కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న విద్యుత్ ఉపకరణాల తయారీ జోన్లలోకి చిత్తూరు జిల్లా మన్నవరం లో గతంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ ను కూడా చేర్చాలని .. తిరుపతి ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎంపీ గురుమూర్తి.. తన సహచర ఎంపీలతో కలిసి బుధవారం కేంద్రమంత్ర పీయూష్ గోయల్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.
కేంద్రప్రభుత్వం ప్రస్తుతం దేశంలో మూడు ప్రతిష్ఠాత్మక విద్యుత్ ఉపకరణాల తయారీ జోన్లను ఏర్పాటు చేయడానికి సంకల్పిస్తోంది. ఈ మూడింటిలో ఒకటిగా మన్నవరం ప్రాజెక్టుకు అవకాశం కల్పించాలని గురుమూర్తి కోరారు. భారీ విద్యుత్ ఉపకరణాల తయారీ ఇక్కడ సాధ్యమవుతుందని విన్నవించారు.
మన్నవరంలో 2008లో 750 ఎకరాల విస్తీర్ణంలో ఆరువేల కోట్ల రూపాయల అంచనా పెట్టుబడులతో భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వాలు మారడంతో ఈ ప్రాజెక్టుకు అతీగతీ లేకుండా పోయింది. ఇదే విషయంపై గతంలో ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంటులో ప్రస్తావించడంకూడా జరిగింది.
తాజాగా కేంద్రం సంకల్పిస్తున్న మూడు ప్రాజెక్టుల్లో, జోన్లలో ఒకటిగా మన్నవరంను కలపాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి విన్నవించారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ను కలిసిన వారిలో ఎంపీ గురుమూర్తితోపాటు మాగుంట శ్రీనివాసులురెడ్డి, మార్గాని భరత్ తదితరులు ఉన్నారు.

.

Discussion about this post