• About Us
  • Contact Us
  • Our Team
Monday, August 3, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

జూలై 12, 2026 నాటి ఆదివారం అనుబంధాల కథలపై ఒక సమగ్ర విమర్శనాత్మక పరిశీలన

admin by admin
August 1, 2026
0
26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

‘కథానిధి’ కథల అంతరంగ ఆవిష్కరణ

కథ అనేది సంఘటనల వరుస కాదు, మనిషి అంతరంగాన్ని కాలంతో ముఖాముఖి కూర్చోబెట్టే సాహిత్య ప్రక్రియ. ప్రతి కాలానికీ తనదైన సామాజిక గాయాలు ఉంటాయి. ఆ గాయాలకు చరిత్రకారుడు ఆధారాలు చూపిస్తాడు. సామాజిక శాస్త్రవేత్త కారణాలను వివరిస్తాడు. కానీ కథకుడు మాత్రం ఆ గాయానికి నొప్పి ఎలా ఉంటుందో మన హృదయంలో అనుభూతిగా నిలబెడతాడు. అందుకే మంచి కథలు వార్తలను మించి కాలాన్ని నమోదు చేస్తాయి.

మునిసురేష్ పిళ్లె సమర్పణలో 26 జులై 2026 నాడు వెలువడిన ‘కథానిధి’ (ఆదివారం కథలు) సంచిక అలాంటి కథల సమాహారం. ఇందులోని కథలు ఒక్కోటి ఒక్కో దిశగా ప్రయాణించినప్పటికీ, వాటన్నింటినీ కలిపే అంతరసూత్రం ఒకటే మనిషి అస్తిత్వం.

భూక్యా గోపినాయక్,
99891 59196

ఈ సంకలనంలోని కథల్లో గ్రామీణ జీవితం ఉంది. నగరపు ఒంటరితనం ఉంది. గిరిజన జీవనవేదన ఉంది. కుటుంబ సంబంధాల విచ్ఛిన్నం ఉంది. భాష, జ్ఞాపకం, ప్రేమ, వృద్ధాప్యం, విలువల సంక్షోభం ఉన్నాయి. ఇవి పాఠకుడిని కేవలం అలరించవు.. ఆలోచింపజేస్తాయి.

తెలుగు కథ ఈ మధ్యకాలంలో రెండు ప్రమాదాలను ఎదుర్కొంటోంది. ఒకటి ఉపన్యాసంగా మారిపోవడం. రెండోది సంఘటనల వరుసగా మిగిలిపోవడం. ఈ రెండు అంచుల మధ్య జీవితం అనే సన్నని దారిపై నడిచే కథలే చిరస్థాయిగా నిలుస్తాయి. ఈ కథానిధి సంచికలో అలాంటి ప్రయత్నాలు గణనీయంగా కనిపిస్తాయి.

ఈ సంచికలోని కథలను చదివితే ఒక విషయం స్పష్టమవుతుంది. రచయితలు ఇప్పుడు సమస్యను చెప్పడానికే కథ రాయడం లేదు. సమస్య మనిషిలో ఎలా నివసిస్తుందో చూపిస్తున్నారు.

ఇది తెలుగు కథలో వచ్చిన ఒక ఆరోగ్యకరమైన మార్పు.

ఈ సమీక్షలోని కథలన్నింటినీ చదవడానికి ‘19 జులై 2026 కథానిధి ఆదివారం కథలు’ సంకలనం
ఈ కింది లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి

click here

ఒకప్పుడు కథల్లో సిద్ధాంతం ముందుండేది. ఇప్పుడు అనుభవం ముందుకొస్తోంది. పాత్రలు తమ జీవితాలను తామే చెప్పుకుంటున్నాయి. రచయిత వారి వెనుక నడుస్తున్నాడు. ఇదే ఆధునిక కథ యొక్క బలం. సమాజం ఎదుర్కొంటున్న ఈ సంక్లిష్టతలను కథకులు ఎంత బలంగా తమ కథా శిల్పంలో ఒదిగించారో ఇప్పుడు అత్యంత వివరంగా, సమగ్రంగా విశ్లేషించుకుందాం.

1. భాషాధిపత్యం –
ఆదివాసీల అస్తిత్వ వేదన:

కథ పేరు: ‘యాడి గొంతు’ రచయిత: భూక్యా గోపి నాయక్ (తెలుగుప్రభ)

యాడిగొంతు : మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!

ఈ కథ సమీక్ష : ..కె.ఎ. మునిసురేష్ పిళ్లె

మంచి కథకు రెండు దశలు ఉంటాయి.

