ఎప్పుడైనా తాగాలనిపించినా ఒక లీటరు తెచ్చుకుంటే కుటుంబానికి అంతా సరిపోతుంది.
ఆ ప్రకటన చూడగానే మనలోని వ్యసనపరుడు మేల్కొంటాడు. గబగబా తన గణిత ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తాడు. ఒక లీటర్ కొంటే 50 రూపాయలు రెండు లీటర్లు 70 రూపాయలకు వస్తాయంటే 30 రూపాయలు మిగులుతాయి అని లెక్కలు వేస్తాడు. మురిసిపోయి ఏకంగా రెండు సీసాల డ్రింక్స్ కొనుక్కుని 60 రూపాయలు ఆదా చేశాననే ఆనందంలో ఇంటికి చేరుకుంటాడు. కానీ తనకు ఏమాత్రం అవసరం లేని వస్తువుపై 140 రూపాయలు వృధాగా ఖర్చు పెట్టాలని సత్యాన్ని గుర్తించడు. ఇది సహజంగా మనలో ఉండే వ్యసనం. అందుకే మనలోని మానసిక బలహీనతలతో ఆడుకోవడంపై నిత్యం ప్రయోగాలు చేస్తూ ఉండే మార్కెటింగ్ నిపుణులు ప్రతి రంగంలోనూ కొత్త కొత్త ఉచిత తాయిలాలను ప్రకటించి మనల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. రెండు సినిమా టికెట్లు కొంటే ఒక పాప్ కార్న్ ఉచితం అనే ప్రకటన కూడా ఇలాంటిదే! మనం ఒక్కరమే సినిమాకు వెళ్లగలిగిన పరిస్థితి ఉన్నా కూడా, పాప్ కార్న్ ఫ్రీగా వస్తుందని ఒక ఫ్రెండ్ ని కూడా బలవంతంగా వెంటబెట్టుకుని తీసుకువెళ్తాం. ఇంతా కలిపి రోడ్డుమీద పది రూపాయలకు దొరికే పాప్ కార్న్ సినిమా థియేటర్లో ఉచితంగా వస్తుంది.
మనలో ఉచితాల కోసం ఆశపడే ఈ వ్యసనపరుడు చిన్నచిన్న విషయాల్లోనే ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాడు. 50 రూపాయలే కదా, 100 రూపాయలే కదా అనుకుంటూ మనం ప్రతిరోజు లేదా ప్రతిసారీ ఉచితాల కోసం అదనంగా ఖర్చు చేయడం జరుగుతుంది. కానీ ఒక నిర్దిష్ట కాలావధి తర్వాత ఇలా ఉచితం కోసం వెంపర్లాటలో పెట్టిన చిన్నచిన్న ఖర్చులను లెక్కవేస్తే చెప్పుకోదగ్గ పెద్ద మొత్తమే తయారవుతుంది. అంటే ఏమిటన్నమాట..? మన ఆర్థిక వాతావరణాన్ని మనలోని వ్యసనపరుడు నాశనం చేస్తుంటాడు.
మనలో ఉచిత కానుకల పట్ల ఉండే ఇలాంటి అనుచితమైన ఆశ నిండిన మనస్తత్వాలతోనే రాజకీయ పార్టీలు కూడా ఆడుకుంటూ ఉంటాయి. ఉచిత కానుకలు ఇస్తున్నట్లుగా మనల్ని ఒక భ్రమలో ఉంచి, ప్రభుత్వాలుగా నెరవేర్చవలసిన ప్రాథమిక బాధ్యతలను విస్మరిస్తాయి. వారి వైఫల్యాలపై సామాన్యుల దృష్టి మళ్లకుండా జాగ్రత్త పడుతుంటాయి. ప్రభుత్వాల పదవీకాలం గడిచిపోయే నాటికి వారి అచేతనత్వం వలన జరిగిన నష్టాలను- వారి ఉచితాల వలన పొందిన లాభాలను బేరీజు వేసుకుంటే.. హళ్లికి హళ్లి సున్నకు సున్నా అన్నట్లుగా లెక్క తేలుతుంది.
Nothing is free in this world అని ఆంగ్లంలో ఒక సామెత ఉంటుంది. అలాగే.. ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అని ఒక సుభాషితం ఉంటుంది. ఎవ్వరూ ఏ పనినీ ప్రయోజనాన్ని ఆశించకుండా చేయరు. ఉచితం అని ప్రకటించడంలో వారికి అడ్డదారిలో దక్కేలాభం ఏదో ఖచ్చితంగా ఉంటుంది. ఆ మోజులో పడకుండా.. మన అవసరాలు ఏమిటో అంతవరకు మాత్రమే గడుపుకుంటూ ఉండగల అదుపు సాధించినప్పుడు జీవితం సవ్యంగా సాగుతుంది. ఉచితం అని కనిపించగానే ఎగబడడం ప్రారంభిస్తే.. బెంగుళూరు భోజన ప్రియులలాగానే మనం కూడా నవ్వులపాలవుతాం. అక్కడితో ఆగితే పర్లదే.. మనలోని ఆ వ్యసనం విశ్వరూపం దాల్చిందంటే.. ఏదో ఒకనాటికి పతనం అవుతాం కూడా!
.