చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకంవర్గం కురబలకోట మండలంలో వైసీపీ నాయకుని చేతిలో గురువారం రాత్రి ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు ఇంటి వివాదమే కారణమని తెలుస్తోంది. ముదివేడు పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కురబలకోట మండలం పిచ్చలవాండ్ల పంచాయతీ కొంగావారిపల్లెకు చెందిన కె.రమణమ్మ(37) ముదివేడులో గాజుల దుకాణం నిర్వహిస్తోంది. కొంతకాలం కిందట ఈమె ముదివేడులో ఉన్న తన ఇంటిని కొంగావారిపల్లెకు చెందిన వెంకట్రమణారెడ్డికి తాకట్టు పెట్టి రూ.21లక్షలు అప్పు తీసుకుంది. రమణమ్మ తీసుకున్న అప్పు చెల్లించక పోగా… తాకట్టు పెట్టిన ఇంటిని కూడా వెంకట్రమణారెడ్డికి అప్పగించలేదు. ఈ కారణంగా వీరి ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది. గురువారం రాత్రి రమణమ్మ ఆటో దిగి ఇంటికి వెళుతుండగా పథకం ప్రకారం వెంకట్రమణారెడ్డి ఆమెను హత్య చేసి… పక్కనే ఉన్న వరి పొలంలో వేసి వెళ్లి పోయాడు. ఈమె మృతదేహాన్ని శుక్రవారం రాత్రి స్థానికులు గుర్తించి ముదివేడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మదనపల్లె రూరల్ సీఐ అశోక్ కుమార్, ముదివేడు ఎస్ ఐ సుకుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి రమణమ్మ మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై ఆరా తీశారు. ఇంటి వివాదం కారణంగానే రమణమ్మను వెంకట్రమణారెడ్డి హత్య చేశారని ఆమె బంధువులు ఆరోపించారు. రమణమ్మ బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
.