తొలిదశ- తారసపడే ఒక సంఘటన, ఎదురయ్యే అనుభవం, తెలిసివచ్చే సంగతి ఏదైనా సరే.. దిగ్భ్రాంతికి గురిచేసి, వదలకుండా పట్టుకుని, బుద్ధిలో తిష్టవేసి మనసును మెలిపెట్టేయడం మనకు తరచుగా జరుగుతుంటుంది. అలాంటి సందర్భాల్లో మనసును మెలిపెట్టినప్పుడు, తీవ్రంగా మధనపడినప్పుడు.. అది కలిగించే భావోద్వేగాల తీవ్రతను తట్టుకోలేక సతమతం అయినప్పుడు కాగితమ్మీద పెడితే కథ, కవిత వంటి సృజనాత్మక రూపంగా అది వ్యక్తమవుతుంది. ఉదాహరణకు.. ‘కార్పొరేట్ చదువుల మీద ఒక కథ రాద్దాం’ అని డిసైడై కంప్యూటరు ముందు కూర్చుని కృతకమైన పాత్రల్ని అల్లుకుంటూ టైపు చేయడం ప్రారంభించేయకుండా.. మన జ్ఞానాన్ని చాటుకునే యావలో వంటకాలు చేయకుండా.. ఇలాంటి సుదీర్ఘమైన మధనం నుంచి పుట్టిన కథకు ఒక పరిణత రూపం ఉంటుంది. ఒక తల్లి ప్రసవ వేదన పడిన ప్రతిసారీ మరో జన్మ ఎత్తుతుందని మనం ఆమె ఔన్నత్యానికి ప్రణమిల్లుతుంటాం. మంచి కథను పాఠకులకు అందించే ప్రతి రచయిత కూడా.. ప్రతి కథకు అంతటి ప్రసవవేదన పడతాడు. అలా పుట్టినది ఖచ్చితంగా మంచి కథల సరసన చేరగల వరుసలో ఉంటుంది.

మలిదశ- రచయిత ప్రసవ వేదన దశను దాటి బయటకు వచ్చిన తర్వాత, కథ, చదివిన ప్రతి పాఠకుడిని ఒక సంవేదనకు గురిచేస్తుంది. అక్షరాలలో ఉన్న మొత్తం భావోద్వేగాలు చదివిన ప్రతివాడిలోకి వెల్లువలా ప్రవహిస్తాయి. ఆ కథ ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, రసోద్రేకాన్ని కలిగిస్తుంది. ఏ అనుభూతి ప్రధానంగా ఆ కథ సాగిందో.. అనుభూతిని వెలితి లేకుండా పాఠకుడికి పంచి, పరిపూర్ణం అవుతుంది. మంచి కథ చదివిన తర్వాత, వెంటనే ఇంకో పనిలో పడడం అంత సులువు కాదు. ఆ కథ వెంటాడుతుంటుంది. తరుముతుంటుంది. కుదురుగా ఉండనివ్వదు. మళ్లీ మళ్లీ తన గురించి ఆలోచించమంటుంది. అందులోని పాత్రల భావోద్వేగాలతో సహానుభూతి చెందమంటుంది. ఆ దుఃఖాల ఉద్వేగంలో, ఆనందాల పరవశంలో మిమ్మల్ని సదా ఉంచుతూ.. సుదీర్ఘకాలం పాటు ఆ కథా పరిమళం మిమ్మల్ని అంటుకునే మిగులుతుంది.

ఈ రెండు దశలూ దాటిన పరిణత కథ.. మంచి కథల సరసన నిలుస్తుంది.

భూక్యా గోపి నాయక్ రాసిన ‘యాడిగొంతు’ అలాంటి మంచి కథల వరుసలో తనను తాను సగర్వంగా, గౌరవంగా నిలబెట్టుకునే కథ. కొన్ని వారాల కిందటే ఆదివారం నాడు ఒక కథను అందించడం ప్రారంభించిన ‘తెలుగుప్రభ’ దినపత్రిక ఈ కథను ప్రచురించింది. మంచి కథలకు కేరాఫ్ గా తమ పత్రికను కూడా నిలబెట్టాలనే తపనతో వారి కథల ఎంపిక సాగుతున్నట్టు చెప్పే మరో ధ్రువపత్రం ‘యాడిగొంతు’!

* * *
ఓ గిరిజన బాలిక సోనీ తండాలో అయిదో తరగతి పూర్తిచేసిన తర్వాత పట్నంలోని ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్లో ఉండి పైతరగతులు చదవడానికి వస్తుంది. ఆ వయసు పిల్లలకు అత్యంత సహజమైన హోమ్ సిక్ సమస్యే ఈ కథలోని ప్రధానాంశం కూడా. కేవలం ‘హోమ్’ వెలితి మాత్రమే కాదు, ‘యాడి’ జ్ఞాపకం మాత్రమే కాదు.. ఆమెను ఆ కొత్త వాతావరణంలో మెలిపెట్టేసే ముఖ్యమైన విషయం మరొకటి కూడా ఉంది. అదేమిటో చెప్పడానికి చేసిన ప్రయత్నమే ఈ కథ. మీరు చదివే తెలుసుకోవాలి.

హాస్టల్లో ఉన్న సోనీకి తల్లి జ్ఞాపకం వస్తుంటుంది. అమ్మ జ్ఞాపకాలను, అమ్మ కావాలనే స్పృహను వ్యక్తం చేయడం కూడా మరిచిపోయేంతగా సోనీ ఉక్కిరి బిక్కిరి అవుతుంటుంది. ఆ బాధలోనే జ్వరం బారిన పడుతుంది. ఆ పాపకు అర్థం కూడా పూర్తిగా తెలియని- అమ్మ లాలిపాటే ఆమె జ్వరానికి మందు అని వార్డెను కూడా గుర్తిస్తుంది. చీదరింపుల స్థానే గౌరవం, ప్రేమ ప్రవేశిస్తాయి. కథ- అవసరమైన న్యాయం దిశగా సాగి పాఠకుడిని సంతృప్తి పరుస్తుంది. ‘యాడిగొంతు’ లోని కరకైన మాధుర్యం, కట్టెలు కొట్టితెచ్చి అమ్ముకునే తల్లి సంతూబాయి బండబారిన చేతుల్లోని మార్దవం లాంటిదే. సోనీకి మాత్రమే ఆ మధురిమ తెలుసు. కథ చదివాక ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది.

