ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత తీవ్రమైన పదజాలంతో దూషించారో అందరికీ తెలుసు. ఆయన తెలంగాణ ఎన్నికల్లో సభల్లో మాట్లాడుతూ నోటిదూకుడు వ్యాఖ్యానాలు చేసినప్పటికీ.. ఉభయరాష్ట్రాల్లోని రాజకీయాసక్తి ఉన్న తెలుగువారందరూ వాటిని చూశారు. చర్చించుకున్నారు. కొందరు కేసీఆర్ వ్యాఖ్యలు తగవన్నారు. కొందరు మండిపడ్డారు. నిజంగానే కేసీఆర్ మీద ఆ స్థాయి ఆగ్రహం వచ్చిందో, లేదా చంద్రబాబును ఇంప్రెస్ చేయాలని ముచ్చటపడ్డారో గానీ.. కొందరు నాయకులు స్పందించిన తీరుపై చంద్రబాబు స్వయంగా అభ్యంతరాలు వ్యక్తం చేయడం విశేషం.
సాధారణంగా ఏ పొలిటికల్ అంశం ఉన్నా.. దాని మీద తన అభిప్రాయాలను, నిరసనలను చిత్రవిచిత్రమైన వేషాల ద్వారా వ్యక్తం చేయడంలో కర్నూలు నాయకులు బంగి అనంతయ్యకు చాలా గుర్తింపు ఉంది. కేసీఆర్ విమర్శల మీద కూడా ఆయన తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కర్నూలులో కేసీఆర్ ఫ్లెక్సిని చెప్పులతో కొట్టడం ద్వారా నిరసన తెలిపారు. అయితే ఈ చర్యను, ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించడం విశేషం.
సాధారణంగా ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. చంద్రబాబు వాటిని పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. కానీ, ఇది తన కోసం, తనకు మద్దతుగా జరిగిన చర్య అయ్యేసరికి చంద్రబాబు జోక్యం చేసుకోకుండా ఉండలేకపోయారు. కేసీఆర్ తీరును, మాటలను తెలంగాణ ప్రజలు కూడా హర్షించడం లేదన్న చంద్రబాబు, ఈ విషయంలో ఆందోళన చేస్తున్న తెలుగుదేశం నాయకులు సంయమనం పాటించాలని, హద్దులు దాటకూడదని సూచించడం గమనార్హం.
‘‘తమలపాకుతో నీవొకకటంటే, తలుపు చెక్కతో నే రెండంటా…’’ అనే తరహా రాజకీయాలే ఇప్పుడు నడుస్తున్నాయి. ఎవరైనా నాయకుడు ఒక రాజకీయ విమర్శ చేస్తే చాలు.. అంతకు పదింతలుగా ప్రత్యర్థులు అవేతరహా మాటలతో విరుచుకుపడిపోతుంటారు. కానీ, కేసీఆర్ తన పట్ల తీవ్ర పదజాలంతో దూషణలు చేసినప్పుడు.. అదే మాదిరి మాటలతో రిటార్టు ఇవ్వకుండా, తన అనుచరులు కూడా రెచ్చిపోకూడదంటూ హితవు చెబుతున్నారంటే.. అంతోఇంతో హుందాగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి.
.
Discussion about this post