‘యుద్ధంలో బలయ్యేది మనుషులు. యుద్ధానంతర పరిణామాల్లోనూ బలి అవుతుండేది మానవత్వం’ అనే సత్యాన్ని తన కథలో అద్భుతంగా ఆవిష్కరించారు రచయిత ఎమ్వీ రామిరెడ్డి. నమస్తే తెలంగాణ పత్రికతో కలిసి ముల్కనూరు సాహిత్య పీఠం నిర్వహించిన 2026 కథల పోటీలో తృతీయ బహుమతిగా 10వేల రూపాయలు సాధించిన కథ ‘మాదా కవళం’.. బతుకమ్మలో 6 సెప్టెంబరు 2026 నాడు ప్రచురితమైంది.
నిర్దిష్టంగా ఫలానాయుద్ధం అని చెప్పకుండా.. యుద్ధం అనే దుర్మార్గం ఏ బలిని కోరుకుంటున్నదో ఈ కథ చాలా గాఢంగా చర్చిస్తుంది. ఈ కథ గురించి రచయిత ఎమ్వీ రామిరెడ్డితో భూక్యా గోపి నాయక్ చేసిన ఇంటర్వ్యూ పూర్తి పాఠం చదవండి.
ఎమ్వీ రామిరెడ్డి కథ మాదాకవళం చదవడానికి ఈ కింది లింక్ నుంచి కథానిధి డౌన్లోడ్ చేసుకోండి
KATHANIDHI Adivaram Kathalu 20260906 new
1. “మాదాకవళం” కథ చదివాక చాలా కాలం వెంటాడే అనుభూతి కలుగుతుంది. ఈ కథకు బీజం ఎక్కడ పడింది?
ఎమ్వీ రామిరెడ్డి : నెలల తరబడి యుద్దాలు జరుగుతున్న దేశాల్లో ‘ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్’ ఆహార శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. అలా ఏర్పాటైన శిబిరాలకు జనం పోటెత్తి, ఆహారం కోసం ఎదురు చూస్తుండగా/ ఆహారపంపిణీ జరుగుతుండగా… హఠాత్తుగా ఎటువైపు నుంచో కాల్పులు మొదలవుతాయి. కొన్నిచోట్ల సైనికులు, మరికొన్ని చోట్ల స్థానిక ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారు. ఈ దుర్మార్గానికి సంబంధించి నేను పదీ పదిహేను వార్తలు చదివాను. మరిన్ని వివరాల కోసం అన్వేషించాను. నిర్ఘాంతపరిచే అంశాలు నా దృష్టికి వచ్చాయి. ఇంకొంత సమాచారం కోసం War Victims కు సంబంధించిన కేస్ స్టడీస్ అధ్యయనం చేశాను. విస్తృతమైన ఆ సమాచారాన్ని ఒక కథలోకి ఇమడ్చటం పెద్ద సవాలుగా మారింది. సాధనతో ఆ పని పూర్తి చేశాను.
2. కథలో ఏ దేశం పేరు స్పష్టంగా చెప్పలేదు. కానీ గాజా, ఉక్రెయిన్, సూడాన్, రువాండా వంటి అనేక ప్రాంతాలు గుర్తుకు వస్తాయి. ఇది ఉద్దేశపూర్వకమేనా?
ఎమ్వీ రామిరెడ్డి : కేవలం ఒకటో రెండో దేశాలకు లేదా ప్రాంతాలకు పరిమితమై ఉన్న దుర్మార్గం కాదిది. యుద్ధం కన్నెర్రజేస్తున్న ప్రతి చోటా ఈ జీవన విధ్వంసం రచ్చకెక్కి రంకెలు వేస్తోంది. మీరు పేర్కొన్న దేశాలన్నిటిలోనూ ఇదే పరిస్థితి ఉందని ఉద్దేశపూర్వకంగానే ఉటంకించాను.
3. డేనియల్, హనా, జావెద్, కెఫాయా- ఈ నాలుగు పాత్రలు చాలా భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చినట్టున్నాయి. వీటిని ఎలా నిర్మించారు?
ఎమ్వీ రామిరెడ్డి : యుద్ధం వల్ల కష్టనష్టాల పాలైన అనేక మంది గాథలు చదివాను. ఏ రెండు నేపథ్యాలూ ఒకేలా ఉండకుండా జాగ్రత్త పడ్డాను. అదే సమయంలో, నాలుగు దేశాల్ని లేదా జాతుల్ని ప్రతిబింబించే పాత్రలకు రూపకల్పన చేసుకున్నాను. నిజ జీవితంలోని వారి ప్రస్థానాలకు సున్నితమైన సృజనను జోడించి (కృత్రిమత్వం చొరబడకుండా) ‘కదనరంగాల’ను నిర్మించాను.