యాంత్రికమైన వృత్తి ధర్మంలో మగ్గిపోతూండే వార్డెను సరోజినిలో వచ్చే మార్పు.. కథ చదివే ప్రతి పాఠకుడిలోనూ రాగల మార్పునకు ప్రతీక! కథ ద్వారా తాను నమోదు చేయదలచుకున్న విజయాన్ని, కథలోనే సంకేతిస్తాడు రచయిత భూక్యా గోపి నాయక్! అరుదైన ఫీట్, అరుదైన ఫీల్ ఇది.

‘స్టాప్- లుక్ అండ్ ప్రొసీడ్’ సిద్ధాంతాన్ని అనుసరిస్తుంది ఈ కథ! చదువుతుండగా అనేకచోట్ల మిమ్మల్ని నిలబెట్టేస్తుంది. కొన్ని క్షణాలు కళ్లు మూసుకుని మీలో మీరు మధనపడాలని చెబుతుంది. ఆతర్వాత కొనసాగమంటుంది. కథలో స్పీడు బ్రేకర్లులా వస్తుంటాయని లోపాల గురించి మనం చెబుతుంటాం. కానీ.. ‘యాడిగొంతు’లో అలా నిలబెట్టేసే వాక్యాలు తద్విరుద్ధమైనవి. మీ పఠనానుభూతిని పెంచేవి.

‘వాళ్లు పడుకోబెడితే పిల్లలకు నిద్ర వస్తదా’ అంటుంది సోనీ తల్లి సంతూబాయి. అమాయకమైన ఆ గిరిజన స్త్రీ.. తాను నిద్ర పుచ్చకుండా బిడ్డ నిద్రపోగలుగుతుందా అనే అనుకుంటుంది. గిరిజన అమాయకత్వంలోని ఆ స్వచ్ఛత- సంతూబాయిలోనే కాదు సోనీలో కూడా కనిపిస్తుంది. తల్లి గురించి వ్యాసం రాయమని తెలుగు టీచరమ్మ పురమాయిస్తే.. బాగా చదివే విద్యార్థిని అయిన ఆ అమ్మాయి.. ఒక్క వాక్యమైనా రాయలేకపోతుంది. ఎందుకంటే- ‘మా అమ్మకు తెలుగురాదు’ అంటుంది. ఇలాంటి వాక్యాలు చాలానే ఉన్నాయి.

‘కొత్తది నేర్చుకోవాల్నంటే, పాతది చంపేయాల్నా’ అనే సంతూబాయి మాట ఈ కథను పుట్టించిన అంతస్సూత్రం!

కథలో మరో ముఖ్యమైన పాత్ర వార్డెను సరోజిని. ఉద్యోగంలోని ఒత్తిడి నేర్పించే అనివార్యమైన యాంత్రికతకు ఆమె ప్రతినిధి. ఎంతగా బండబారినా గుండెల్లో ఉండే తడిని- సోనీ, ఆమె యాడి, ఆమె గోర్ బోలి ఉమ్మడిగా తట్టి లేపుతాయి.

* * *
కుల, మతాల అస్తిత్వాల్ని చాటడానికి, కాపాడుకోవడానికి వచ్చే సాహిత్యంలో ఒక తడి ఉంటుంది. చాలా మంది తమ తమ కులాలు, మతాల్లోని బరువైన విషయాలనే కథాంశాలుగా తీసుకుంటూ సాహిత్యానికి గొప్పగా చేర్పులు చేస్తూ వస్తున్నారు. కానీ కులం ఆధారిత కథలను కొంచెం లోతుగా గమనిస్తే.. వారు ఎదుర్కొనే వేదనలు, పరితాపాలను.. కులం గీతలకు ఆవల ఆర్థిక అసమానతలు కూడా ప్రధాన కారణంగా నిర్దేశిస్తుంటాయి. కులాలు మతాల చుట్టూ ఆ కథలు నడవవచ్చు.. ఆ వర్గాల వారు ఆ కథలతో మమేకం అయి ఆనందించవచ్చు. కొన్ని కథల్లోని కులం పేరును, మరో కులం పేరుతో రీప్లేస్ చేసినా కూడా కథకు సేగి వాటిల్లదు. అలాంటి ఆ కథల్లోని గొంతుక కులం ఆకర్షణను తొడుక్కుని, మరో హేతువును చర్చిస్తుంటుంది. కానీ ‘యాడిగొంతు’ అలాంటి కథ కాదు. ఇది అచ్చమైన, స్పష్టమైన బంజారా గోర్ బోలి గొంతుక!

సోనీ, బంజారా తెగకు చెందిన గిరిజన బాలిక కావడం వల్ల మాత్రమే ఈ కథ పుట్టింది. అస్తిత్వ కథల్లో ఇది ఒక స్వచ్ఛమైన కథగా నిలుస్తుంది.

* * *
కథ మీద కొన్ని విమర్శలూ నా దృష్టికి వచ్చాయి. తెలుగు నేర్చుకోమని అన్నందుకే అణిచేసినట్టు భావించడం కరక్టేనా? గిరిజన బిడ్డలు ఇక ఎప్పటికీ అక్కడే ఉండిపోవాలా? వారు ఎదిగి ఉన్నత స్థానాల్లోకి, హోదాల్లోకి రానేకూడదా? అనే తరహా ప్రశ్నలూ వచ్చాయి. కథను పైపైనే చదవడం వల్ల కలిగిన అభిప్రాయాలివి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం.. ఆ కథను మరోసారి చదవడంలో దొరుకుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.

