‘‘చాంగురే… బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా మజ్జారే మగరేడా మత్తైన వగకాడా’’ అని వగలు ఒలికించినా.. ‘‘జాణవులే.. నెర జాణవులే.. వరవీణవులే కిలికించి తాలలో జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో..’’ అంటూ హొయలు పోయినా. ఆమెకే చెల్లింది. ఆమె మరెవరో కాదు జిక్కి. వార్ధక్యం పలకరించిన వయసులో కూడా.. అలనాటి రామచంద్రుని కన్నింటనా సాటి.. అంటూ పదును తగ్గని తన సమ్మోహక స్వరంతో తెలుగు గానాభిలాషులను అలరించిన జిక్కి జయంతి ఈరోజు. ఆమెను స్మరించుకుంటూ ఆదర్శిని డాట్ కామ్ పాఠకుల కోసం ప్రత్యేక కథనం..
తెలుగు పాత సినిమాల గురించి మాట్లాడమంటే, మనకి గుర్తొచ్చే మొదటి విషయం పాటలు. మళ్లీ పాటలలో మనకు గుర్తొచ్చే వారిలో ఎంతమంది ఉన్నప్పటికీ.. జిక్కీ అలియాస్ పిల్లవాలు గజపతి కృష్ణవేణి ఎప్పటికీ మొదటి వరుసలోనే ఉంటారు. గజపతి నాయుడు, రాజకాంతమ్మకు పుట్టిన సంతానమే మన సమ్మోహన గాయకురాలు ‘గాన-గంధర్వకన్య’ జిక్కీ. చిత్తూరు జిల్లా ముద్దుబిడ్డ ఆమె.
నాయుడు-కాంతమ్మ దంపతులు ముందు చంద్రగిరి లో ఉండేవాళ్లు. కానీ బ్రతుకు-తెరువు కోసం చెన్నై వెళ్లిపోయారు. జిక్కీ చెన్నై లోనే పుట్టింది. ఆమె మాతృభాష తెలుగు. కానీ ఆమె తెలుగు కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఇంక సినిమాలలో కూడా పాటలు పాడింది. దాదాపు పది వేల పాటలు పాడి, మన గుండెల్లో ఒక పదిలమైన స్థానాన్ని సంపాదించుకుంది.
ప్రస్థానం ఎలా మొదలైంది?
దేవరాజు నాయుడు అనే స్వరకర్త జిక్కీకు బంధువు. ఆయన అప్పట్లో కన్నడ దర్శకుడు గుబ్బీ వీరన్న తో పనిచేసేవాడు. ఆయనే జిక్కీని సినిమా, సంగీత ప్రపంచాలకు పరిచయం చేశాడు.
జిక్కీ అనబడే పిల్లవాలు గజపతి కృష్ణవేణి, తన సినీ జీవితాన్ని 1943 లో ఒక బాల నటిగా ప్రారంభించింది. గూడవల్లి రామబ్రహ్మం దర్శకుడిగా చేసిన పంతులమ్మ సినిమాలో ఒక చిన్న పాత్రతో ఆమె మొదలుపెట్టింది. తరువాత, 1946లో, మంగళసూత్రం అనే హాలీవుడ్ రీమేక్ సినిమాలో జిక్కీ నటించింది. ఈపాటికే జిక్కీ ప్రతిభను అందరూ గమనించడం మొదలుపెట్టారు. అందరినీ ఆశ్చర్యపరచింది ఏంటంటే, జిక్కీకు శాస్త్రీయ సంగీతంలో ఎలాంటి శిక్షణ లేకపోయినా కూడా ఆమె అంత బాగా సమ్మోహనంగా పాడగలిగేది.
ఎస్.వీ.వెంకటరామన్ స్వరకర్త గా చేసిన తమిళ సినిమా జ్ఞానసౌందరి (1948) తో జిక్కీకు వచ్చిన అవకాశం, తనని తెలుగు బాల నటి నుంచి ఒక ప్లేబ్యాక్ సింగర్ గా మార్చేసింది. అందులో వచ్చిన పాట ‘అరుల్ తారుమ్ దేవా మాతావే అదియే ఇంబా జ్యోతి’ పాట ఒక చిన్న పిల్ల యువతిగా మారే ప్రక్రియను చూపిస్తుంది. పాటలో కుమారీ రాజమణి చిన్న పిల్లగా నటిస్తున్నప్పుడు జిక్కీ గొంతు మనకు పాటలో వినిపిస్తుంది. ఆ చిన్న పాప పెద్దదవుతూ పోగా, ఎం.వీ. రాజమ్మ నటిస్తూ ఉంటే, పీ.ఏ.పెరయనాయకి పాడుతుంది. ఈ పాట అప్పట్లో చాలా పెద్ద హిట్ అయింది. దీనితో జిక్కీకి సింగర్‌గా కేవలం తమిళం ఇంక తెలుగు మాత్రమే కాకుండా, కన్నడ, మలయాళం భాషలలో కూడా అవకాశాలు వచ్చాయి.