4. హనా పాత్ర చాలా హృదయవిదారకంగా ఉంటుంది. పన్నెండేళ్ల బాలికలో అంతటి జీవన విషాదాన్ని కేంద్రీకరించడానికి కారణం ఏమిటి?
ఎమ్వీ రామిరెడ్డి : వార్ విక్టిమ్స్ గురించి చదివే క్రమంలో చాలావరకు చిన్నపిల్లలే దిక్కులేని పక్షుల్లా మారుతున్న విషయం అర్థం చేసుకున్నాను. గాజాలో ఓ పాప తన తల్లికోసం ఒక్క రోటీ సంపాదించటానికి పడిన కష్టం గురించి తెలుసుకున్నప్పుడు… హనా పాత్ర ప్రాణం పోసుకుంది.
5. డేనియల్ పాత్ర కథ చివర్లో పాఠకుడిని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఒకప్పుడు అన్నదానం చేసిన వ్యక్తి, చివరికి ఓ చిన్నారి చేతిలోని ఆహారాన్ని లాక్కుంటాడు. ఈ పాత్ర ద్వారా ఏమి చెప్పాలనుకున్నారు?
ఎమ్వీ రామిరెడ్డి : ఆకలిని మించిన అణుబాంబు లేదు. ఆ సమయంలో… అతని పేగుల్లో రగుల్కొన్న అగ్గిని చల్లార్చుకోవటమే డేనియల్ అంతిమలక్ష్యంగా మారింది. అందుకే, పాపను విసిరికొట్టి మరీ ఆహారాన్ని లాక్కున్నాడు.
6. ఈ కథలో అసలు కథానాయకుడు ఎవరు- డేనియల్, హనా, జావెద్, కెఫాయా? లేక మరెవరైనా?
ఎమ్వీ రామిరెడ్డి : వాళ్లెవ్వరూ కాదు. ఆకలి!
7. “మాదాకవళం” అనే శీర్షిక ఎలా పుట్టింది? ఈ శీర్షిక వెనుక ప్రతీకాత్మకత ఏమిటి?
ఎమ్వీ రామిరెడ్డి : యుద్ధాల కారణంగా తలెత్తుతున్న సంక్షోభం విశ్వసమాజాన్ని అతలాకుతలం చేస్తోంది. ఆఖరికి మానవజాతి యావత్తూ ‘మాదా కవళం తల్లీ’ అని క్షోభించే దుస్థితి దగ్గర్లోనే ఉందన్న దానికి సంకేతంగా ఈ శీర్షికను ఎన్నుకున్నాను. అయితే, ‘ఇంతకన్నా అర్థవంతమైన శీర్షిక కోసం ప్రయత్నించాల్సింది’ అని ఓ సీనియర్ రచయిత అన్నారు.
8. కథలో యుద్ధ దృశ్యాల కంటే యుద్ధానంతర మానవ వేదనకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దానికి ప్రత్యేక కారణం ఉందా?
ఎమ్వీ రామిరెడ్డి : యుద్ధాల గురించి కొత్తగా, ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. యుద్ధానంతర విధ్వంసమే మానవీయ గుణాలకు పాతర వేస్తోంది. అందుకే యుద్ధం ముగిశాక… శాంతి ఒప్పందాల పేరిట నాయకుల ‘కరచాలనాటకాలు’ రక్తి కట్టాక… మిగిలి ఉండే మానవ వేదననే అక్షరీకరించాలనుకున్నాను.
9. కెఫాయా పాత్ర ద్వారా యుద్ధాల్లో మహిళలు ఎదుర్కొనే హింసను ప్రస్తావించారు. ఈ అంశాన్ని కథలో భాగం చేయాల్సిన అవసరం ఎందుకు అనిపించింది?
ఎమ్వీ రామిరెడ్డి : యుద్ధం నేపథ్యంలో దుర్మార్గుడైన ఓ సైనికుడి చేతుల్లో చిత్రవధకు గురైన ఓ మహిళ జీవితం గురించి చదివినప్పుడు కదిలిపోయాను. కుటుంబం నుంచి కురుక్షేత్రం దాకా అంతిమ నష్టజీవులు మహిళలే. కెఫాయా జీవితచిత్రణకు అదే ప్రేరణ.