అలాగని కథలో లోపాలు లేవని కాదు. నాకు లోపాలుగా అనిపించినవి పిడికెడు ఉన్నాయి. ఆ హాస్టలు మొత్తం గిరిజన బాలికలదే అయినప్పుడు.. సోనీ గోర్ బోలి భాషను మిగిలిన అమ్మాయిలు హేళన చేయడం, వార్డెను సరోజినికి, అప్పుడే కొత్తగా డ్యూటీలో చేరిన మహిళలాగా, గిరిజన భాష గురించి కనీసం పరిచయం లేనట్లుగా ఉండడం లాంటివి. మరికొన్ని అసహజ నడకలు కూడా పోయింది కథ! శిల్పపరంగానూ కొన్ని లోపాలు అనిపించాయి. కానీ వాటన్నింటినీ జాబితా కట్టి చెప్పడం నాకు ఇష్టం లేదు. యాడిగొంతు మిమ్మల్ని లాక్కువెళ్లే ఉద్వేగాల్లోనే వెళ్లండి. మీకుగా కొన్ని లోపాలు కనిపిస్తాయి. వాటిని మన్నించండి. కానీ విస్మృత భాషల పట్ల మనం చూపించవలసిన కనీస గౌరవాన్ని ఈ కథ ఎలుగెత్తి చాటుతోందని మాత్రం విస్మరించకండి. మీరు గమనించిన లోపాలను గోపి నాయక్ కు చెప్పండి. స్వీకరించి.. మనకు మరింత మంచి కథలను ముందు ముందు అందిస్తాడు.

* * *
నూటయాభై కోట్ల మంది జనాభా ఉన్న దేశం మనది. వందల భాషలు మనుగడలో ఉన్నాయంటే అతిశయం కాదు. ప్రభుత్వం/ రాజ్యాంగం అధికారికంగా గుర్తించిన భాషలు 22 మాత్రమే. మిగిలిన వందల భాషల సంగతేమిటి? గౌరవం దక్కడం అనే మిషమీద ఈ వందల భాషల్ని అధికారికంగా గుర్తించడం సాధ్యమేనా? ఆ భాషలకు పుట్టిన బిడ్డలందరూ.. చదువులకు వెళుతున్నప్పుడు.. దరఖాస్తుల్లో ‘మాతృభాష’ అనే గడిలో ఏం రాయాలి? ఈ ప్రశ్న ఆ రంగంలోని వారికి తరచూ ఎదురయ్యేదేనేమో. 22లో ఏదో ఒక పేరు చెప్పాల్సిందే అని పట్టుపట్టకుండా, ఆ జాతులు, తెగలకు చెందిన వారు.. తమ భాషగా ఏ పేరు చెబుతారో.. దాన్ని ఆ గడిలో రాస్తే చాలు. వారి భాషాగౌరవాన్ని కాపాడ్డానికి అంతకుమించి ఏమీ చేయక్కర్లేదు.. అనే సందేశాన్ని ఈ కథ మనకు అందిస్తుంది.

నిత్యజీవితంలో మనకు అనేకమంది తారసపడుతుంటారు. కడుపు చేతపట్టుకుని- ఏ ప్రాంతపు మనుషులు.. మరే ఇతర ప్రాంతాల్లో బతికే తెరువును వెతుక్కుంటున్నారో.. హద్దులన్నీ చెరిగిపోయిన ఆధునిక సమాజంలో.. తారసపడే మనుషుల నోట వారి సొంత భాషను విన్నప్పుడు మనం నవ్వుతాం. ఏ ప్రాంతంలో బతకడానికి వచ్చారో.. ఆ ప్రాంతపు భాషను అలవాటు చేసుకోవడం, ఆ మట్టికి అలవాటు పడడం వారు నేర్చుకోవాల్సిందే. లేకపోతే మనుగడ ఉండదు. అంతమాత్రాన వారు, పరిసరస్పృహను మరచిపోయిన అమ‌ృత క్షణాల్లో వారి సొంత భాషలోనే ఏదైనా మాట్లాడినప్పుడు.. మనం హేళనగా నవ్వకుండా ఉండాలి. ‘యాడిగొంతు’లో సోనీ, అఫ్సర్ గా ఎదగాలంటే తెలుగును, ఇంగ్లీషు తదితరాల్ని కూడా నేర్చుకోవాల్సిందే. కానీ ఆమె బాధానందాలను అనుభూతించే అలౌకిక సమయంలో ఒక మాట తన మాతృభాషలో చెప్పుకుంటే, ఆ ‘గోర్ బోలి’ హేళనకు గురికాకూడదు. ప్రతిభాష పట్ల మనం కలిగి ఉండవలసిన ఆ సంస్కారాన్ని మనకు ‘యాడి గొంతు’ కథ నేర్పుతుంది.

స్పానిష్, ఇటాలియన్ లాంటి ఏవేవో భాషలనుంచి రెండు పదాలను పుక్కిట పట్టి.. తమ తమ మిత్రులతో సంభాషణల్లో ఆ పదాలను, భిన్నంగా ఉండడం కోసం, వాడుకుంటూ హొయలొలికించే యువతరం మనకు తెలుసు. ఈ కథ చదివిన వారిలో ఏ ఒక్కరికైనా ‘అమ్మ కావాలి’ అనే ఉద్వేగాన్ని భిన్నంగా వ్యక్తం చేయడానికి ‘యాడి చావ్ణు’ అనాలనిపిస్తుంది యిక! అలా ఒక్కరు ఆ పదాల్ని వాడినా చాలు.. భూక్యా గోపి నాయక్ జన్మ ధన్యమైనట్టే. కేవలం అందరూ మెచ్చుకున్న కథ రాసినందుకు మాత్రమే కాదు. అసలు గుర్తింపే లేని.. తండాల్లో తప్ప ఎక్కడా వినపడని ఒక భాష పట్ల, ఆ భాష గురించి ఏమీ తెలియని ప్రజల్లో ప్రేమని నాటినందుకు!

