మదనపల్లి ప్రజల ఆకాంక్షలను ఆవిరిచేస్తూ, ముఖ్యమంత్రి ప్రకటించిన కొత్త జిల్లాల నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించుకొని మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలని, అలా కాదని తమ డిమాండ్ ను నిర్లక్ష్యం చేస్తే, ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని, మదనపల్లె జిల్లా సాధన సమితి కన్వీనర్ పీటీయం.శివప్రసాద్ స్పష్టం చేశారు.
జిల్లా సాధన సమితి చేపట్టిన ప్రత్యక్ష ఆందోళన శుక్రవారం నాటికి 599వ రోజుకు చేరింది. జిల్లా సాధన సమితి ఉద్యమాన్ని ఉదృతం చేసింది. శుక్రవారం స్థానిక టమోటా మార్కెట్ వద్ద జాతీయ రహదారిపై మదనపల్లె జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో జరిగింది. రాస్తారోకోతో చెన్నై – హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి.
ఆటో కార్మికులు, హమాలీలు, చేనేత కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో రాస్తారోకోలో పాల్గొని ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈసందర్బంగా మదనపల్లె జిల్లా సాధన సమితి ప్రతినిధులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
రాస్తారోకో సందర్బంగా శివప్రసాద్ తోపాటు మదనపల్లె జిల్లా సాధన సమితి కో కన్వీనర్లు బి.శ్రీచందు, కో కన్వీనర్ కోనేటి దివాకర్ రావు, వడ్డే శ్రీరాములు, ఖాదర్ బాషా, ముత్యాల ముత్యాల మోహన్, కొండుపల్లి ఆనంద్ తదితరులు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా మదనపల్లె ప్రజల్లో వున్న జిల్లా ఆకాంక్షలను తుంగలో తొక్కి, మదనపల్లె, తంబళ్లపల్లి, పీలేరు నియోజకవర్గాలను రాయచోటి జిల్లా కిందకు చేర్చడం, పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలోనే ఉంచడం దుర్మార్గమైన చర్య అని, దీన్ని మదనపల్లె, తంబళ్లపల్లి, పీలేరు, పుంగనూరు ప్రజలు ఆత్మగౌరవంతో తిప్పి కొడతారని స్పష్టం చేశారు.
మదనపల్లె, తంబళ్లపల్లి, పీలేరు, పుంగనూరు ప్రజల జిల్లా ఆకాంక్షలను ఇక్కడి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, మదనపల్లె జిల్లాపై సానుకూల ప్రకటన చేయించాలని వీరు డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రాంతంలో జనాభా దామాషాన కాకుండా, విస్తీర్ణం ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని శ్రీబాగ్ ఒప్పందంలో పేర్కొనడం జరిగిందని, ఈమేరకు 42 శాతం విస్తీర్ణం కలిగిన రాయలసీమలో 12 జిల్లాలు ఏర్పాటు చేయాల్సిఉందని, నోటిఫికేషన్ లో, కేవలం ఎనిమిది జిల్లాలు మాత్రమే ప్రకటించడం రాయలసీమకు అన్యాయం చేయడమేనని నిప్పులు చెరిగారు.
జిల్లాల సంఖ్య 30 కి పెంచి, రాయలసీమలో 12 జిల్లాలు ఏర్పాటు చేయాలని, అందులో ప్రధానంగా మదనపల్లె జిల్లాకు చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. తమ ఆందోళనలను నిర్లక్ష్యం చేస్తే, ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని తీవ్రంగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సాధన సమితి ప్రతినిధులు పెద్దపాలెం రవిశంకర్, బురుజు రెడ్డి ప్రసాద్, ఓబుల్ రెడ్డిపల్లి నాగరాజు, రవి, కిరణ్, బాబ్ జాన్, శ్రీరాములు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. డిఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు శివప్రసాద్ తోపాటు ఆందోళన కారులను అరెస్టు చేసి, ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం సొంత పూచి కత్తుపై వారిని విడుదల చేశారు.
.