తెలుగునాట భక్తిరసం తెప్పలుగా పారుతోంది డ్రెయినేజీ స్కీము లేక డేంజర్ గా మారుతోంది
— కీ॥శే॥ శ్రీ గజ్జల మల్లారెడ్డి.
‘చురక‘ పేరుతో కీర్తిశేషులు శ్రీ గజ్జల మల్లారెడ్డి గారు ఏబై ఏళ్ళకి పూర్వం (1970 దశకంలో) తెలుగు వారికి చురక అంటించారు.
కార్తీక మాసం, అయ్యప్ప, భవానీ, శివ, దీక్షలతో ప్రస్తుతం తెలుగు రాష్టాలే కాదు, దాదాపు దేశం అంతా భక్తి భావంతో నిండిపోయింది. శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. అయ్యప్ప దేవాలయాలు, అమ్మవారి ఆలయాలు పోటీ పడుతున్నాయి.
అలాగే రంజాన్ మాసంలో ముస్లిం భక్తులతో మసీదులు, డిశంబరులో క్రిస్మస్ సంబరాలతో క్రిస్టియన్ భక్తులతో చర్చిలు కిటకిటలాడుతుంటాయి.
ఈ భక్తి భావం అనేది చాలా విచిత్రమయిన భావన. భక్తులు అందరికీ పోటీ తత్వం ఎక్కువగా ఉంటుంది. తమ పక్కవారిని చూసి అనుసరిస్తుంటారు. ఆ రకమైన పోటీ వలన గుడులు, చర్చిలు, మసీదులు పండుగల రోజులలో విపరీతమైన రద్దీ ఉంటుంది. సాధారణ రోజుల్లో వెళ్ళే వాళ్ళు తక్కువగా ఉంటారు. అంటే భక్తి అనేది ప్రదర్శించుకునేది అవుతోంది. ఈ ప్రదర్శనలో పోటీలు పెరిగి పోయి “భక్తి” అమ్ముడు సరుకు అయిపోయింది. అందుకే అది ‘డ్రెయినేజీ స్కీము లేని వరదలా‘ తయారయింది.
భక్తి- భక్తులకు మనఃశాంతి, మానసిక ఉల్లాసం కలిగించాలి. భక్తి వలన మనిషికి మంచి అలవాట్లు, నడవడిక, స్థైర్యం, దైర్యం, జీవితం పట్ల అవగాహన, సేవా భావం, పరోపకారం, పరమత సహనం, అహింస, సత్యము, క్రమశిక్షణలతో కూడిన సన్మార్గము, మొదలైన గుణాలు అలవడాలి. ఏ మతమైనా చెప్పేది అదే.
దీనిని ఎవరూ కాదనరు. ప్రవచనాల లోను, సూక్తుల లోనూ, చర్చి ప్రార్థనల లోనూ, మసీదు నమాజు ప్రార్థన లోనూ, ఇతర మతాల బోధనల లోనూ చెప్పే సారం ఇదే.
ఇంత భక్తి పెరిగి పోయింది కదా, ఐనా మోసం, దగా, కుట్రలు, కుతంత్రాలు, అన్యాయాలు, నేరాలు పెరుగుతున్నాయే గాని తగ్గటంలేదే అని సందేహం పట్టి పీడిస్తోంది.
లోపం భక్తి లోనా? భక్తులలోనా?
మతం, భక్తి, అనేవి వ్యక్తిగతం. కానీ వాటిని సమాజాలు, సమూహాలు, రాజకీయాలకు అన్వయించడం వలన అవి కలుషితం అయిపోయాయి. మతం, భక్తి లను పూర్తిగా మీ వ్యక్తిగతం చేసుకోవడం అవసరం. మత సమూహాలు, మత సంఘాలు, మత కూటములు, ముస్లిం నమాజులు పూర్తిగా వ్యక్తిగతం కావాలి. వాటిలో రాజకీయాలు ప్రవేశించకుండా అందరూ కృషి చేయాలి.
– పి. పి. శాస్త్రి,
ఏలూరు.
Discussion about this post