నామటుకు నేను, యాడి యాదిలో కొట్టుకుపోయాను. మీలో ఇప్పటికీ చదవని వారుంటే తప్పకుండా చదవండి.

 

2. స్వేచ్ఛా జీవనం –
సమాజపు నకిలీ నైతికత

కథ పేరు: గోడల్లోపలి గోడలు రచయిత: ప్రసేన్ (ప్రజాశక్తి స్నేహ)

నగర శివార్లలోని ‘స్వేచ్ఛ’ అనే గేటెడ్ కమ్యూనిటీలో కేవలం సహజీవనం (Live-in relationships) చేసే జంటలు మాత్రమే ఉంటారు. సమాజం వారిని అంగీకరించనందుకు వారంతా ఒకచోట చేరి ఒక ఉమ్మడి జీవనాన్ని గడుపుతుంటారు. కానీ, అక్కడికి ట్రాన్స్ జెండర్ జంట (నైనా, ఆదిత్య) వచ్చేసరికి, అదే స్వేచ్ఛా కమ్యూనిటీలో అభద్రతాభావం మొదలవుతుంది. తమను సమాజం ఎలా అవమానించిందో మర్చిపోయి, వీరు ఆ ట్రాన్స్ జెండర్ జంటను దూరం పెడతారు. “శారీరక అనుబంధం ఆడా మగా మధ్యే ఉండాలి, అది ప్రకృతి ధర్మం” అని తమలో తాము వాట్సాప్ గ్రూపుల్లో వాదించుకుంటారు. “మనుషుల ప్రతి స్వేచ్ఛకి ఒక గోడ కావాలి” అన్నట్లుగా ప్రవర్తిస్తారు. అయితే చివరికి శ్వేత చొరవతో, తమ తప్పు తెలుసుకుని గేటు మీద “No one seeking dignity will be turned away” అని రాయడం ఈ కథ సారాంశం.

అయితే సమాజంలోని అట్టడుగు వర్గం కూడా తమకంటే కింద ఇంకో వర్గం ఉండాలని కోరుకునే సైకలాజికల్ హిపోక్రసీ (నకిలీ నైతికత) ని రచయిత అద్భుతంగా ఎండగట్టారు. సహజీవనం చేసేవారు సైతం, ట్రాన్స్ జెండర్ల పట్ల వివక్ష చూపడం అనేది మానవ నైజంలోని వైరుధ్యానికి సజీవ సాక్ష్యం. అయితే, వాట్సాప్ గ్రూప్ చర్చ ద్వారా సమస్యను పరిష్కరించడం, అందరూ వలసపక్షుల్లా ‘సారీ’ చెప్పేయడం కథాగమనాన్ని తేలికపరిచింది. పాత్రల మధ్య ప్రత్యక్ష ఘర్షణ ఉండి ఉంటే ఈ కథ మరింత బలంగా పేలేది.

3. పేదరికం –
మతం ముసుగులో కపటత్వం

కథ పేరు: కాఫిర్ రచయిత: సుదర్శనం రంగనాథ్ (నమస్తే తెలంగాణ బతుకమ్మ)

మతం కన్నా మానవత్వం గొప్పదని చాటే అద్భుతమైన కథ ఇది. జాఫర్ మియా, తన పక్కింటి రహీం చాచా, చాచా పెంచుకున్న అనాథ హిందువు రాము చుట్టూ ఈ కథ నడుస్తుంది. చాచా చనిపోయాక రాము అనాథ అవుతాడు. జాఫర్ కూతురు ఫాతిమాకు పెళ్లి సంబంధం వస్తే, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జాఫర్ కు.. రాము తను దాచుకున్న ఎనిమిది లక్షలు తెచ్చి ఇస్తాడు. అప్పటికే ఫాతిమా, రాము ఇష్టపడుతున్నారని గ్రహించిన జాఫర్, మత ఛాందసవాదుల బెదిరింపులను ఖాతరు చేయకుండా వారికి పెళ్లి చేస్తాడు. “నా కూతుర్ని ఎవరికో ఇవ్వడం కంటే, ఈ ఉత్తముడైన రాముకు ఇవ్వడమే ధర్మం” అని జాఫర్ తీసుకున్న నిర్ణయాన్ని ఇమామ్ సాబ్, ఇతర మత పెద్దలు ‘కాఫిర్’ (ద్రోహి) అని విమర్శించినా అతను చలించడు.

ఇది మత సామరస్యాన్ని ప్రబోధించే కథగా గొప్ప విజయం సాధించింది. కానీ, కథనం మొత్తం జాఫర్ ఆలోచనల ద్వారానే సాగడం వల్ల, రాము-ఫాతిమాల మధ్య ప్రేమ ఎలా అంకురించిందో పాఠకుడికి స్పష్టంగా కనిపించదు. కేవలం ఉపకారం చేశాడు కాబట్టి కూతుర్ని ఇచ్చేయడం అనే పాత సినిమాల ఫార్ములాను దాటి, వారిద్దరి మానసిక బంధాన్ని చిత్రించి ఉంటే కథ మరింత వాస్తవికంగా ఉండేది. అలాగే జాఫర్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ చెప్పుకునే చారిత్రక ఉదాహరణలు (అక్బర్-జోధాభాయి వగైరా) కథాగమనాన్ని ఒక వ్యాసం లాగా మార్చాయి.

