ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో ప్రస్తుతం ఉన్న మంత్రులందరినీ ఇళ్లకు పంపేసి.. పూర్తిగా కొత్త కేబినెట్ ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నిర్ణయం దాదాపుగా ఖరారైనట్టే. కానీ, రెండున్నరేళ్ల తర్వాత పనితీరు బాగాలేని వారిని మాత్రమే మార్చాలని అనుకున్న జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు మనసు మార్చుకున్నట్టు? ఈ సమూల ప్రక్షాళనకు హేతువైన పరిణామాలు ఏంటి? అనేది కీలక చర్చ!
రాష్ట్ర కేబినెట్ లో ఉన్న మంత్రులందరిలోనూ ముగ్గురే బలవంతులైన మంత్రులున్నారు. ఆ ముగ్గురినీ గానీ, కనీసం ఇద్దరిని గానీ మార్చేయాలనే ఉద్దేశం ముఖ్యమంత్రికి ఉంది.అయితే ‘బలవంతులు’ కావడం వలన.. పార్టీకి చాపకింద నీరులా చేటు తలపెడతారనే భయం కూడా ఉంది. వారిలో అసంతృప్తి కలగకుండా, పనితీరును బట్టి వేటు వేసినట్టుగా వారి గురించి ప్రజలు చులకనగా అనుకోకుండా.. మొత్తం కేబినెట్ నే మార్చేయడానికి సీఎం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఆ ముగ్గురూ ఎవరు?
ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలిలో ప్రస్తుతం 25 మంది మంత్రులు ఉన్నారు. ఏకస్వామ్య, వ్యక్తిస్వామ్య పార్టీగా ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ లో జగన్ మోహన్ రెడ్డి మాటకు ఎదురు చెప్పగల వారు ఎవరూ లేరు. అందరూ ముఖ్యమంత్రికి విధేయులే. కానీ, తమకంటూ సొంత బలం కలిగిన వారు ఉన్నారు. వారి బలం ముఖ్యమంత్రిని మించినది కాకపోయినప్పటికీ.. జగన్ నిర్ణయాన్ని ప్రశ్నించేంతటిది కాకపోయినప్పటికీ.. తలపెడితే.. పార్టీకి చేటుచేయగలపాటి బలం ఉన్న నాయకులు ఉన్నారు. అలాంటి బలవంతుల్లో మంత్రివర్గంలో ఉన్నవారిలో ముగ్గురు శక్తిమంతులే కీలకం. వారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి!
ఈ ముగ్గురు నాయకులు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చరిష్మాతో సంబంధం లేకుండా కూడా.. రాజకీయ బలం కలిగి ఉన్నవారు. జగన్ ఎంతగా ఏకధ్రువ వ్యవస్థగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్వహిస్తున్నప్పటికీ.. ప్రత్యేకించి తమ తమ జిల్లాల్లో/ప్రాంతాల్లో సర్వంసహా సర్వాధికారులు తామే అయినట్టుగా చెలాయిస్తున్నారు. అక్కడ అన్ని నియోజకవర్గాల రాజకీయాలను తమ కనుసన్నల్లో నడిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సారథిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ‘నెంబర్ టూ’ అనే పదానికి అర్థమే లేకపోయినప్పటికీ.. అలాంటి అప్రకటిత స్థాయి తమదని అనుకుంటున్నవారు!
కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా ఆ ముగ్గురు బలవంతుల్లో కనీసం ఇద్దరికి, లేదా ముగ్గురికీ కూడా చెక్ పెట్టాలనేది జగన్ వ్యూహం. అయితే అసలే ‘బలవంతులు’ అయిన వారిలో అసంతృప్తి రేగితే ఎలాగ?
అందుకే, జగన్ ఎంచుకున్న తరుణోపాయం.. మొత్తం మంత్రిమండలిని మార్చేయడం. సగం మంది మంత్రుల్ని మాత్రం తొలగించి, ఆ తొలగించిన వారిలో ఈ ముగ్గురి పేర్లు ఉంటే గనుక.. వారు దానిని అవమానంగా భావించే ప్రమాదం ఉంది. ఆ అసంతృప్తిలో పరిణామాలు ఎలా విషమిస్తాయో ఊహించడం కష్టం. అసలు అలాంటి అసంతృప్తులకు అవకాశమే ఇవ్వకుండా ఉండడం నాయకుడి విజ్ఞతకు నిదర్శనం అవుతుంది. అందుకే జగన్.. వారిలో అసంతృప్తి రేగకుండా ఉండేందుకు, వారికి అవమానమనే భావన కలగకుండా ఉండేందుకు మొత్తం కేబినెట్ మీద, సమర్థంగా సేవలందిస్తున్న మంత్రులందరి మీద కూడా తన కత్తి వాదర రుచిచూపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అరెస్టుల భయాన్ని నిలువరించే రక్షణకవచం సెక్షన్ 41(ఎ)
దేవీప్రసాద్ ఒబ్బు షార్ట్‌ఫిలిం ‘అనుసరణ’
సినిమా రివ్యూ : లవ్ స్టోరీ సినిమా దారి తప్పిందా?
