అప్పు పుట్టడానికి ఎన్నికలకు ఏమి సంబంధం అనేగా మీ అనుమానం. అవును సంబంధం ఉంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల కోసం ఇప్పటికే రూ. 2.38 లక్షలకోట్లు అప్పు చేశారు. కేంద్ర నిబంధనల ప్రకారం అయితే ఏపీకి ఒక్క రూపాయి కూడా ఇక కొత్తగా అప్పు పుట్టదు. కానీ ఏపీ ప్రభుత్వం కొత్తగా అప్పులు చేసేందుకు కొత్త ఎత్తులు వేస్తోంది.
ఇప్పటికే కొత్తగా అప్పు చేసేందుకు విశాఖలో విలువైన ప్రభుత్వ కార్యాలయాలు, భూములు, కాలేజీలు తాకట్టు పెట్టారు. ఇక రోడ్లు కూడా తాకట్టు పెట్టేందుకు ప్రభుత్వం సిద్దమైంది. రోడ్లు భవనాల శాఖకు చెందిన భవనాలు, రోడ్లను బ్యాంకులకు గ్యారంటీగా పెట్టి మరో రూ.25 వేల కోట్లు రుణాలు తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ అప్పు పుడితే మరో ఆరు నెలలు ప్రభుత్వం నడిపే అవకాశం ఉంది. అంటే వచ్చే ఏడాది మార్చి చివరి వరకు నెట్టుకు వస్తే ఆ తరవాత కొత్త ఆర్థిక సంవత్సరంలో మరో రూ.45 వేల కోట్లు అప్పు చేసుకునే వీలు చిక్కుతుంది.
వరదలై పారుతున్న సంక్షేమం
ఏపీలో నవరత్నాల పేరుతో ప్రభుత్వం ఇప్పటికే లక్షా 40 వేల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ చేసింది. అమ్మఒడికి రూ. 14900 కోట్లు,
జగనన్న ఆసరా రూ. 12600 కోట్లు, సామాజిక ఫించన్లకు రూ. 32000 కోట్లు, రైతు భరోసా రూ. 12600 కోట్లు, వాహనమిత్రకు రూ. 2300 కోట్లు, వైఎస్ఆర్ కాపు నేస్తం రూ. 3600 కోట్లు, వైఎస్ఆర్ చేయూతకు రూ. 14500 కోట్లు, చేనేత, మత్య్సకారులకు రూ. 1200 కోట్లు జమ చేశారు. ఇవి కాకుండా ప్రతినెలా ప్రభుత్వ ఉద్యోగులకు రూ.4500 కోట్ల జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు రూ.2000 కోట్లు పింఛన్లు, ఇవి కాకుండా ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలకు గాను రూ.5000 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఇవన్నీ కలుపుకుంటే ప్రభుత్వం ప్రతి నెలా రూ.14000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ ఆదాయం మాత్రం నెలకు రూ.6000 కోట్లు దాటడం లేదు. ఇక ప్రతి నెలా రూ.8వేల కోట్లు అప్పు చేస్తేగాని బండి ముందుకు కదలడం లేదు. ఈ పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు అప్పులు చేసుకుంటూ, అప్పులు ఇక పుట్టవు అనుకున్న సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మెడికల్ కళాశాలల పేరుతో..
ఏపీలో 16 మెడికల్ కళాశాలల నిర్మాణం పేరుతో బ్యాంకుల వద్ద నుంచి మరో రూ.9 వేల కోట్లు రుణం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అయితే ఆ రుణం విడుదల అయితే కళాశాల నిర్మిస్తారా యథావిధిగా నవరత్నాలకు తరలిస్తారా? అనే అనుమానం వస్తోంది. ఇప్పటికే ఏపీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు. కనీసం రోడ్లపై పడ్డ గోతులు పూడ్చుకునేందుకు కూడా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. కేవలం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని చెప్పేందుకు ఇంత దారుణంగా అప్పులు చేస్తే రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీయడం ఖాయం. ఆ తరవాత ఎన్నికలు రావడం కూడా తథ్యం.
.

Discussion about this post