4. వర్గ పోరాటం –
ఆక్రమణలపై తిరుగుబాటు

కథ పేరు: ఏడో ఇల్లు రచయిత: వజ్జీరు ప్రదీప్ (నవ తెలంగాణ సోపతి)

గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు, మోతుబరులు అమాయకుల భూములను ఎలా ఆక్రమించుకుంటారో, దానికి రెవెన్యూ వ్యవస్థ ఎలా వంతపాడుతుందో ఈ కథ వివరిస్తుంది. రాజేశ్వరమ్మ కుటుంబానికి చెందిన భూమిని, ఇల్లును పక్కింటి వాడు మాయమాటలు చెప్పి లాక్కుంటాడు. వీళ్లు ఆరు ఇళ్లు కిరాయికి మారి, ఏడోసారి గత్యంతరం లేక తమ సొంత స్థలంలోనే (మిగిలిన కొద్దిపాటి ఆక్రమిత జాగలోనే) గుడిసె వేసుకుని తిరుగుబాటు బావుటా ఎగరేస్తారు. “నిస్సహాయులు చెంపదెబ్బ కొట్టకపోవచ్చు… ఎదుటి వాడు దహించడానికి ఒక్క కంటి చూపు చాలదా?” అనే కొడుకు మాటల్లో నిస్సహాయుల కసి కనిపిస్తుంది.

దోపిడీకి గురైన కుటుంబం తిరిగి పోరాటానికి సిద్ధపడటం అభినందనీయమైన ముగింపు. కానీ, కథంతా కేవలం ఒకే చోట కూర్చుని ఆ కుటుంబ సభ్యులు (రాజేశ్వరమ్మ, భారతి, మనవళ్లు) గతం గురించి మాట్లాడుకోవడానికే పరిమితమైంది. ప్రతినాయకుడి (పక్కింటి వాడు) పాత్రను ముఖాముఖి ఢీకొనే సన్నివేశం లేదు. ఆక్రమణ ఎలా జరిగిందనేది కేవలం సంభాషణల ద్వారా కాకుండా, సంఘటనల ద్వారా చూపిస్తే కథా శిల్పం పదునుగా ఉండేది.

5. కమర్షియల్ మాయాజాలం –
అస్తిత్వ శోధన

కథ పేరు: సాలభంజిక రచయిత: మణి వడ్లమాని (వార్త)

సోషల్ మీడియా యుగంలో మనిషి తన నిజమైన అస్తిత్వాన్ని కోల్పోయి, ‘లైకుల’ కోసం ఎలా ఒక నిర్జీవమైన వస్తువుగా మారిపోతున్నాడో ఈ కథ చర్చిస్తుంది. అన్విత అనే అమ్మాయిని ఆమె ప్రియుడు రాఘవ్ రకరకాల గుళ్లల్లోని ‘సాలభంజిక’ (శిల్ప సుందరి) రూపాల్లో ఫోటోలు తీస్తుంటాడు. పస్తులుండి, ఆభరణాల బరువు మోస్తూ ఆమె పడే నరకం అతనికి పట్టదు. అతనికి వ్యూస్, బ్రాండ్స్ మాత్రమే ముఖ్యం. విసుగెత్తిన అన్విత మేకప్ లేకుండా ఉన్న తన అలసిన మొహాన్ని “ఇది నిజమైన నేను” అని పోస్ట్ చేయగా దానికి విపరీతమైన స్పందన వస్తుంది. దాన్ని కూడా రాఘవ్ క్యాష్ చేసుకోవాలని చూసినప్పుడు, అన్విత అతన్ని తిరస్కరించి, అకౌంట్ డిలీట్ చేసి తన స్వేచ్ఛను వెతుక్కోవడం ముగింపు.

వ్యాపార ప్రపంచం కన్నీళ్లను కూడా ఎలా అమ్ముకుంటుందో రచయిత్రి అద్భుతంగా పట్టుకున్నారు. అయితే, అన్విత అకౌంట్ డిలీట్ చేసి స్వేచ్ఛ పొందడం అనేది వ్యక్తిగత విముక్తికి ప్రతీక అయినా, ఆధునిక కన్స్యూమరిజాన్ని ఎదిరించడానికి ఇది సరైన పరిష్కారం కాదు. కానీ, సోషల్ మీడియా డొల్లతను, దాని వెనుక ఉన్న పురుషాధిక్య దోపిడీని ఎత్తిచూపడంలో కథ సఫలమైంది.

6. ఆధునిక విలాసాలు –
భ్రమల బతుకులు

కథ పేరు: ఉన్మేషం రచయిత: కె.వి.సుమలత (ఆదివారం ఆంధ్రజ్యోతి)

ఇది కూడా సోషల్ మీడియా వ్యసనానికి సంబంధించిన కథే. అన్విత (ఈ కథలో కూడా అదే పేరు) తన ప్రతి చిన్న సంతోషాన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. ఒక అపరిచితుడు ఆమె ఫోన్ ను హ్యాక్ చేసి, ఇంట్లోని వైఫై ద్వారా ల్యాప్ టాప్ కెమెరాను ఆన్ చేసి ఆమె ఏకాంత వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తాడు. భర్త ప్రకాష్ సైబర్ క్రైమ్ పోలీసుల సాయంతో ఆ హ్యాకర్ పక్కింటి వాడే అని తేలుస్తాడు.

