ప్రతి ఉదయాన్నే మనకు అనేక మంది బాబాలు, గురువులు, ప్రవచన కర్తలు, ప్రవక్తలు కనిపిస్తారు. సోషల్ మీడియా నిండా.. వేల వేల సందేశాలు, సదుపదేశాలు వడ్డిస్తూ ఉంటారు. ఫార్వర్డ్ లుగా వచ్చి పడిపోయే ఆ సందేశాలలో, ఉపదేశాలలో అర్థం పర్థం లేనివి, ఎంతో లోతైనవి, ఎంతో జీవితానుభవంతో తప్ప చెప్పలేనివీ కూడా ఉంటాయి.
మనకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఆ ఉపదేశాలు పంపే మిత్రుల ఆచరణశీలతకు, వారు చెబుతున్న మాటలకు మనకు చాలా పెద్ద వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. అసలు వారు పంపే సందేశానికి, వారి సొంత ఆలోచన సరళికి కూడా చాలా తేడా కనిపిస్తూ ఉంటుంది. ఆచరణలో ఎరగని మాటలు అనేకం వారు చెబుతున్నట్లుగా మనకు సందేహం కలుగుతూ ఉంటుంది.
ఇలాంటి సామాజిక వైఖరుల గురించి.. ఓ సుభాషితం మనకు వివరిస్తుంది..
కుసుమం వర్ణ సంపన్నం గంధహీనం న శోభతే
న శోభతే క్రియాహీనం మధురం వచనం తథా
సువాసన లేని పువ్వు ఎంత అందంగా ఉన్నప్పటికీ అది శోభించదు. అదే మాదిరిగా.. ఆచరణ రూపం లేకుండా.. కేవలం, తియ్యటి మాటలు చెప్పడం వలన కూడా ఎలాంటి ఫలితమూ ఉండదు. .. అనేది శ్లోకభావం.
ఇతరులకు చెప్పవలసిన సందర్భం వస్తే.. చాలా మంది చాలా గొప్ప మాటలే చెబుతారు! అయితే ఆ మాటలను వారి జీవితంలో ఆచరించే వారెందరు? ఈ ప్రశ్న మనకు చాలా సందర్భాల్లో ఎదురవుతూ ఉంటుంది.
మన మిత్రుల్లో వారి వ్యక్తిగత జీవితంలో ఆచరించే అలవాట్లు, బుద్ధులు ఒక రకంగా ఉంటాయి. కానీ.. వారు చెప్పేమాటలు, సోషల్ వేదికల మీద పంపే సందేశాలు మరొకరకంగా ప్రతిఫలిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఆశ్చర్యం కలుగుతుంటుంది.
ఇలాంటి మాటలలో ఎంత గొప్ప సందేశం అయినా, ఎంత గొప్ప భావం అయినా ఉండవచ్చు గాక.. కానీ దానివల్ల ఫలితం ఏముంటుంది? వాసనలేని పువ్వును ఏం చేసుకుంటాం. కేవలం అలంకారంగా వాడుకోవాల్సిందే తప్ప.. దాని అసలైన మధురిమను ఆస్వాదించలేం. ఆచరణలేని మాటలు కూడా అంతే.. అవి గొప్పగా కనిపించవచ్చు గానీ.. ఎప్పటికీ.. వాటికి విలువ ఉండదు.
శుభోదయం
EXCLUSIVE ARTICLES
జర్నలిజం గురువు డాక్టర్ గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేక పేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.

Discussion about this post