Good Morning : మన విలువ కాపాడుకోడానికి మూడు సూత్రాలు
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెద్దిరెడ్డి హవా మామూల్ది కాదు. తనకు కిట్టని వారు, తనను లెక్కచేయని వారు ఉన్న నియోజకవర్గాలలో పెద్దిరెడ్డి అసంతృప్తి గ్రూపులను కూడా ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం ఉంది. సాధికారమైన రుజువులూ ఉన్నాయి. ఆయన ప్రోత్సహిస్తున్న ఇలాంటి వర్గాల రాజకీయాలకు, అసంతృప్తి కూడా తోడైతే నష్టపోయేది పార్టీ మాత్రమే. అయితే ఆయనను తప్పిస్తే.. ఆ జిల్లానుంచి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రోజాలలో ఎవరికి చాన్స్ దక్కుతుందనేది వేచిచూడాలి. కరుణాకర రెడ్డికి మాత్రం అవకాశం ఉండకపోవచ్చుననే అంతా అనుకుంటున్నారు.
బొత్స సత్యనారాయణ పరస్థితి కూడా అదే. ఉత్తరాంధ్రలో ఆయన ప్రాబల్యం హెచ్చు. ఒంటిచేత్తో పార్టీని గెలిపించే నాయకుడు కాకపోయినప్పటికీ.. తాను తలచుకుంటే కనుసైగతో పార్టీకి నష్టం చేయగలరు. అక్కడ కూడా ఇదే ఆలోచనతో జగన్ ప్రత్యామ్నాయం చూస్తున్నారనేది సమాచారం. పూర్తి ప్రక్షాళనలో బొత్స ఇంటికే పరిమితమైతే గనుక.. కోలగట్ల వీరభద్రస్వామికి అవకాశం దక్కవచ్చునని అనుకుంటున్నారు.
బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు స్వయానా మామ. కానీ ఆయనకు కూడా వేటు తప్పకపోవచ్చు. ప్రకాశం జిల్లా, పరిసర ప్రాంతాల్లో కూడా ఆయన ప్రాబల్యం ఎక్కువ. కానీ.. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనపై వేటు పడుతుందని తెలుస్తోంది. నిజానికి మొత్తం కేబినెట్ ను మార్చేస్తారని, పూర్తిగా కొత్త మంత్రివర్గం వస్తుందనే సమాచారం కూడా బాలినేని ద్వారానే లీక్ అయింది.
బలవంతుల బలం ‘అతి’ కాకూడదు..
కేబినెట్ సమూల ప్రక్షాళన విషయంలో జగన్ వ్యూహం మరొకటి కూడా ఉంది. ఈ ముగ్గురు బలవంతులు.. అతిబలవంతులుగా తయారు కాకూడదనే ఆయన లెక్క. పార్టీకి చేటు చేయగల స్థాయి ఉన్నవారిని అలాగే వదిలేస్తే.. ఎప్పటికైనా నష్టమే అని భావన. అందుకే.. వారిని పక్కన పెట్టి.. వారికి చెక్ గా, వారి ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వానికి ఊపిరులూది, జవసత్వాలు అందించాలని ఆయన భావిస్తున్నారు.
ఆ ముగ్గురి బలానికి కోత పెట్టడానికే మొత్తం కేబినెట్ ను మారుస్తున్నారు అనేది సమాచారం.
‘పార్టీసేవకు..’ అనేది తీయటి మాట..
మంత్రివర్గంలో పూర్తిగా కొత్తవారిని తీసుకుని.. సీనియర్లు అనుభవజ్ఞులు పటిమ ఉన్న వారిని.. ఎన్నికలు రాబోయే సమయానికి పూర్తిగా పార్టీ సేవలకు వాడుకోవాలనేది జగన్ ప్రకటించబోయే మాట. ఆ రకంగా.. ఈ బలవంతులు ఎవ్వరినీ తక్కువ చేసినట్టు కనిపించదు. పైగా రాబోయే ఎన్నికల విజయావకాశాలకు సంబంధించి సాఫల్య వైఫల్యాలను వారికి ముడిపెట్టడం జరుగుతంది. వారికి అప్పగించే పరిధిలో పార్టీల్లో ఉండే గ్రూపులను కట్టడి చేయడం, ఏకతాటి మీదకి తీసుకు రావడం అంతా వారిదే బాధ్యత అవుతుంది. అదీ జగన్ వ్యూహంగా ఉంది.
దొంగ చేతికి తాళాలిచ్చినట్టుగా గ్రూపులను ప్రోత్సహించే వారి నెత్తిమీదనే ఐక్యతను సాధించే భారం మోపితే గనుక.. పార్టీకి లాభం జరుగుతుందనేది ఆయన అంచనా. ఈ విషయంలో ఎంత మేరకు సక్సెస్ సాధిస్తారో చూడాలి.
ప్రస్తుతానికి విజయదశమి నాటికి ఈ మంత్రివర్గ సమూల ప్రక్షాళన ఉంటుందని అనుకుంటున్నారు. అయితే ఈలోగా.. ఈ వ్యూహంలో, నూరుశాతం ప్రక్షాళన ప్రయత్నంలో ఎన్నెన్ని సాధక బాధకాలు ఎదురవుతాయో.. ఏయే మార్పులు జరుగుతాయో తెలియదు.
Discussion about this post