తోటి భక్తులకు సేవలు అందించేందుకు దేశం నలుమూలల నుండి శ్రీవారి సేవకులు విచ్చేస్తున్న విషయం విదితమే. అయితే విదేశాల నుండి కూడా భక్తులు శ్రీవారి సేవకు రావడం మొదలైంది. లండన్ లో స్థిరపడిన నీతు అనే భక్తురాలు కేరళలోని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి శ్రీవారి సేవకు వచ్చారు.
మొత్తం 11 మంది సభ్యులు ఆన్ లైన్లో బుక్ చేసుకుని సేవకు వచ్చారు. నీతు లండన్ లో ఒక ప్రముఖ సంస్థలో అధికారిణిగా పనిచేస్తున్నారు. ఈ బృందం సభ్యులు నాలుగు రోజులపాటు అన్నప్రసాద కేంద్రంలో కూరగాయలు తరగడం, అన్నప్రసాదాలు వడ్డించడం, కళ్యాణకట్టలో క్యూలైన్ల క్రమబద్ధీకరణ, భక్తులకు బ్లేడ్లు అందించడం, అగరబత్తీల విక్రయం తదితర సేవలు అందించారు. శనివారం నాడు శ్రీవారి సేవాసదన్-2లో జీడిపప్పును బద్దలుగా మార్చే సేవలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈ కేంద్రం పరిశీలనకు విచ్చేసిన జెఈఓ సదా భార్గవి ఈ సేవకులతో ముచ్చటించారు. శ్రీవారి సేవ చేసేందుకు లండన్ నుంచి వచ్చినందుకు అభినందించారు. మీలాంటి వారు యువతీ యువకులకు స్ఫూర్తిగా నిలుస్తారని చెప్పారు. యువతీ యువకులు శ్రీవారి సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా జెఈఓ కోరారు.
.

Discussion about this post