10. కథలో ఆకలి ఒక ప్రధాన శక్తిగా కనిపిస్తుంది. మీ దృష్టిలో ఈ కథలో అసలు ప్రతినాయకుడు ఎవరు?
ఎమ్వీ రామిరెడ్డి : ఆకలి. అదే సమయంలో హీరో కూడా ఆకలే!
11. ప్రపంచ సాహిత్యంలో మీపై ప్రభావం చూపిన రచయితలు, రచనలు ఏవి?
ఎమ్వీ రామిరెడ్డి : మాక్సిమ్ గోర్కీ ‘అమ్మ’, ఎలెక్స్ హేలీ ‘ఏడు తరాలు’.
12. డేనియల్, హనా, జావెద్, కెఫాయా పాత్రల వెనుక నిజజీవిత అనుభవాలు లేదా వార్తా కథనాల ప్రభావం ఉందా?
ఎమ్వీ రామిరెడ్డి : ప్రభావం లేదని చెబితే, అది అబద్ధమవుతుంది.
13. “కదనరంగం”లుగా కథను విభజించి చెప్పడం వెనుక మీ కథన వ్యూహం ఏమిటి?
ఎమ్వీ రామిరెడ్డి : కథకు శిల్పం ప్రధానం. ఆ నలుగురి నేపథ్యాలను అంతర్భాగంగా చెప్పుకుంటూ పోతే, కథ కలగాపులగమై, పాఠకుడు అయోమయానికి గురయ్యే అవకాశముంది. అందుకే, నాలుగు విభాగాలుగా చేసి, యుద్ధాన్ని స్ఫురింపజేసే ‘కదనరంగం’ అనే ఉపశీర్షికలు వినియోగించుకున్నాను. తద్వారా చదవటంలో ఓ సౌలభ్యం ఉంటుంది.
14. కథ చివర్లో “ఆ మైదానం ఎక్కడ?” అనే ప్రశ్నతో ముగించారు. ఆ ప్రశ్న ద్వారా పాఠకుడిలో ఎలాంటి ఆలోచనను రేకెత్తించాలనుకున్నారు?
ఎమ్వీ రామిరెడ్డి : ఉద్దేశపూర్వకంగానే కథలో ప్రదేశాన్ని ప్రస్తావించలేదు. ఎందుకంటే, ఇది విశ్వవ్యాప్త ఇతివృత్తం. అట్లా అని, ఏ ప్రస్తావనా లేకపోవటం సరికాదు. అందుకే, ముగింపులో అలాంటి రణరంగపు వేదికలు చాలా ఉన్నాయని తేల్చాను.
15. కథలో మీరు ఏ దేశాన్నీ, ఏ మతాన్నీ నేరుగా నిందించలేదు. ఇది రచయితగా మీ చైతన్యపూర్వక నిర్ణయమా?
ఎమ్వీ రామిరెడ్డి : ఇది మంచి గమనింపు. నిజంగా ఇది చైతన్యపూర్వక నిర్ణయమే.
16. ఈ కథ రాస్తున్నప్పుడు మిమ్మల్ని అత్యంత కలచివేసిన దృశ్యం లేదా పాత్ర ఏది?
ఎమ్వీ రామిరెడ్డి : ముష్కరుల కాల్పులు జరుగుతుండగానే హనా అనే పన్నెండేళ్ల పాప తన చెల్లిని రక్షించుకోవటానికి పరుగు తీసే దృశ్యాన్ని రాస్తున్నప్పుడు చాలా బాధ కలిగింది. ఆ చిన్నారిని రక్షించుకోగలిగిందని రాయటం ద్వారా ఆ బాధ నుంచి ఉపశమనం పొందే ప్రయత్నం చేశాను. హనా- నన్ను కలచివేసిన పాత్ర.
17. హనా చేతిలోని రొట్టెముక్కలను డేనియల్ లాక్కునే ముగింపు ముందుగానే నిర్ణయించుకున్నారా? లేక రచనా ప్రక్రియలో పుట్టిందా?
ఎమ్వీ రామిరెడ్డి : ముందుగా అనుకోలేదు. అసలు, కథారచన ప్రారంభించినప్పుడు ముగింపు గురించిన ఆలోచనే లేదు. సగం దాకా కథను నేను నడిపితే, మిగతా సగం… కథే నన్ను నడిపించింది. అత్యంత సహజంగా అక్కడ ఆ సందర్బం ప్రత్యక్షమైంది. కథకు అదే కీలకమైంది.
