సిపిఐ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అరుణ పతాకాన్ని ఎగురవేసి, అమరులకు శాల్యూట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వున్న అన్ని రాష్ట్రాల్లోను ఈరోజు సిపిఐ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించామని అన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా కారణంగా దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజల జీవితాలు తారుమారు అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడంలో విఫలం అయ్యిందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మూడు రైతు చట్టాలు రైతులకు నష్టం కలిగించేలా వున్నాయని, వాటిని మోడీ ప్రభుత్వం రద్దుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాము రేపు ఢిల్లీకి వెళ్లి ఆంధ్రప్రదేశ్ రైతులకు తమ సంఘీభావం ప్రకటిస్తామని ఆయన అన్నారు. రైతులకు అన్యాయం చేసే ఈ నల్ల చట్టాలపై మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు తమ పోరు ఆగదని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం జగన్నాటకాలు ఆడుతోందని ఆయన విమర్శించారు. జగన్ ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్టుగా ప్రజలపై పలు భారాలను మోపుతోందని ఆయన అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన అన్నారు. జగన్ రాజధాని విషయంలో కులప్రస్తావన తీసుకువచ్చి తద్వారా ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అమరావతి రాజధాని కాదని ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ రాజధాని ఏది అని ఎవరైనా అడిగితే ఫలానా అని చెప్పుకోలేక సిగ్గుపడుతున్నారని ఆయన అన్నారు. ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ ఉద్యమిస్తుందని ఆయన అన్నారు.
.