మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక చిత్రమైన తీర్పు మీద కేంద్ర అటార్నీ జనరల్ విస్మయం వ్యక్తం చేశారు. అలాంటి తీర్పులు ఇచ్చే న్యాయమూర్తులకు, వాస్తవాలను అర్థం చేసుకునేలా న్యాయ శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఆక్షేపించారు. న్యాయవ్యవస్థ ఉదార పోకడలు, చిత్రమైన తీర్పుల మీద మన దృష్టిని ఆకర్షించే ఈ కీలకమైన పరిణామానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే.
లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షించడం సహజం. అనాదినుండి ఇలాంటి కేసుల్లో నిందితులకు విధించే శిక్షలు ఇలాంటి నేరాలు చేయడానికి భయపడేలా చేసేవి. కానీ కాలక్రమేణా ఇలాంటి కేసుల్లో విధించే శిక్షల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మరీ ఆటవికంగా కాకుండా, కఠినంగానే శిక్షలు విధించడం జరుగుతోంది. కానీ మధ్యప్రదేశ్ లో ఒక లైంగిక వేధింపుల కేసులో న్యాయమూర్తులు మాత్రం చాలా చిత్రమైన శిక్షను విధించారు. ఈశిక్ష సర్వత్రా ఆక్షేపించబడుతోంది.
మధ్యప్రదేశ్ లోని ఒక లైంగిక వేధింపుల కేసులో నిందితుడు తన భార్యతో కలిసి సదరు బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెచేత రాఖీ కట్టించుకోవాలనే షరతులతో కూడిన చాలా చిత్రమైన తీర్పునిచ్చారు. అయినా తోడబుట్టిన వారిపైనే అత్యాచారానికి ప్రయత్నిస్తున్న ఈకాలంలో కేవలం రాఖీ కట్టించుకోవడంతో చెడు దృష్టి పోతుందా…? మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు ఈ విషయంలో ఇంకా సత్యకాలంలో ఉన్నారా… లేక కావాలనే నిందితుడితో కుమ్మక్కై ఇలాంటి తీర్పునిచ్చారా…? లేదా బాధితురాలు పడే వేదనను అర్థం చేసుకోలేకపోతున్నారా? అనే విషయం అర్థం కావడంలేదు. ఈ తీర్పును ఆక్షేపిస్తూ పలువురు మహిళా న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసు పూర్వాపరాలను విచారించి మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది. ఈ కేసులో తీర్పు ఇచ్చిన వారు తీర్పు ఇచ్చే విషయంలో పరిగణలోనికి తీసుకోవాల్సిన నిబంధనలను గురించి పట్టించుకున్నట్టు లేదని, ఇలాంటి షరతులతో కూడిన బెయిలు ఇచ్చేముందు న్యాయమూర్తులు కేసులోని వాస్తవాలను మాత్రమే పరిగణలోనికి తీసుకోవాలని కేంద్ర అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. ఇలాంటి కేసుల్లో న్యాయస్థానాల్లో ఇచ్చే తీర్పులు న్యాయశిక్షణా సంస్థల్లో బోధించే విధంగా ఉండాలని, ఫలితంగా ఇలాంటి కేసుల్లోని సున్నితత్వాన్ని గమనించి సరైన నిర్ణయాన్ని తీసుకునేందుకు న్యాయమూర్తులకు తగిన అవగాహన కలుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుత కాలంలో లైంగిక వేధింపులు అనేవి సర్వత్రా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి విషయాలు చూడడానికి చిన్నవిగానే అనిపించినా బాధితులకు మాత్రం ఇదో పెద్ద శిక్షలాగా అనిపిస్తుంది. వారికే గనుక శిక్షించే అధికారం వస్తే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. ఇలాంటి కేసుల్లో ఇంత పేలవమైన శిక్షను మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు ఎలా విధించారు అనే విషయం సర్వత్రా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. న్యాయమూర్తులు తాము ఇచ్చే తీర్పు పలువురికి ఆదర్శప్రాయంగా, ఆచరణయోగ్యంగా ఉండేలా ఇవ్వాలేగాని ఇలా పనికిమాలిన తీర్పు ఇవ్వడం సరికాదు.
ఒకసారి ఒక మహిళపై చెడు దృష్టి ఏర్పడితే అది రాఖీ కట్టినంత మాత్రాన మారిపోతుందా? ఈ విషయంలో న్యాయమూర్తులు వాస్తవాలను పరిశీలించాల్సి ఉంటుంది. లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులను బాధితులచేత రాఖీ కట్టించుకొంటే సరిపోతుంది, అత్యాచారం కేసుల్లో నిందితులు బాధితులను క్షమించమని వేడుకొంటే సరిపోతుంది లాంటి పసలేని తీర్పులు ఇస్తే ఇక ఇలాంటి నేరాలు చేయడానికి ఎవ్వరూ వెనుకాడరు. ఏముంది జస్ట్ రాఖీ కట్టించుకుంటే సరిపోతుంది అనుకుంటూ విచ్చలవిడిగా తమ మృగ ప్రవర్తనకు అడ్డులేకుండా ప్రదర్శిస్తారు. ఇకనైనా న్యాయమూర్తులు ఇలాంటి సున్నితమైన కేసుల్లో తీర్పు ఇచ్చేముందు తమ సొంత బుద్ధి సరిగా పనిచేయకపోయినా… ఇలాంటి కేసుల్లో ఇతర కోర్టులు ఇచ్చిన పాత తీర్పులను కాస్త పరిశీలించి సరైన శిక్ష విధించి బాధితులకు న్యాయం చేస్తే మంచిది. అంతేకాకుండా శిక్షలను మరింత కఠినతరం చేసినా కూడా ఇలాంటి నేరాలు మళ్లీ జరగకుండా కాస్తైనా అడ్డు వేసినట్లవుతుంది.
.
Discussion about this post