ఏ శిశువుకైనా అమ్మఒడే తొలి బడి. ఆ బడిలో అక్షరాలు దిద్దకపోయినా ఆది గురువు అయిన అమ్మ ద్వారా ఎన్నో అర్థవంతమైన పదాలను తనకు తెలియకుండానే అవగతం చేసుకుంటారు.
తెలియక వేసే తప్పటడుగులను తండ్రి సరిదిద్దితే తెలిసి వేసే తప్పటడుగులను గురువు సరిదిద్దుతాడు.
చిమ్మచీకటిని సూర్యుడు ప్రాలదోలితే, అజ్ఞానపు అంధకారాన్ని గురువు ప్రాలదోలుతాడు.
అలా..
నాలోని అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జీవనానికి అర్థాన్ని అందించిన గురువులు ఇద్దరయితే, జీవితానికే పరమార్థాన్ని ప్రసాదించిన సద్గురు ఇంకొకరు.
నేను ‘బాబుఅగ్రహారం’ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడవతరగతి పూర్తిచేసుకుని జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతిలో చేరేటప్పటికీ ‘నలుగురిలో నారాయణ’ అన్నట్లు మూమూలు విద్యార్థినే. అప్పుడు గవర్నమెంటు పాఠశాలలే తప్ప ప్రైవేటు పాఠశాలలు ఉండేవికావు. అందువల్ల ప్రభుత్వ ఉపాధ్యాయులే సాయంత్రపు వేళ్ళల్లో ట్యూషన్స్ చెప్పేవారు. నాలోని మందతనాన్ని పసిగట్టిన మా అమ్మానాన్న నేను పదవతరగతికి వచ్చిన తర్వాత నన్ను కూడా ‘యస్.వి.టుటోరియల్స్’ అనే ట్యూషనులో చేర్పించారు. ఆ ట్యూషన్ యజమాని శ్రీ యస్.వి. రమణగారు.
అప్పటివరకు ఎందరో గురువులు నాకు విద్యను బోధించినా నన్ను ప్రభావితం చేసిన తొలి గురువు శ్రీ యస్.వి.రమణగారు. ఏ సబ్జక్టు అయినా అవలీలగా చెప్పగల అరుదైన గురువు ఆయన. ఎంతటి కఠినతరమైన లెక్క అయినా కరతలామలకంగా, అంతుచిక్కని ఏ సైన్సు సంగతులైనా సరళంగా సాక్షాత్కరించగల అసమాన, అనితరసాధ్యుడు ఆయన.
ఆయన ప్రభావంవల్లే నాలోని నిద్రాణమై మరుగునపడి అచేతనమైన విద్య మెల్లగా చేతనావస్థలోకి రావడం మొదలైంది. ఆయన ప్రసాదించిన జ్ఞానంవల్లనేమో పదవతరగతిలో జరిగే ఆరుమాసాల పరీక్షలలోని సైన్సు సబ్జక్టులో నేను రాసిన విధానం చూసి ముగ్దుడైన గురువర్యులు శ్రీ పరశురామ నాయుడుగారు నాకు నూటికి నూరు మార్కులు వేశారు. అలా నాలో స్ఫూర్తిని నింపిన రెండవ గురువు శ్రీ పరశురామ నాయుడుగారు.
అప్పటినుంచి అనునిత్యమూ నన్ను ప్రోత్సహిస్తూ,ఎన్నో మెలకువలు నేర్పిస్తూ నేను ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యేలా చేసిన జ్ఞాన ప్రదాత శ్రీ పరశురామ నాయుడు గారు. నేను ప్రథమశ్రేణిలో పాసైనా తృప్తిచెందని ఆయన ఆ సమయంలో ఓ మాట అన్నారు…
“రేయ్ ప్రసాద్! నీవు స్కూలు ఫస్ట్ వస్తావనుకున్నాను. ఇలా చేసావ్ ఏంరా” అని.
నేను స్కూలు ఫస్ట్ రాకపోయినా ఆరోజు ఆయన అన్న మాట నాలో ఎంతో స్ఫూర్తిని కలిగించింది. ఆ స్ఫూర్తి భవిష్యత్తు జీవితానికి ఎంతగానో ఉపయోగపడింది. నా కంటే బాగా చదివే ఉత్తమ విద్యార్థులు అయిన మన మిత్రులు పార్షి బాలాజీ, సురేష్ పిళ్ళె, గల్లా మురళీకృష్ణ పదవతరగతి ఫలితాలలో పాఠశాల స్థాయిలో మొదటి మూడు ర్యాంకులు సాధించడం నాకు ఎంతో గర్వకారణం. నేను స్కూలు ఫస్ట్ రావాలనుకోవడం అత్యాశే అయినప్పటికీ మొదటి పది స్థానాలలో నాపేరు కూడా ఉండడం గురువుగారి కృపేనని ఖచ్చితంగా చెప్పగలను.