18. ఈ కథను మీరు యుద్ధ వ్యతిరేక కథగా భావిస్తారా? లేక మానవత్వం గురించిన కథగా భావిస్తారా?
ఎమ్వీ రామిరెడ్డి : రెండూనూ.
19. నేటి ప్రపంచ రాజకీయ పరిస్థితులు, గాజా-ఉక్రెయిన్ వంటి యుద్ధాలు ఈ కథ రచనపై ఎంతవరకు ప్రభావం చూపాయి?
ఎమ్వీ రామిరెడ్డి : రోజులు దాటి, వారాలు గడిచి, నెలలు నిండి, సంవత్సరాల దాకా సాగుతున్న ప్రస్తుత యుద్ధాలే ఈ రచనకు ప్రేరేపించాయి.
20. మీ దృష్టిలో “మాదాకవళం” కథ యొక్క కేంద్ర సందేశం ఏమిటి?
ఎమ్వీ రామిరెడ్డి : యుద్ధాలు పరమ అనవసరమైనవి. వాటివల్ల మానవసమాజం ఊహించని సంక్షోభాల సుడిలో చిక్కుకుంటుంది.
21. తెలుగు కథా పాఠకులు ఈ కథ నుంచి ఏమి తీసుకెళ్లాలని మీరు కోరుకుంటున్నారు?
ఎమ్వీ రామిరెడ్డి : విధ్వంసం ఏ రూపంలో ఉన్నా… దానిని తీవ్రంగా వ్యతిరేకించాలని.
22. ప్రపంచ మానవీయ సంక్షోభాలను కథావస్తువులుగా తీసుకోవడంలో తెలుగు కథ మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారా?
ఎమ్వీ రామిరెడ్డి : ఇవాళ, అంతర్జాతీయ సంక్షోభాల సంఖ్య పెరిగిపోతోంది. అంటే మనం కూడా అందులో భాగమవుతున్నాం. ఈ నేపథ్యంలో స్థానిక సమస్యల వలయాలు దాటి, ప్రపంచస్థాయి వస్తువుల్ని ఎన్నుకోవటం ద్వారా తెలుగు కథావిస్తృతి పెరుగుతుందని నా అభిప్రాయం.
23. “మాదాకవళం” తర్వాత మీరు రాయాలనుకుంటున్న కథల దిశ ఏమిటి?
ఎమ్వీ రామిరెడ్డి : అన్నిసార్లూ అలాంటి కథలే రాయలేం. ప్రస్తుతం ఓ శ్మశానం వేదికగా కథ రాసే ప్రయత్నంలో ఉన్నాను. అయితే, మాదా కవళం స్ఫూర్తితో అంతర్జాతీయ వస్తువులపై దృష్టి పెట్టాలని కూడా నిర్ణయించుకున్నాను.
24. ఆకలి, యుద్ధం, శరణార్థిత్వం వంటి అంశాలపై యువ రచయితలు రాయాలనుకుంటే వారికి మీరు ఏమి సూచిస్తారు?
ఎమ్వీ రామిరెడ్డి : సహజంగా నేను నా అనుభవంలోకి రాని, నా పరిసరాలతో/ పరిచయాలతో సంబంధం లేని వస్తువు జోలికి వెళ్లను. కానీ, కొన్ని పరిణామాలు/ పరిస్థితులు మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తాయి. దానికో సాహిత్యరూపం కల్పించకుండా ఉండలేని స్థితిని కల్పిస్తాయి.
అట్లా రాయాలంటే, అందుకు అవసరమైన సమస్త సరంజామాను జాగ్రత్తగా సిద్ధం చేసుకోవాలి. అధ్యయనం ద్వారా, దృశ్య మాధ్యమాల ద్వారా, చారిత్రక సామాజిక విశేషాల ద్వారా ఆ వస్తువు గురించి స్పష్టమైన అవగాహనం తెచ్చుకోవాలి. ఆ తర్వాతే కథారచనకు పూనుకోవాలి.
.
ముల్కనూరు కథలపోటీలో బహుమతి పొందిన ఎమ్వీ రామిరెడ్డి కథ పుర్వాపరాల ఆధారంగా భూక్యా నాయక్ గారు అడిగిన ప్రశ్నలూ,సమాధానాలూ కూడా పాఠకులకు ఆ కథ గురించే కాకుండా, యుద్ధం పట్ల ప్రజా జీవనం పట్లా చక్కని అవగాహన కలిగించే ఎ దిశలో ఆసక్తికరంగా సాగింది.ఇద్దరికీ అభినందనలు