ఇవీ చదవండి : బాలీవుడ్ లో భావోద్వేగాల కింగ్ ఖాన్ ఇదేం తీర్పు : పశువుకు రాఖీ కడితే మనిషైపోతాడా? పవన్ కల్యాణ్‌లోని మానవత్వపు కోణం చూశారా? పూజలు చేయిస్తాను.. రాత్రికి రమ్మన్నాడు
జెమినీ వారి ఎస్.ఎస్. వాసన్ జిక్కీని 1950 తమిళ సినిమా సంసారం కు ప్లేబాక్ సింగర్ గా పరిచయం చేశాడు. అక్కడ జిక్కీ తన జీవితభాగస్వామి, ప్లేబాక్ సింగర్, సంగీత దర్శకుడు కూడా అయిన ఏ.ఎం.రాజాను కలుసుకుంది. ఆ తరువాత, ఎస్.ఎస్. వాసన్ 1952 లో ఆయన స్వయంగా నిర్మిస్తున్న మిస్టర్ సంపత్ సినిమాకు పాడమంటూ, జిక్కీని హిందీ సినీ ప్రపంచానికి పరిచయం చేశాడు.
అప్పట్లో మద్రాసులో సింహళ సినిమాలు కూడా నిర్మించే వారు. కాబట్టి జిక్కీకి సింహళ సినిమాలలో కూడా పాడడానికి బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. మరికొన్ని అద్భుతమైన పాటల తరువాత, 1950ల వరకు, పీ.లీలతో కలిసి జిక్కీ దక్షిణ భారత సినిమా ప్రపంచాన్ని ఏలడం మొదలుపెట్టింది. 1950ల నుంచి సుశీల అదే రాజ్యాన్ని ఏలడం మొదలుపెట్టింది. అంత మాత్రాన సుశీల, జిక్కీ శత్రువులు అయిపోలేదు. వారు ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉన్నా కూడా, ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఎంత ఇష్టం ఉండేదంటే, వాళ్లు అక్కా-చెల్లెళ్ల లాగా ఉంటూ, కలిసి చాలా పాటలు పాడారు.
సినిమా పాటలు కాకుండా జిక్కీ కొన్ని క్రిస్టియన్ పాటలు కూడా పాడింది. జిక్కీ జీ.రామనాథన్, ఎస్.ఎం.సుబ్బయ్య నాయుడు, ఎస్.హనుమంత రావు, ఎస్. దక్షిణామూర్తి, మాస్టర్ వేణు, లాంటి చాలా పెద్ద సంగీత స్వరకర్తలకు పాటలు పాడింది. అంతేకాదు, ఎస్. జానకి, కే. జమునా రాణి, తిరుచ్చి లోకనాథం, ఘంటశాల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్లతో యుగళగీతాలు పాడింది.
రాజాతో కలిసిన ఏడడుగులు..
1950 లో కలిసిన ఎ.ఎం. రాజా ను జిక్కీ పెళ్లి చేసుకుంది. తరువాత వారిద్దరూ కలిసి పాడిన పాటలు చాలా వరకు హిట్ లే అయ్యాయి. తన భర్త సంగీత దర్శకత్వం వహించిన చాలా పాటలు జిక్కీ నే పాడింది. ఆ పాటలు కొన్ని ఇప్పటికి కూడా రేడియోలో మనకి అప్పుడప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. దంపతులిద్దరూ కలిసి అమెరికా, మలేషియా, సింగపూర్ లాంటి పెద్ద పెద్ద దేశాల్లో ప్రదర్శనలు కూడా ఇచ్చారు.
