“అలనాటి ఆలమందలే నిజమైన శ్రీవారి సంపద” అని విశ్వసిస్తూ గో ప్రాముఖ్యతను ప్రపంచం నలుమూలలా వ్యాపింపచేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం గత మూడేళ్లుగా గో సంరక్షణకు పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి, పలమనేరు, తిరుమల గోశాలలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడంతో పాటు, దేశవాళీ గో సంతతి పరిరక్షణకు, గో సంరక్షణ కార్యాచరణకు రంగంలోకి దిగింది. పాలివ్వని ఆవులతో పాటు ఎద్దులను ప్రకృతి వ్యవసాయం దిశగా మళ్లించింది. రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఉపయోగించకుండా వ్యవసాయం చేసే రైతులకు రెండు వేల ఆవులు, ఎద్దులను ఉచితంగా అందచేసింది. తెలుగు రాష్ట్రాల్లోని గోశాలలను టిటిడి గోశాలతో అనుసంధానం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
నిత్యగోపూజ
గోసంరక్షణలో భాగంగా గోమాత విశిష్టతను తెలియజేసే దిశగా తిరుమల, తిరుపతితోపాటు ఇతర ఆలయాల్లో నిత్యం గోపూజ నిర్వహించేలా టిటిడి ఏర్పాట్లు చేపట్టింది.
గుడికో గోమాత
గోవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే అనే నినాదంతో టిటిడి గుడికో గోమాత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గోసంరక్షణతోపాటు గోమాత విశిష్టతను, హిందూ ధర్మంలో గోమాతకు ఉన్న ప్రాశస్త్యాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి, దేశంలోని ప్రముఖ ఆలయాలన్నింటిలో భక్తులకు గోపూజను అందుబాటులోకి తీసుకురావడానికి 2020, డిసెంబరు 7వ తేదీ కార్తీక మాసం సందర్భంగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి దేశీయ గోవు, దూడ అందించి టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ఆలయాలతోపాటు తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోని 197 ఆలయాలకు ఆవు, దూడ అందించి ఆ రాష్ట్రాల్లో టిటిడి గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశంలోని ఆలయాలు, పీఠాలు, వేద పాఠశాలలు ముందుకొస్తే గోవును, దూడను అందించి గోసంరక్షణ, గోపూజ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ముందుకు తీసుకువెళ్లడానికి టిటిడి ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం భక్తులు దేశవాళీ గోవులు, దూడలను విరాళంగా అందించాలని దాతలకు టిటిడి పిలుపునిచ్చింది. పలువురు దాతలు స్పందించి దేశవాళీ గోవులను టిటిడి గోసంరక్షణశాలకు అందిస్తున్నారు.
గోవిందుని దర్శనానికి ముందుగా గోదర్శనం
సకలదేవతా స్వరూపిణి అయిన గోమాతను సేవిస్తే గోవిందుని పూజించినట్లే అనే సంకల్పంతో గోవు ప్రాశస్త్యాన్ని, ప్రాముఖ్యతను భక్తులకు తెలియజేసేలా తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద రూ.15 కోట్ల విరాళంతో సప్తగోప్రదక్షిణ మందిరం నిర్మించారు. తిరుపతి నుంచి తిరుమలకు నడిచి వెళ్లే భక్తులు, వాహనాల్లో వెళ్లే భక్తులు ముందుగా గోదర్శనం, గోపూజ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన గో తులాభారం ద్వారా గోవుల పోషణకు అవసరమయ్యే దాణ, పశుగ్రాసం భక్తులు విరాళంగా అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
గోసంరక్షణశాలల అభివృద్ధి
టిటిడి ఆధ్వర్యంలోని తిరుమల, తిరుపతి, పలమనేరు గోశాలలను సంప్రదాయంగా, శాస్త్రీయంగా నిర్వహించడం కోసం నిష్ణాతులైన వారిని గోసంరక్షణ ట్రస్టు సభ్యులుగా నియమించుకుంది. గోశాలల్లో దేశీయ గోజాతుల సంతతి అభివృద్ధి, సంరక్షణకు చర్యలు చేపట్టింది. తిరుపతి ఎస్వీ పశు వైద్య విశ్వవిద్యాలయం సహకారంతో పశువుల సంతాన ఉత్పత్తికి ఆధునిక పిండ మార్పిడి విధానాలను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రత్యేకంగా పశువుల దాణా తయారీ ప్లాంట్ నిర్మించి జనవరి నుంచి ఇక్కడే ఉత్పత్తి ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. శ్రీవారి నిత్యకైంకర్యాలకు అవసరమయ్యే దేశవాళీ ఆవునెయ్యి తయారీ కేంద్రాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. పలమనేరులో గోశాలలోని పచ్చికబయళ్లను అభివృద్ధిపరిచి పశుగ్రాసం సాగును పెంచడానికి చర్యలు చేపట్టింది.
గో ఆధారిత వ్యవసాయానికి గోవుల పంపిణీ
తెలుగు రాష్ట్రాల్లోని 516 గోశాలలను టిటిడి గోసంరక్షణశాలకు అనుసంధానం చేయాలని టిటిడి నిర్ణయించింది. గోశాలల్లో దేశవాళీ ఆవుల సంతతిని పెంచడం, వాటిని సంరక్షించడం కోసం అర్హతలను బట్టి ఆర్థికసాయం చేయాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. గోసంరక్షణలో భాగంగా టిటిడి గోశాలల్లో ఉన్న 2 వేలకు పైగా పాలివ్వని ఆవులతోపాటు ఎద్దులను రైతులకు గోఆధారిత ప్రకృతి వ్యవసాయానికి ఉచితంగా అందించింది. జిల్లాకు రెండు నోడల్ గోశాలలను ఏర్పాటుచేసి తమ పరిధిలోని ఇతర గోశాలల నిర్వహణకు అవసరమయ్యే సహకారం అందించే ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 32 నోడల్ గోశాలలను గుర్తించి వారికి సహాయ సహకారాలు అందిస్తోంది. తద్వారా గోవులు కబేళాలకు తరలిపోకుండా రైతుల సంరక్షణలో ఉంటూ వ్యవసాయానికి పాటుపడడం ద్వారా భూమాతను కాపాడే ప్రయత్నం చేస్తోంది. తిరుపతిలోని శ్వేతలో నోడల్ గోశాలల నిర్వాహకులకు రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పోషణ భారమైన గోవులను ఎస్వీ గోసంరక్షణశాలకు తరలించేందుకు తగిన మార్గదర్శకాలను వారికి వివరించారు.
.