సైబర్ క్రైమ్ పట్ల అవగాహన పెంచే ఒక ‘పబ్లిక్ సర్వీస్ అనౌన్స్ మెంట్’ లాగా ఈ కథ సాగింది. ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టడం వల్లే హ్యాక్ అయింది అనడం ఒక సాంకేతిక వాస్తవం అయినా, దాన్ని ఒక సృజనాత్మక కథగా మలచడంలో నాటకీయత ఎక్కువైంది. హ్యాకర్ పక్కింటివాడే అవ్వడం ఒక సినిమాటిక్ ట్విస్ట్.

7. మరణం తర్వాత మిగిలేది –
మంచితనపు ఆనవాళ్లు

కథ పేరు: గంగ తీసుకెళ్లనిది రచయిత: గాజోజి శ్రీనివాస్ (ఈనాడు ఆదివారం)

మరణం, జీవితం, అస్తిత్వం అనే మూల స్థంబాల మీద నిలబడిన ఆర్ద్రమైన కథ ఇది. స్నేహితుడు రాజేష్ తండ్రి చనిపోతే, కాశీలో అస్థికలు కలపడానికి వెళ్లిన ఇద్దరు స్నేహితుల ప్రయాణమిది. “మంచి మనిషిగా బతికితే ప్రయోజనం ఏమిటి? చివరికి మిగిలేది బూడిదే కదా” అని రాజేష్ వేదన చెందుతాడు. కానీ, తిరుగు ప్రయాణంలో ఒక చిన్న హోటల్ యజమాని ఆకలితో ఉన్న వృద్ధుడికి ఉచితంగా అన్నం పెట్టి, “ఇప్పుడే విశ్వనాథుడు భోజనం చేసి వెళ్లాడు” అనడం.. ఆ తర్వాత రాజేష్ కూడా తన ఇంటి ముందు ఒక అపరిచిత వృద్ధుడికి భోజనం పెట్టడం కథకు ముగింపు. “గంగ తీసుకెళ్లింది ఆయన అస్థికలను మాత్రమే. తీసుకెళ్లలేనిది ఆయన మంచితనం” అని రచయిత ముగించడం ఒక తాత్విక శిఖరం.

ఇందులో మరణం అనే అనివార్య సత్యం ముందు మనిషి నిస్సహాయతను, కర్మ సిద్ధాంతాన్ని రచయిత అత్యంత హుందాగా చిత్రించారు. ఇందులో శిల్పదోషాలు వెతకడం కష్టం. పాత్రల మానసిక పరిణతి సహజంగా సాగింది.

8. గృహశ్రమకు ప్రతిఫలం –
పురుషాధిక్యానికి సవాల్

కథ పేరు: ఆ ఒక్క నిమిషం! రచయిత: బొల్లిముంత వెంకటరమణారావు (వార్త)

ఆదివారం ఉదయం స్నానానికి వెళ్లిన రామమూర్తికి భార్య సుజాత సబ్బు ఇవ్వకుండా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటుంది. కోపంతో బయటకు వచ్చిన భర్తను, “ఇరవై ఏళ్లలో నా మాట ఎన్నిసార్లు విన్నావు? నా బాధలు ఎన్నిసార్లు పంచుకున్నావు?” అని సుజాత నిలదీస్తుంది. మగవాడి అహంకారాన్ని ఒక గృహిణి సున్నితంగా, కానీ గట్టిగా ప్రశ్నించే కథ ఇది.

స్త్రీల అదృశ్య శ్రమను ఎత్తిచూపిన కథ ఇది. కానీ, కథనం మొత్తం కేవలం డైలాగులకే పరిమితమైంది. సమస్యను ఒకే ఒక సంఘటన (సబ్బు ఇవ్వకపోవడం) ద్వారా ఎలివేట్ చేయడం మంచి ఎత్తుగడే అయినా, కథనం ఒక స్కిట్ లాగా ముగిసింది.

9. అంధకారం – అంతరంగం

కథ పేరు: ఆ గదిలో.. చీకటిలో.. రచయిత: మహమ్మద్ అన్వర్ (సాక్షి ఫన్డే)

దిగువ మధ్యతరగతి దంపతుల శృంగార లేమిని, వారి ప్రైవసీకి అడ్డంకిగా మారిన ఇరుకు గదులను చర్చిస్తున్న కథ ఇది. కొత్తగా పెళ్లయిన సూరిబాబు, గౌరి హైదరాబాద్ లోని ఒక చిన్న గదిలో అద్దెకు ఉంటారు. వాళ్లతో పాటే సూరిబాబు తల్లి ముత్యాలమ్మ ఉంటుంది. ఏకాంతం కోసం తపించి, నెల్లాళ్లు డబ్బు కూడబెట్టుకుని ఓయో రూమ్ కు వెళ్తే, అక్కడ పోలీసులు రైడ్ చేసి పట్టుకోవడం, తల్లి వచ్చి విడిపించుకుని వెళ్లడం జరుగుతుంది. కనీసం ఆ రాత్రైనా ఏకాంతం దొరుకుతుందని ఆశిస్తే, ఊరి నుంచి అనసూయత్త వచ్చి వాళ్ల ఇంట్లోనే “ఇరుకింట్లోనే సుఖం ఉంటుంది” అని తిష్ట వేయడం ముగింపు.