8 ఏప్రిల్ 1989 లో జిక్కీ ఇంక రాజా కలిసి కన్యాకుమారిలో ఒక గుడిలో ప్రదర్శన ఇవ్వడానికి వెళుతుండగా, ఆమె భర్త ట్రైన్ ఎక్కుతున్నప్పుడు జారి పడిపోయి, రైలు పట్టాల మధ్యలో పడిపోయాడు. దానితో జిక్కీ తన భర్తను పోగొట్టుకుంది. అప్పటికి వాళ్లకు ఆరుగురు పిల్లలు. ఈ దుర్ఘటన తిరునెల్వేలి డిస్ట్రిక్ట్ లో వళ్లియూర్ రైల్వే స్టేషన్ లో జరిగింది. ఆయన చనిపోయాక, జిక్కీ కొన్ని సంవత్సరాల పాటు పాడడం ఆపేసింది. వియోగం ఆమె స్వర మాధుర్యాన్ని కొన్నాళ్లపాటు మరుగుపరిచేసింది. తర్వాత, ఇళయరాజాకు పాటలు పాడడం మొదలుపెట్టింది. అంతే కాదు, తన ఇద్దరు కొడుకులతో కలిసి సంగీత బృందం రూపొందించి, అమెరికా, మలేషియా, సింగపూర్ లాంటి దేశాలలో ప్రదర్శనలిచ్చింది.
రెమ్యునరేషన్ తగ్గించమని ఎవరైనా అడుగుతారా?
సాధారణంగా కళాకారులు సినిమాలు పెరిగేకొద్దీ.. రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోతారు. అలాగే ఎక్కువ పాటలు ఒకే సినిమాలో పాడే అవకాశం వస్తే.. తనను మించి వారికి గతి లేదన్నట్టుగా ఫీలై.. మరింత ఎక్కువ రెమ్యునరేషన్ అడుగుతారు. కానీ జిక్కీ తీరే వేరు. ఆమె ఒక సినిమాలో ఎక్కువ పాటలు పాడాల్సి వచ్చినప్పుడు.. నిర్మాతను రెమ్యునరేషన్ తగ్గించమని అడగడం.. ఒక విలక్షణమైన అంశం.
వేరే చాలా గాయకులలా కాకుండా, జిక్కీ డబ్బుల కోసం పాడలేదు. ఒకసారి ఒక తమిళ సినిమా కోసం అయిదు పాటలు పాడాక, నిర్మాత వలంపూరి సోమనాథన్ ను, ఒక్క సినిమాలో ఇన్ని పాటలు పాడడానికి అవకాశమిచ్చినందుకు ఆమె పారితోషికాన్ని తగ్గించమని అడిగింది. ఆమెకు పాడడం అంటే అంత ఇష్టం, ప్రేమ, గౌరవం ఉండేవి.
కొన్నేళ్ల తరువాత, ఆమెకు రొమ్ము కాన్సర్ వచ్చింది. ఆ కాన్సర్ కు ఆమె సర్జరీ చేయించుకున్నా కూడా, ఆ కాన్సర్ మహమ్మారి తరువాత మెల్లగా కిడ్నీలకు, లివర్ కు పాకింది. ఆమె స్నేహితురాలైన జమునా రాణి, ఆమె ప్రాణాలను కాపాడడానికి ఎంతగానో ప్రయత్నించింది. తన ప్రదర్శనల ద్వారా వచ్చిన విరాళాలు ఇంక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇంక తమిళ నాడు ప్రభుత్వం నుంచి వచ్చిన సహాయం ద్వారా జమునా రాణి బోలెడంత ప్రయత్నించింది. అప్పట్లో ఈ రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న జయలలిత, చంద్రబాబు నాయుడు, ఆమె చికిత్స ఖర్చులతో ఇబ్బంది పడుతోంది అని తెలిసి, మొత్తంగా 3 లక్షల రూపాయలు సహాయం చేశారు. కానీ ఇంత జరిగినా కూడా, దురదృష్టవశాత్తు, జిక్కీ 16 ఆగస్టు 2004 లో చెన్నైలో చనిపోయింది. ఆమె తమిళ నాడు ప్రభుత్వం ద్వారా ‘కళై మా మణి’ అనే పురస్కారం కూడా అందుకుంది.
98 తెలుగు సినిమాలు, 71 తమిళ సినిమాలు, ఇంకా వేరు వేరు భాషల్లో వేల పాటలు పాడిన మన గంధర్వకన్య గాత్రమాధుర్యం ఎప్పటికీ మన హృదయాలను సమ్మోహన పరుస్తూనే ఉంటుంది.
.. ఆదర్శిని శ్రీ
Discussion about this post