తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలలో పోటీ చేయనున్న తమ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. గత ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేసి ఓటమి చెందిన పనబాక లక్ష్మి మళ్ళీ అభ్యర్థిగా అధికారికంగా సోమవారం ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.
సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో ఉండి రెండుసార్లు కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రిగా పనిచేసిన పనబాక లక్ష్మి గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని తెలుగుదేశం పోటీ చేయించింది. అయితే ఆ ఎన్నికల్లో రెండు లక్షల ఓట్ల తేడాతో పైగా ఓటమి చెందారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బల్లి దుర్గాప్రసాదరావు ఎంపీగా గెలుపొందినారు. అయితే గత నెలలో అనారోగ్యం కారణంగా ఆయన మృతి చెందారు. దీంతో తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఫిబ్రవరిలో రావచ్చునని తెలుస్తోంది. ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను కార్యములను చేయడంతోపాటు అభ్యర్థిత్వం విషయంలో స్పష్టత ఇవ్వాలని చంద్రబాబు భావించారు.
దీంతో సోమవారం సాయంత్రం జరిగిన తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం సమీక్షా సమావేశంలో పనబాక లక్ష్మి పేరును అభ్యర్థిగా ప్రకటించారు. ఇదిలా ఉండగా వైయస్సార్ కాంగ్రెస్ తరపున దివంగత బల్లి దుర్గాప్రసాద్ కుటుంబం నుంచి ఒకరు పోటీలో ఉంటారని తెలుస్తోంది.
ఈసారి తిరుపతి ఎన్నికల్లో బీజేపీ కూడా గట్టిగా తలపడాలని అనుకుంటోంది. బీజేపీ కూటమి పోటీలో ఉండడం వరకు ఖరారే. కాకపోతే.. అభ్యర్థి బీజేపీ నుంచి ఉంటారా, జనసేన నుంచి ఉంటారా? అనేది తేలడం లేదు. తెలుగుదేధశం పోటీలో ఉంటుందా? లేదా? అని నిన్నటివరకు మీమాంస ఉంది. ఇవాళ చంద్రబాబు ఆ విషయంలో క్లారిటీ ఇచ్చి పనబాక లక్ష్మి పేరును ప్రకటించడంతో.. త్రిముఖ పోటీ జరగనుంది.
.

Discussion about this post