‘నేరం చేసేవాడికి ఎలాగైతే శిక్ష పడుతుందో.. నేరస్తుడిని కాపాడే వాడికి కూడా అదే విధంగా శిక్ష పడుతుంది’ అని మన దేశంలో చట్టం చెబుతుంది. ఆ మాటకొస్తే నేరానికి ప్రేరేపించిన వాడికి కూడా శిక్ష పడాలి. ఈ ఉదంతంలో ఒక తండ్రిని మూఢనమ్మకాల ముసుగులో ఉంచి, 20ఏళ్ల కుమారుడిని గొంతు నులిమి చంపేందుకు ప్రేరేపించిన వ్యక్తి ఒక జ్యోతిష్యుడు కావడం గమనార్హం.
తమిళనాడులో వేందర్ బాలా అనే వ్యక్తి 20 సంవత్సరాల కన్నకొడుకు శ్రీకాంత్‌ను గొంతు నులిమి చంపి నదిలో పారేశాడు. ఈ దుర్ఘటన మూడు సంవత్సరాల కిందట 2023లో జరిగింది. అప్పటికే ఆస్తి విషయంలో తండ్రీ కొడుకుల మధ్య తగాదాలు ఉన్నాయి. అయితే కొడుకును తండ్రి చంపేయడానికి కారణం మాత్రం ఆ ఆస్తుల గొడవలు కాదు. బాలా తరచుగా ఆశ్రయించే ఒక జ్యోతిష్యుడు కారణం కావడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది.
వివరాల్లోకి వెళితే 2023 సెప్టెంబర్ లో శ్రీకాంత్ అనే కుర్రాడు అదృశ్యం అయ్యాడు. తల్లి రాజ్యలక్ష్మి మధురై హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడంతో 2026 లో కేసు సిబి సిఐడి కు బదిలీ అయింది. వారి దర్యాప్తులో శ్రీకాంత్ కు అలెక్స్ పాండియన్ అనే వ్యక్తితో విభేదాలు ఉన్నట్లుగా బయటపడింది. పాండియన్ ను అదుపులోకి తీసుకొని విచారించగా- శ్రీకాంత్ ను చంపింది అతని తండ్రే అనే సత్యాన్ని వెల్లడించాడు. తండ్రి వేందర్ బాలా, కరుప్పయ్య అనే మరో వ్యక్తితో కలిసి గొంతు నులిమి చంపి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ముల్లై పెరియార్ నదిలో పారేసినట్లుగా వెల్లడించాడు. తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు కొడుకును చంపిన మాట వాస్తవమే అని అంగీకరించాడు కూడా! కొడుకు వలన తనకు ప్రమాదం ఉంటుందని ఒక జ్యోతిష్యుడు జాతకం చూసి చెప్పాడని- అంచేత తానే కొడుకుని అంతమొందించానని బాలా ఒప్పుకున్నాడు. ప్రస్తుతానికి బాలాను పోలీస్ కస్టడీలో ఉంచి, సహనిందితుడు కరుప్పయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వ్యవహారం ఈ ఇద్దరితో ముగిసిపోతే ఎలా? జాతకాల పేరు చెప్పి కన్న కొడుకుని సైతం కడతేర్చే విధంగా బాలాని ప్రేరేపించింది, లేదా, దురాలోచన కలిగించినది ఎవరు? జ్యోతిష్యుడు కదా! జ్యోతిష్యుడుని కూడా కేసులో నిందితుడిగా చేయకుండా, హంతకులకు పడే సమానమైన శిక్ష అతనికి కూడా వర్తింప చేయకుండా.. శ్రీకాంత్ మరణానికి న్యాయం ఎలా దక్కుతుంది అనేది ఆలోచించాలి.
జ్యోతిష్యం పేరుతో ప్రజల జీవితాలతో ఆడుకునే దుర్మార్గులు, మూర్ఖులు ఇలా తప్పుదారి పట్టించడం అనేకచోట్ల జరుగుతూ ఉంటుంది. జ్యోతిష్యాలు, తాంత్రికపూజలు, గుప్తనిధులు, సిద్ధులు లాంటి రకరకాల మాయమాటలతో మూర్ఖుల్ని, అమాయకుల్ని మోసంచేస్తూ నకిలీ స్వాములు అరాచకాలకు పాల్పడుతుండడం మనం అనేకం గమనిస్తుంటాం. ఈ ఉదంతంలో జ్యోతిష్యుడు ఒక హత్యకు మూలకారణం అయ్యాడు. నిజానికి ఈ కేసులో బాలా, కరుప్పయ్య కలిసి ఒక హత్య మాత్రమే చేశారు. కానీ అలాంటి దుర్మార్గపు జ్యోతిష్యులు బాహ్య ప్రపంచంలో ఉంటే రోజుకు ఒక బాలాతో ఒక్కో హత్య చేయిస్తూ ఉంటారు. నిశితంగా గమనిస్తే బాలా చేసిన నేరం కంటే జ్యోతిష్యుడి ద్వారా జరిగే నేరాల మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్లను కచ్చితంగా శిక్షించేలా చూడాలి. ఇలాంటి వాళ్లకు కఠిన శిక్షలు పడితే మూఢనమ్మకాలతో ప్రజల జీవితాలతో ఆడుకునే కుహనా జ్యోతిష్యులకు గుణపాఠం అవుతుంది.
.