మునిసిపల్ ఎన్నికలు పార్టీల గుర్తుల మీద జరుగుతున్న నేపథ్యంలో.. అగ్ర పార్టీలు వీటిని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులను ప్రతిఘటించడానికి చంద్రబాబునాయుడు స్వయంగా రంగంలోకి దిగుతోంటే.. ఆయనను అరెస్టు చేయడానికైనా వెనుకాకూడదని ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.
తిరుపతి, చిత్తూరు మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ తెలుగుదేశానికి చెందిన అభ్యర్థులపై దాడులు జరిగాయి. అధికార పార్టీ నాయకులు కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వడం లేదని నానా గందరగోళం అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో.. చంద్రబాబునాయుడు సోమవారం తిరుపతి, చిత్తూరు పర్యటన పెట్టుకున్నారు. ఉదయం 9:30 కు హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయంకు చేరుకోనున్న చంద్రబాబు రోడ్డు మార్గంలో 11.30 గంటలకు చిత్తూరు కు చేరుకుని గాంధీ విగ్రహం ముందు నిరసన తెలియజేస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు తిరుపతి కి చేరుకుని గాంధీ విగ్రహం ముందు నిరసన తెలియజేస్తారు.. అనేది పార్టీ ప్రకటించిన కార్యక్రమం. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల పై దాడులు, అక్రమ కేసులను నిరసిస్తూ చంద్రబాబు స్వయంగా ఆందోళనకు దిగనున్నట్లు పార్టీ పేర్కొంది.
అయితే.. ఈ నిరసనలకు అనుమతులు లేవని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. అటు చిత్తూరు పోలీసులు, ఇటు తిరుపతి పోలీసులు విడివిడిగా ప్రకటనలు చేశారు. చిత్తూరు నగరంలో చంద్రబాబు నాయుడు నిరసన దీక్షకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. తిరుపతిలో కూడా ఇలాంటి ప్రకటనే వచ్చింది. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఎన్నికల ప్రవర్తన నియమావళి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చిత్తూరు పర్యటనకు పోలీసులు నో చెప్పారు.
కొవిడ్ సెకండ్ వేవ్ ప్రబలుతున్నదనే అనుమానాలు బాగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మునిసిపల్ ప్రచారాల్లో పాల్గొనదగిన వ్యక్తుల సంఖ్యను కూడా కుదించారు. అ యితే, చంద్రబాబునాయుడు నిరసన దీక్షలకు కూడా అనుమతి ఇవ్వకపోవడం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసేలా ఉంది. ప్రజాస్వామ్యయుతంగా గాంధీ విగ్రహాల వద్ద నిరసనలకు కూడా అనుమతి రాకపోవడం ఘోరం అని తెదేపా వర్గాలు అంటున్నాయి.
ఎయిర్‌పోర్ట్ వద్దే అరెస్టు!
షెడ్యూలు ప్రకారం చంద్రబాబునాయుడు సోమవారం ఉదయం 9.30కు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి మొదట రోడ్డు మార్గంలో చిత్తూరు వెళ్లాలనేది ప్లాన్. అయితే చంద్రబాబునాయుడును చిత్తూరు వెళ్లనివ్వకుండానే చూడాలని పోలీసులు భావిస్తున్నారు. కొవిడ్, ఉద్రిక్తతలు ప్రబలుతాయనే కారణాలతో ఆయనను నిలువరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు రాగానే అక్కడే ఆపేస్తారని, అవసరమైతే అరెస్టు చేస్తారని తెలుస్తోంది.
పార్టీ నిరసనలకు అనుమతించకుండా.. పోలీసులు కట్టడిచేసేట్లయితే గట్టిగానే ప్రతిఘటించడానికి తెలుగుదేశం నాయకులు కూడా సిద్ధం అవుతున్నారు. ఎయిర్ పోర్ట్ వద్దకు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు చేరుకునే అవకాశం ఉంది. నాయకులను కూడా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసినా, ఇళ్లు కదలకుండా నిర్బంధించినా ఆశ్చర్యం లేదని పలువురు అంచనా వేస్తున్నారు.
.

Discussion about this post