మొన్నటిదాకా కార్తీక మాసం గడిచింది. ఈ మాసం అంతా కూడా శివ నామస్మరణలతో శివాలయాలు మారుమోగిపోయాయి. కార్తీక మాసంలో దీపారాధన, దీపదానం ఎంతో పుణ్యప్రదం. అయితే శివుని కటాక్షం కోసం కార్తీకమాసం.. అయితే విష్ణువు కటాక్షంకోసం.. కార్తీకమాసంలో శివకేశవులకు ఇద్దరికీ కూడా పూజలు నిర్వహిస్తారు. అయితే శివునికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంటుంది. అలాగే విష్ణువుకి అధిక ప్రాధాన్యతనిస్తూ ఆ స్వామిని పూజించడానికి కూడా మరోమాసం ఉంది. అదే కార్తీక మాసం తరువాత వచ్చే ధనుర్మాసం.
ధనుర్మాసంలో విష్ణువు ఆరాధన మనకు పుణ్యాన్నిస్తుందని పెద్దలు చెబుతారు. ఈ ధనుర్మాసంలోనే స్వామివారిని కొలిచి, గోదాదేవి ఆయనకు సతీమణిగా మారి ఆయన హృదయపీఠాన్ని అలంకరించింది. ఈ గోదాదేవి విష్ణుచిత్తుని కుమార్తె.
వైష్ణవ సాంప్రదాయంలో స్వామివారిని కీర్తిస్తూ, ఆయన్నే సేవిస్తూ తరించిన భక్తులు అనేకమంది వున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో విష్ణుభక్తులు మిక్కిలిగా వున్నారనే చెప్పవచ్చు. అలాంటి భక్తులలో ప్రముఖులుగా చెప్పబడినవారు ఆళ్వారులు. వీరు పన్నెండు మంది. వీరు తమ పాశురాలతో స్వామిని కీర్తించారు. ఈ పన్నెండుమంది ఆళ్వారులు సుమారు నాలుగువేల పాశురాలను గానం చేశారు. ఈ పాశురాలను అన్నింటినీ కలిపి దివ్యప్రబంధం లేదా నాలాయిరం లేదా ద్రవిడవేదంగా చెబుతారు. ఈ ఆళ్వారులలో ఒకడు పెరియాళ్వారు. ఈ పెరియాళ్వారే విష్ణుచిత్తుడు.
విష్ణుచిత్తుడు అనగా మహావిష్ణువుని తన చిత్తం (మనసు)లో నిలుపుకొన్నవాడు అని అర్థం. విష్ణుచిత్తుడు పేరుకు తగినట్టుగా పుట్టినది మొదలు స్వామిని పూజిస్తూ ఉండేవాడు. తులసీ వనాన్ని నిర్మించి తులసీ దళాలతో స్వామిని పూజిస్తూ వుండేవాడు. ఆయన భక్తికి మెచ్చి లక్ష్మీదేవి స్వరూపమైన గోదాదేవి పసిపాపగా విష్ణుచిత్తునికి తులసివనంలో లభించింది. ఆ పాపను విష్ణుచిత్తుడు అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు.
పుట్టినది మొదలుగా ఆ పాప స్వామిని తన భర్తగా పొందాలని కోరుకుంటూ వుండేది. ఇందుకోసం ఆమె పూజలు చేసేది. మరోవైపు విష్ణుచిత్తుడు స్వామిని పూజ చేయడానికి పూలమాలలు తీసుకువెళ్లి నిత్యం స్వామిని అలంకరించి పూజించేవాడు. మరోవైపు స్వామిని అలంకరించడానికి తయారు చేసిన పూలమాలలను గోదాదేవి ముందుగా తాను అలంకరించుకుని తర్వాత స్వామికి పంపేది. ఈ విషయం తెలియని విష్ణుచిత్తుడు అవే మాలలను స్వామికి నివేదన చేసుకునేవాడు.
Also Read : గరుడ అధిరోహించి కైలాసానికి వెళ్లడం ఎలా? తిరుమల వేంకటేశ్వరుని ఆస్తుల వివరాలివే!
ఒకరోజు ఈ విషయం గమనించిన విష్ణుచిత్తుడు ఆరోజు మాలలను స్వామికి అలంకరించలేదు. దీంతో చిన్నబుచ్చుకున్న స్వామిని చూసి విష్ణుచిత్తుడు తనవల్ల దోషం జరిగిందని అందువల్లే స్వామి అలా వున్నారని అనుకున్నాడు. అయితే తనకు గోదాదేవి అలంకరించుకున్న మాలలే ఇష్టమని స్వామి విష్ణుచిత్తునికి చెప్పడంతో ఆయన ఆదేశం మేరకు విష్ణుచిత్తుడు అప్పటినుండే గోదాదేవి ధరించిన మాలలనే స్వామికి సమర్పించసాగాడు. కొన్నాళ్లకు స్వామి గోదాదేవిని పరిణయమాడాడు. గోదాదేవి స్వామిలో లీనమవుతుంది. అదిచూసి కలతచెందిన విష్ణుచిత్తునికి స్వామివారు జ్ఙానోపదేశం చేయడంతో ఆయన మాయనుండి వెలికి వచ్చి స్వామిని పూజించాడు. అయితే మహావిష్ణువుని తన భర్తగా పొందడంకోసం గోదాదేవి తన స్నేహితురాళ్లతో కలిసి తిరుప్పావై వ్రతాచరణ చేసింది.
ఆ వ్రత మహాత్మ్యం వల్ల స్వామి ఆమెను వివాహం చేసుకుంటాడు. స్వామిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఆమె పాడిన పాశురాలు తిరుప్పావైగా కీర్తించబడ్డాయి. అంతేకాదు.. తిరుమలలో కొలువైవున్న ఆ శ్రీవేంకటేశ్వరుడికి ప్రతిరోజూ సుప్రభాతసేవతో మేలుకొలుపు చేస్తారు. స్వామిని మేలుకొలిపి తమను ఏలుకోవాల్సిందిగా అర్చకులు ఆయనకు మేలుకొలుపు పాడుతారు. కానీ ఈ ధనుర్మాసం మొత్తం తిరుమల స్వామివారికి సుప్రభాతసేవకు బదులుగా తిరుప్పావై పాశురాలను గానంచేస్తారు. గోదాదేవి ఎంతో ప్రేమతో స్వామిని పొగుడుతూ పాడిన ఈ పాశురాలను వినిపిస్తూ స్వామికి మేలుకొలుపు చేస్తారు. కాబట్టి ధనుర్మాసం మొత్తం గోదాదేవి పాడిన తిరుప్పావై పాశురాలను కీర్తిస్తూ, స్వామిని పూజించి. స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు.
.

Discussion about this post