ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పదవిలోకి వచ్చిన తొలినాళ్లలోనే రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పు చేర్పులు ఉంటాయని విస్పష్టంగా ప్రకటించారు. మంత్రివర్గం తొలికూర్పులో చోటు దక్కకుండా.. మంత్రి పదవికి నన్ను మించిన అర్హులు ఎవ్వరూ లేరని అనుకునే వాళ్లందరూ రెండో విడత బెర్త్ గ్యారంటీ అనే ఆశతో ఇన్నాళ్లూ బతికారు.
కానీ.. ఇప్పుడు వారందరిలో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. బయటకు చెప్పుకోలేకపోతున్నారు గానీ.. జగన్ మీద కినుక వహిస్తున్నారు. ‘అప్పటిదాకా ఆగలేం సార్’ అని నొప్పులు పడుతున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ ఆశావహులను ఇప్పుడు నిరాశ కమ్మేసింది. నిస్పృహలో ఉన్నారు. ఏ ఇద్దరు నాయకులు కలిసినా.. మంత్రివర్గం గురించే మాట్లాడుకుంటున్నారు. అది ఇప్పట్లో జరిగే సంకేతాలు లేవనేది వారి మాటల సారాంశం.
సరిగ్గా రెండున్నరేళ్ల పాలన తర్వాత.. మంత్రివర్గంలో చాలా మందిని తొలగించి కొత్త వారికి చోటు ఇస్తారనేది జగన్ చెప్పిన తొలినాటి మాట. రెండున్నరేళ్ల పాలన సమీపిస్తున్న తరుణం నుంచి దీనికి అనుబంధంగా అనేకానేక పుకార్లు కూడా పుట్టాయి. మంత్రివర్గంలో గరిష్టంగా మార్పులు ఉంటాయని.. కొన్ని పేర్లను బీభత్సంగా ప్రచారంలోకి తెచ్చారు. ఆ తర్వాత.. ముగ్గురు నలుగురు మినహా మొత్తం మంత్రివర్గం మారిపోతుందనే అన్నారు.
చివరికి జగన్‌కు సమీప బంధువు, బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడిన తర్వాత.. కేబినెట్ సమూలంగా మారిపోతుందని.. పూర్తిగా కొత్తవాళ్లతో కొత్త కేబినెట్ ఉంటుందని.. ఇప్పటిదాకా మంత్రులుగా పనిచేసిన వారిలో సీనియర్లను, అనుభవజ్ఞులను వచ్చే ఎన్నికలను ఎదుర్కొనే దళపతులుగా వారి సేవలను పార్టీ కోసం వాడుకుంటారని వినిపించింది. అదే కన్ఫర్మ్ అని అంతా అనుకున్నారు.
మంత్రివర్గం సంఖ్య, స్థానాల గురించిన ఈ చర్చ అంతా ఒక ఎత్తు అయితే.. ఎప్పుడు జరుగుతుందనేది సమాంతరంగా ఇంకో చర్చ నడిచింది. ఆగస్టునుంచి మంత్రివర్గం మార్పులకు సంబంధించిన ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి. విజయదశమి నాటికి, లేదా ఆ తర్వాత, దీపావళి తర్వాత.. ఇలా పలు ముహుర్తాలు వినిపించాయి. అవేమీ నిజం కాలేదు. మొన్నమొన్నటి వరకు సంక్రాంతి తర్వాత మంత్రివర్గం మారుతుందనే మాట వచ్చింది. తాజా సమాచారం ప్రకారం వచ్చే వేసవి వరకు కేబినెట్ ఊసెత్తకపోవచ్చుననే తెలుస్తోంది.
మంత్రి పదవి ఆశావహులు చాన్నాళ్లుగా తమ తమ అర్హతలను నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. జగన్ మీద ఈగ వాలినా అతిగా స్పందిస్తున్నవారూ ఉన్నారు. వారి చేతలన్నీ.. మంత్రిపదవికోసం ఎత్తుగడలే అనే ప్రచారాలూ వినిపిస్తూనే ఉన్నాయి. మంత్రి పదవికి తనను మించిన వాడు లేడని జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడడానికి- నానా పాట్లు పడుతున్నవారు.. కోట్లకు కోట్లు రకరకాల రూపాల్లో కుమ్మరిస్తున్న వారూ ఉన్నారు.
వచ్చే వేసవి దాకా విస్తరణ/ పునర్వ్యవస్థీకరణ ఉండదనే మాట.. ఈ ఆశావహులందరి నెత్తిమీద గుదిబండలా పడింది. ఇటీవల మంత్రులతో, కీలక నాయకులతో జరిగిన ఒక భేటీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు వచ్చే వేసవి వరకు విస్తరణ ఉండదనే సంగతి తెగేసి చెప్పినట్లు సమాచారం. దాంతో అందరూ భంగపడ్డారు. ఇవాళో రేపో మంత్రి పదవి వచ్చేస్తుందని పండగ చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్న వారంతా ఖంగు తిన్నారు.
ఇన్నాళ్లూ మంత్రివర్గ విస్తరణ చుట్టూ చాలా పెద్ద హైడ్రామా నడుస్తూ వచ్చింది. తమకు పదవి దక్కుతుందనే ఆశతో ఎక్స్‌ట్రాలు చేస్తున్న ఎమ్మెల్యేలు, వారికి దక్కుతుందేమోననే భయంతో వారి గురించి దుష్ప్రచారం చేస్తూ వచ్చిన అదే పార్టీలోని శత్రు ఎమ్మెల్యేలు.. ఇలా చాలా రాజకీయాలు నడిచాయి. ఇప్పుడు అసలు ఆ పర్వమే వాయిదా పడిందనే సరికి.. అందరూ గొల్లుమంటున్నారు.
also read : బద్వేలు ఫలితం నుంచి జగన్ నేర్చుకోవాల్సిన పాఠమేంటి?
వచ్చే వేసవి నాటికి అంటే అప్పటికే జగన్ పరిపాలనకు మూడేళ్లు పూర్తవుతాయి. కేవలం రెండేళ్లు మాత్రమే పదవి ఉంటుంది. అసలే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనతో ఉన్నారనే పుకారు ఒకటి ఉంది. కేంద్రం 2024 లోగా జమిలి ఎన్నికలు ప్లాన్ చేస్తుందేమోననే భయం ఒకవైపు ఉంది. ఇలాంటి నేపథ్యంలో వచ్చే వేసవి తర్వాత మంత్రి పదవులు దక్కినా సరే.. కుర్చీల్లో కుదురుకుని కూర్చునేలోగానే.. ఆ పదవీకాలం కాస్త అంతమైపోతుందేమోననే భయం కూడా వారిలో ఉంది. ఇలా అనేక సమీకరణాల నేపథ్యంలో.. జగన్ మంత్రి వర్గ విస్తరణను సుదూరానికి నెట్టడం వలన.. ఆశావహులైన ఎమ్మెల్యేలు దిగులుతో కుమిలిపోతున్నారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.

Discussion about this post