నేను పదవతరగతి పూర్తిచేసిన తర్వాత సరిగ్గా ఆరేండ్ల తర్వాత అదే పాఠశాలకు ట్రైనీ సైన్సు టీచరుగా రావడం కాకతాళీయం అయితే అప్పటికీ ఆయన అక్కడే ఉండడం నా పూర్వజన్మ సుకృతం.
ఆ పాఠశాలలోనే ఉన్నారని తెలిసిన ఆనందంలో… గురువుగారిని వెదుకులాడుతూ…
ఆయన ఉండే గదిలోకి వెళ్ళి ఎదురుపడి…
నమస్కరించినప్పుడు…
నన్ను చూస్తూనే గుర్తుపట్టి…
“ఏంరా ప్రసాద్ ఇలా వచ్చావు ఏంటీ సంగతి?” అన్నారు.
“సార్! నేను ఈ పాఠశాలలోనే ట్రైనీ సైన్సు టీచరుగా వచ్చాను సార్” అన్నప్పుడు గురువుగారి ముఖంలో శిష్యోత్సాహము నాకు ఇప్పటికీ గుర్తుంది.
ఆ ఆనందంలో గురువుగారు నా వైపు చూసినప్పుడు…
‘నేను నాటిన మొక్కలలో ఓ మొక్కలోని ఓ మొగ్గ వికసించిన పుష్పమై నాకు గురుదక్షిణ సమర్పించడానికి నా ఎదుటకు వచ్చిందా’ అన్న భావన ఆయనలో నాకు కనిపించింది. అందువల్లనేమో ఆరోజు నన్ను దగ్గరకు తీసుకుని “శభాష్ రా శిష్యా” అని నా భుజాన్ని తట్టారు. ఆ మధురక్షణం నా జీవితంలో ఎప్పటికీ మరువలేని అపూర్వ ఘట్టం.
ఇలా…
లౌకిక పరమైన జీవనానికి అర్థాన్ని అదించిన గురువులు వీరిద్దరూ.
అలాగే…
అలౌకికమైన ఆనందాన్ని నాలో నింపి నా జీవితానికే పరమార్థాన్ని ప్రసాదించిన సద్గురువు శ్రీ సుబ్రహ్మణ్యంగారు.
“భగవంతుడు ఒక్కడే. ఆ ఒక్కడు బయట ఎక్కడాలేడని, తనలోనే తానై ఉన్నాడు” అనే పరమ సత్యాన్ని ఎరుక పరచిన పరమానంద స్వరూపుడు ఆయన.
ఆధ్యాత్మికంలో “అంతా ఈశ్వరేచ్ఛ” అనే వాక్యాన్ని తరచుగా వాడుతుంటాం. అంటే జరిగేదంతా ఈశ్వరుని ఇచ్ఛానుసారంగానే జరుగుతుందని అర్థం.
అలాంటప్పుడు మనకు జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలకు బాధపడకూడదు కదా. మరి మనం బాధపడకుండ ఉన్నామా? అనే ప్రశ్నకు లేదనే సమాధానమే వస్తుంది మన అందరి దగ్గర నుంచి.
కథా రచయితకు తెలియకుండా కథలోని పాత్రకు ఆ కథ నుంచి తప్పుకునే వీలుంటుందా? ఉండదు కదా. అలాగే ప్రపంచాన్ని రచించిన విశ్వకథా రచయిత అయిన భగవంతునికి తెలియకుండా ఈ ప్రపంచం నుంచి తప్పుకునే వీలు మనకు కూడా ఉండదు.
కాబట్టి…
“ఇక్కడ జరిగే ఏ విషయమైనా భగవంతుని ఇచ్ఛానుసారమే జరుగుతుంది. మనం దేనికీ చింతించవలసిన అవసరంలేదు” అని నిశ్చింతను నాలో కలిగించిన మహనీయుడు మా గురువుగారు.
అజ్ఞానాంధకారంలో అచేతనమై అలమటిస్తున్న నాలో జ్ఞానమనే వెలుగును మా గురువుగారు నింపడంవల్లే నేను ఇవాళ ఇన్ని వాక్యాలు రాయగలుగుతున్నాను.
అందుకే…
ఎవరి జీవితానికైనా సన్మార్గాన్ని నిర్దేశించే సరైన మార్గదర్శి…సద్గురువే.
* * *
“దేని వలన సంస్కారలోపాలన్నీ తొలగిపోతాయో అదే ఉత్తమవిద్య” అన్నారు వివేకానందులు. అంతేగానీ విద్య అంటే మార్కులు కాదు, ర్యాంకులు కాదు.
విద్య అంటే సంస్కారం.
సంస్కారం అంటే ఉత్తమవస్త్రాలను ధరించడం కాదు.
సంస్కారం అంటే శీలం.
శీలం అంటే పారదర్శకత (transparency).
విద్యార్థులకు శీలాన్ని నేర్పేవాడే ఉత్తమ ఉపాధ్యాయుడు.
* * *
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159.
.
Discussion about this post