జ్ఞానాంబ అంశ అయిన సద్గురు బోధలను గణపతాంశ అయిన బాబు తన రచనాశైలితో లోకానికి రుచి చూపాడు. ఆ రుచికి పరవశుడైన సత్యనారాయణ అనే ఓ జిజ్ఞాశువు తెలంగాణ రాష్ట్రం చేర్యాల నుంచి అనిలాచలానికి పరుగులు తీసి సద్గురు దర్శనం కోసం పరితపిస్తూ గురుసన్నిధి చేరుకుని సేదతీరాడు.
ఏ శిశువుకైనా మొదట కంటికి కనిపించేది అమ్మే. ఆ తర్వాతే అయ్య దర్శనం కలుగుతుంది.
అదేవిధంగా సత్యనారాయణ అనే జిజ్ఞాశువుకు మొదట జ్ఞాన స్వరూపం అయిన సద్గురు దర్శనం. ఆ తర్వాత అయ్యను దర్శించుకోవాలనే జిజ్ఞాస సహజంగా సత్యనారాయణలో కలిగింది.
ఆ జిజ్ఞాసతోనే తిరువణ్ణామలైలో అవతరించిన అచల స్వరూపుడైన అరుణాచలం (శివుణ్ణి) అనే అయ్యను దర్శించుకోవాలనే కుతూహలంతో అరుణాచలం వైపుకు అడుగులు వేయాలనుకున్నాడు జ్ఞానశిశువు, దేవీప్రసాద్ తో కలసి.
అలా మనస్సులో అంకురించిన ఆలోచనతోనే తన తమ్ముడు, మరో మిత్రుణ్ణి వెంట తీసుకుని అనిలాచలం చేరుకుని, సద్గురు పాదపద్మములకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకుని శ్రీకాళహస్తిలోనే కొలువై ఉన్న అనిలాచలశివుణ్ణి, జ్ఞాన ప్రసూనాంబను జ్ఞానశిశువు, దేవీప్రసాద్ తో కలిసి దర్శనం చేసుకుని అమ్మ గారి ప్రసాదాన్ని కూడా స్వీకరించి అమ్మ కృపకు పాత్రుడైనాడు.
అనంతరం అందరం వాయువేగంతో అరుణాచలం చేరుకున్నాం. అరుణాచలం కనుచూపుమేర కనబడగానే
పరవశించిపోయాడు సత్యనారాయణ. తన మొబైల్లో అరుణగిరిని తనివితీర ఫోటోలు తీసుకుని మురిసిపోయాడు.
తిరువణ్ణామలైలో రమణమహర్షి నడయాడిన, కొలువుండిన రమణాశ్రమంలోకి అడుగిడగానే పక్షుల కిలకిల రావాలు, చెట్ల నుంచి వీచే చల్లనిగాలులు, ప్రాచీన కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యాలైన ఆశ్రమ కట్టడాలు, జ్ఞానానికి అక్షరరూపంలో కొలువున్న గ్రంథాలయం, సుగంధాలు వెదజల్లే పుష్పాల పరిమళాలు, కాలికి మృదువుగా తగిలే మట్టి మమ్మల్ని మరింత పరవశింపజేశాయి.
అరుణగిరి మీద రమణమహర్షి తపస్సు చేసుకున్న ప్రదేశాలు విరూపాక్ష గుహ, స్కందశ్రమాలను వీక్షించడానికి రమణాశ్రమం లోపలి నుంచి అరుణగిరిపై కాలుమోపగానే మాలో ఏదో తెలియని మధురానుభూతి మమ్మల్ని ఆవహించింది. వొళ్ళంతా తన్మయత్వానికి గురైంది. శరీరంలోని అణువణువు కంపనానికి గురైంది. తనువులోని నవనాడులు నాట్యం చేసినట్లు నూతననోత్తేజం కలిగింది.
అమ్మ ఒడిలో నున్న శిశువును అయ్య తన చేతిలోకి తీసుకుని భుజాలపై కూర్చోపెట్టుకున్నట్లు మమ్మల్ని అందరినీ అరుణగిరిపై ఎక్కించుకుని ఆటలాడించినట్లు మాకు అనుభూతి కలిగింది. ఆ తర్వాత తండ్రి తన బిడ్డలను భుజాలపై నుంచి కిందికి దించినట్లు అరుణాచలేశ్వరుడు మమ్మల్ని మెల్లిగా కొండ కిందకు దించాడు.
ఇక ఇప్పుడు మీరు నా చుట్టు తిరిగే ఆట ఆడుకోండి అని ఆదేశించడంతో మేమందరమూ అరుణగిరి చుట్టు ఆనందంగా ప్రదక్షిణం చేసుకుంటూ పరవశించిపోయాము.
అలా గిరిప్రదక్షిణం చేస్తున్న మార్గంలో యోగి రాజారాం అనే యోగిపుంగవుడు మాకు దర్శనమిచ్చి..
“మాటల్ని మ్రింగేయండి” అనే పరమోపదేశాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ధన్యుల్ని చేశారు.
గిరివలయం చుట్టూ కొలువై ఉన్న సాధువులు, ఋషులు, ముక్కొటి దేవతలు, అవధూతలు, అష్టలింగాలు, అందరినీ దర్శనం చేసుకుంటూ ఆనందంతో అడుగులు వేశాం.
తన బిడ్డలు ఆటలు ఆడి అలసిపోయారని గ్రహించిన అరుణాచలేశ్వరుడు –
“ఇక మీరు అమ్మ దగ్గరకు వెళ్ళి హాయిగా నిద్రపోండి” అని ఆదేశించడంతో…
మేమందరం తండ్రి పాదాలకు నమస్కరించుకుని అయ్య దగ్గరకు వచ్చినంత వాయువేగంతోనే అనిలాచలంలో ఉన్న
అమ్మ (సద్గురు) దగ్గరకు చేరుకుని, అమ్మ పాదములకు నమస్కరించుకుని, ఆదమరచి నిదురించు బిడ్డలవలే అమ్మఒడిలో హాయిగా నిద్రకు ఉపక్రమించడంతో మా అరుణాచల యాత్ర ముగిసింది.
కాదు,కాదు ఓ జిజ్ఞాశువు అరుణాచలయాత్ర ముగిసింది.
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159.
Discussion about this post