మధ్యతరగతి జీవుల లైంగిక అణచివేతను రచయిత ఎంతో వాస్తవికంగా, హాస్యభరితంగా చిత్రించారు. అయితే, పోలీసుల రైడ్ వ్యవహారం కాస్త సినిమాటిక్ గా సాగింది. ముగింపులో అనసూయత్త రాక హాస్యాన్ని పండించినా, ప్రధాన సమస్యకు పరిష్కారం లభించలేదు.

10. మధ్యతరగతి ఆదర్శం –
వాస్తవిక మానవత్వం

కథ పేరు: మనలో ఒకరు రచయిత: జీడిగుంట నరసింహమూర్తి (విశాలాంధ్ర)

భార్యకు (రమణి) అనారోగ్యం కారణంగా వంట కోసం తన బంధువు రత్నంను ఇంట్లో పెట్టుకుంటాడు శ్రీకాంత్. రత్నం రాకతో రమణిలో అభద్రతాభావం (తన భర్తను ఎక్కడ లాగేసుకుంటుందో అని) కలుగుతుంది. పనిమనిషి మాటలు వినడం, భర్త చనువుగా ఉండటంతో రమణి డిప్రెషన్ కు గురై కిందపడిపోతుంది. కానీ, ఆ తర్వాత రత్నం చేసిన సేవలు చూసి, తన తప్పు తెలుసుకుని, రత్నంను “మనలో ఒకరిగా” అంగీకరిస్తుంది రమణి.

స్త్రీల మధ్య ఉండే సహజమైన అభద్రతాభావాన్ని, ఆ తర్వాత వచ్చే పరివర్తనను రచయిత బాగానే చిత్రించారు. కానీ, భర్త శ్రీకాంత్ రత్నంతో “నీ కోసం నా భార్యను ఎదిరించడానికి సిద్ధం” అని అనడం రమణి అపార్థం చేసుకోవడానికి కారణమైంది. ఆ మాటల వెనుక ఉన్న నిజమైన ఉద్దేశ్యాన్ని స్పష్టపరచడంతో కథ సంపూర్ణంగా ముగిసింది.

సాహిత్యం నిరంతరం ప్రవహించే నది లాంటిది. అందులో సమాజపు మురికి, స్వచ్ఛత రెండూ ప్రతిఫలిస్తాయి. 26 జులై 2026 నాటి ‘కథానిధి’ సంకలనంలోని ఈ కథలూ సామాజిక పత్రాలు.

అటు గిరిజన జీవన పోరాటాన్ని అక్షరబద్ధం చేసిన ‘యాడి గొంతు’ అయినా, నగర జీవితపు లైంగిక అణచివేతను చూపిన ‘ఆ గదిలో.. చీకటిలో..’ అయినా, మత సామరస్యాన్ని చాటిన ‘కాఫిర్’ అయినా, ఆదర్శ భావాలను బోధించిన ‘గంగ తీసుకెళ్లనిది’ అయినా… ప్రతి కథా సమాజంలోని ఒక చీకటి కోణాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నించింది. రచయితలు తమ పాత్రల అంతరంగంలోకి చొచ్చుకుపోయి, వారి భయాలను, ఆశలను, పోరాటాలను అత్యంత కళాత్మకంగా చిత్రించారు.

సమాజంలో వస్తున్న సంక్లిష్టమైన మార్పులను, మనిషిలోని స్వార్థాన్ని, అదే సమయంలో మొలకెత్తుతున్న మానవత్వాన్ని ఈ కథలు సమగ్రంగా రికార్డు చేశాయి. ఏది ఏమైనప్పటికీ, మన చుట్టూ జరుగుతున్న కల్లోల జీవితాన్ని ఇంత నిశితంగా పరిశీలించి, పాఠకుల ఆలోచనా క్షితిజాలను విస్తృతం చేసిన ఈ రచయితలందరూ అభినందనీయులు. మునిసురేష్ పిళ్లె గారి లాంటి వారి అకుంఠిత కృషితో వెలువడుతున్న ఇలాంటి ‘కథానిధి’ సంకలనాలు తెలుగు కథా భవిష్యత్తుకు, సాహిత్య పఠనాసక్తికి గొప్ప భరోసానిస్తున్నాయి. నేటి సమాజానికి అవసరమైన ఒక గొప్ప తాత్విక, సామాజిక చైతన్యాన్ని ఈ కథలు అందిస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags: bhukya gopi nayakka muni suresh pillaikathanidhi reviewshort stories reviewsunday stories reviewకథానిధికథానిధి ఆదివారం కథలుకథానిధి సమీక్షకె ఎ మునిసురేష్ పిళ్లెభూక్యా గోపి నాయక్
Subscribe
Login
Notify of
guest
Optional

guest

2 Comments
Oldest
Newest Most Voted
suma kaikala
suma kaikala
1 day ago

మీ సమీక్షలు కథల ఆత్మలను సాక్షాత్కరింపజేసాయి. మీకు హృదయ పూర్వకమైన ధన్యవాదాలు సర్

0
Reply
PRASAD CHAGANTI
PRASAD CHAGANTI
1 day ago

యాడి గొంతు కథ అద్భుతంగా ఉంది. సమీక్షలన్నీ కథలను చవించేలా ఉన్నాయి.

0
Reply

Top Read Stories

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
2
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply