తెలుగు టెలివిజన్ జర్నలిజం చరిత్ర రాయాలంటే మనం మరిచిపోకూడని హెడ్స్ స్థాయి సీనియర్ జర్నలిస్టులు పలువురున్నారు. సర్వశ్రీ టి. భావనారాయణ (జెమిని), ఆర్. శైలేష్ రెడ్డి (జీ-న్యూస్), కె.రామచంద్రమూర్తి (హెచ్ ఎం టీవీ), అరుణ్ సాగర్ (10 టీవీ), రవిప్రకాష్ (టీవీ-9), ఐ వెంకట్రావు (మహా టీవీ), రాజశేఖర్ (ఎన్ టీవీ), కందుల రమేష్ (ఐ-న్యూస్), అంకం రవి (వీ 6) ఇప్పటికిప్పుడు నాకు గుర్తుకువస్తున్న కొన్ని పేర్లు. ఈ జాబితాలో చేర్చదగిన వారు, ఇలాంటి వారికి ఇంత పేరు రావడానికి నిజమైన కారకులు, అన్ సంగ్ హీరోలు, హీరోయిన్ లు ఇంకా ఉంటారు. వారి ప్రతిభను, పాత్రను తక్కువ చేయడం ఉద్దేశం కాదు. ‘ఈ-టీవీ’ అధిపతి చెరుకూరి రామోజీరావు, ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ అధిపతి వేమూరి రాధాకృష్ణలు వేరే క్యాటగిరీకి చెందుతారు.
అయితే, జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించి అద్భుతమైన డైనమిజం తెచ్చిన సీఈఓలు ఇద్దరు రవి లు (రవిప్రకాష్, అంకం రవి) అని నాకు అనిపిస్తుంది. సృజనాత్మకత, వినూత్న ప్రయోగాల కోణాల్లో ‘ట్రెండ్ సెట్టర్స్’ అన్న మాట అతికినట్లు సరిపోయే కలంవీరులు వీరు. రవిప్రకాష్ శిష్యుడు, ‘ఈనాడు’ ప్రొడక్ట్ రాజశేఖర్ (ఎన్-టీవీ); అంకం రవి శిష్యుడు, ‘ఉస్మానియా’ ప్రొడక్ట్ చింతపండు నవీన్ అలియాస్ ‘తీన్మార్ మల్లన్న’ (క్యూ న్యూస్) కూడా తమదైన ముద్ర వేసుకున్నారు.
నిండైన పట్టుపరికిణీతో, చక్కని తెలుగుతో, సిగ్గులొలకబోస్తూ సంసార పక్షంగా జనాలను అలరిస్తూ ఉన్న ‘ఈనాడు’ తరహా టెలివిజన్ జర్నలిజానికి అమెరికన్ సిజర్‌తో బాబ్డ్ కటింగ్ చేసి, స్కర్టు కట్టి, చిక్కని టింగ్లీష్ తో రూపురేఖా విలాసాలు మార్చి జనాలను మంత్రముగ్ధులను చేసిన ఘనత టీవీ-9 వ్యవస్థాపకుడు రవిప్రకాష్ ది. రవిప్రకాష్ టీవీకి కావలసిన సరుకూ సరంజామాతో పాటు జనం గుడ్లప్పగించి చూసేందుకు కావలసిన ముంతమసాలా రంగరించి చూపరుల నరాల్లో కవ్వింతలు, మెదళ్లలో గిలిగింతలు తెప్పించి సంచలనం సృష్టించాడు. రవి ప్రకాష్, ‘ఈనాడు’లో నలిగి ఆనక అయన దగ్గర చేరిన రాజశేఖర్ టీవీ జర్నలిజాన్ని లాభదాయకమైన ‘ఎంటర్టైన్మెంట్’ ఆధార బిజినెస్ వెంచర్‌గా తీర్చిదిద్దడంలో సఫలీకృతులైతే, మరీ అంత అగ్రెసివ్‌గా కాకుండానే క్షేత్ర స్థాయి ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూనే ప్రజల మనసులు ఎలా చూరగొనవచ్చో అంకం రవి, ఆయన సృష్టించిన వివిధ ప్రజారంజక క్యారెక్టర్లు నిరూపించారు. అందులో ఒకరు.. అంకం రవి మదిలో అంకురించి తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ‘తీన్మార్ మల్లన్న’ నాకు సూపర్ డేరింగ్, డాషింగ్ జర్నలిస్టు అని అనిపించేవాడు.
మూడు దశాబ్దాల పాటు తెలుగు (ఈనాడు), ఇంగ్లిష్ (ది హిందూ) జర్నలిజంలో ఉండీ, ‘జర్నలిజంలో నైతికత’ మీద డాక్టోరల్ డిగ్రీ పొంది బోధనలో (యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, ఉస్మానియా) అనుభవం గడించిన నాకు పెద్ద ‘వ్వావ్ ఫ్యాక్టర్’ ఈ తీన్మార్ మల్లన్న.. నిన్న మొన్నటిదాకా. పోస్ట్ డాక్టోరల్ టాపిక్‌గా తన ఇండిపెండెంట్ జర్నలిజాన్ని ఎంచుకుని సమాచార సేకరణ చేస్తున్నాను. సాధారణ ప్రజలు పెట్టుబడిగా పెట్టిన డబ్బుతో ఏర్పడి, కొందరు తిక్క కమ్యూనిస్టుల మూలంగా ప్రాణం కోల్పోయిన 10 టీవీ ప్రయోగం తర్వాత తెలుగు జర్నలిజం చూస్తున్న టెక్నాలజీ ఆధార ఆధునిక జర్నలిజం కేస్ స్టడీ ‘తీన్మార్ మల్లన్న’ అనడంలో నాకు సందేహం లేదు.
నైతిక జర్నలిజం, ప్రొఫెషనల్ మీడియా అన్నవి మాయమై; పరిశోధనాత్మక జర్నలిజం అన్నది సమాధి అయిపోయి; తెలంగాణ ఏర్పడిన తర్వాత కొద్ది మినహాయింపుతో ‘జీ-హుజూర్ జర్నలిజం’ అద్భుతంగా వెలుగొందుతున్న దశలో అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన ఈ నల్గొండ అబ్బాయి నాబోటి వాళ్లకు కారుచీకట్లో కాంతిరేఖ అనిపించాడు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ రథసారధి, మాటల మాంత్రికుడు, రాజకీయ తాంత్రికుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు వ్యతిరేకంగా మాట్లాడడానికి, రాయడానికి యాజమాన్యాలు, జర్నలిస్టులు జంకి ఛస్తున్న దశలో నాలుగైదేళ్ల కిందటే నవీన్ ఆవిర్భావం జరిగింది. అంకం రవి వీ 6 ఛానెల్‌లో ఒక కార్యక్రమం కోసం మలిచిన క్యారెక్టర్‌నే అసలైన పేరుగా మార్చుకున్న మల్లన్న కొత్త తరహా జర్నలిజానికి సోషల్ మీడియా వేదికగా ఊపిరిపోశాడు.
ముఖ్యంగా అవినీతి బాగోతాల మీద మల్లన్న తన చానల్ క్యూ-న్యూస్ లో ప్రసారం చేసిన కథనాలు పెద్ద సంచలనం సృష్టించాయి. ఏకు మేకైన జర్నలిస్టును పట్టించుకోకపోవడం ఉత్తమమైన వ్యూహమని భావించిన అధికార పార్టీకి మల్లన్న ప్రజాదరణ చూసి లోలోపలైనా భయపడే పరిస్థితి ఏర్పడింది. దళిత, బహుజనుల శ్రేయస్సు కోసం పనిచేసే వీర సాహస జర్నలిస్టుగా మల్లన్న అనతికాలంలోనే వినుతికెక్కారు. సంజయ్ లు, అరవింద్ లు, రేవంత్ లు బండబూతులు మొదలుపెట్టడానికి చాలాకాలం ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, వారి కుటుంబాన్ని మల్లన్న తనదైన శైలిలో రోజూ పొద్దున్నే చెవులకు ఇంపుగా తిట్టేవాడు.
అందుకే, లక్షల మంది ఆయన విశ్లేషణ చూస్తూ ఆ వెబ్ ఛానెల్ ను నైతికంగా, ఆర్థికంగా బతికిస్తున్నారు. ఆయన తరహా జర్నలిజాన్ని సమర్ధించడమంటే ఆయన మీద వస్తున్న అవినీతి ఆరోపణలను తోసిపుచ్చుతున్నట్లు కాదని గమనించాలి. గొంతెత్తిన ప్రతి జర్నలిస్టు మీదా ఏదో ఒక ఆరోపణ ఉంటుంది. అవి నిరూపితమయ్యేవరకూ వారిని దోషులుగా చూడడం సబబు కాదు. మల్లన్న వాడుతున్న భాష పట్ల నాకూ కొంత అభ్యంతరం ఉంది.
జర్నలిస్టులు సామాజిక బాధ్యత (సోషల్ రెస్పాన్సిబిలిటీ) గా నిర్వర్తించాల్సిన విధ్యుక్త ధర్మాలతో పాటు మల్లన్న ఇంకొక అడుగు ముందుకేసి చట్ట సభల్లో ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేశాడు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నల్గొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి వెయ్యి లోపే ఓట్లు సాధించాడు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ల ఎం ఎల్ సీ స్థానం కోసం మొదటిసారి కాంగ్రెస్ తరఫున పోటీచేసి 13,033 ఓట్లతో మూడోస్థానంలో నిలవగా, రెండో సారి పోటీ చేసి సుమారు 90 వేల ఓట్లు పొంది అధికార పార్టీ సిట్టింగ్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ముచ్చెమటలు పట్టించాడు మల్లన్న. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ స్థాయిలో పోరాడి నిరాదరణకు గురై తెలంగాణ జన సమితి అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాంను మూడోస్థానం లోకి నెట్టాడంటే పెరుగుతున్న మల్లన్న పలుకుబడిని అర్థంచేసుకోవచ్చు.
ఈ క్రమంలో మల్లన్న మీద అనేక కేసులు నమోదయ్యాయి. అయన ఆఫీసు మీద దాడులు జరిగాయి. తన డేరింగ్ జర్నలిజాన్ని తట్టుకోలేక ప్రభుత్వం తనను అరెస్టు చేయడానికి కుట్ర చేస్తోందని మల్లన్న ఎన్నో సార్లు చెప్పాడు. ఆధునిక తెలుగు టీవీ జర్నలిజం ఆద్యుడు రవిప్రకాష్ మీద కూడా కేసులు బుక్ అయ్యాయి గానీ అవి ఆర్థిక నేరారోపణలకు సంబంధించినవి. మొత్తం మీద ఈ రోజువరకూ మల్లన్నకు వ్యతిరేకంగా 37 కేసులు నమోదయ్యాయి. తెలుగు జర్నలిజం చరిత్రలో ఒక జర్నలిస్టు మీద ఇన్నేసి కేసులు పెట్టిన సందర్భం లేకపోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణా ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఇలా ఏ జర్నలిస్టూ వేధింపులు ఎదుర్కోలేదు. అందుకే, సాధారణ గ్రామీణుల్లో, పౌర సమాజంలో, మేధావి వర్గంలో మల్లన్న పట్ల అభిమానం, సానుభూతి పెరిగాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన హుజురాబాద్ ఎన్నికలకు ముందు పాదయాత్ర చేయ సంకల్పించిన మల్లన్నను ఒక జ్యోతిష్యుడి ఫిర్యాదు మేరకు అరెస్టు చేసిన పోలీసులు క్యూ న్యూస్ ప్రసారాలు నిలిపేయడం కోసం చేయని ప్రయత్నాలు లేవన్న విమర్శ బాగా ప్రచారం జరిగింది. ఒకదానివెంట ఒకటి పీటీ వారెంట్లు ప్రయోగించి 73 రోజుల పాటు మల్లన్నను జైల్లో ఉంచారు. ఎన్నికల్లో అధికార పార్టీ దారుణంగా పరాభవం పొందాక, కోర్టు ఆదేశం మేరకు మల్లన్న విడుదలయ్యారు.
అదే సమయంలో వచ్చిన మంచి సినిమా ‘జై భీం’ ఇతివృత్తానికి మల్లన్న ఉదంతానికి నాకు చాలా పోలికలు కనిపించాయి. ఆ సినిమాలో రాజన్నను ఒక నాయకుడింట్లో పోయిన బంగారం కోసం పోలీసులు లాకప్ డెత్ చేస్తే, నిజజీవితంలో పోతున్న ప్రభుత్వం పరువు కాపాడేందుకు పోలీసులు మల్లన్నను బుక్ చేస్తూ పోయారు. రాజన్న భార్య సిన్నమ్మ తన భర్త ఆచూకీ కోసం నానా తంటాలు పడినట్లే, దళితులరాలైన మల్లన్న (బీసీ) భార్య మమత అయన విడుదల కోసం పడరాని పాట్లు పడింది. అన్ని రోజులు తండ్రి లేకుండా పోయి, తల్లీ, కుటుంబ సభ్యులు తల్లడిల్లుతుంటే వారి ఇద్దరు బిడ్డలు (చిన్నారులు) పడిన వేదన మామూలుది కాదు.
భర్త విడుదల కోసం మల్లన్న భార్య టీచర్ మమత ఒక దశలో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులను కలిసి తాము పార్టీలో చేరుతామని ప్రకటించారు. మల్లన్న బైటికి వచ్చిన తర్వాత వివిధ వర్గాలతో, సన్నిహితులతో, మేధావులతో చర్చలు జరిపిన మల్లన్న అధికారికంగా గత వారం దేశ రాజధానిలో బీజేపీ తీర్థం స్వీకరించారు. బీజేపీ ఇచ్చిన సభ్యత్వ రుసుము పత్రాన్ని ఒక పెద్ద తాడుతో పోలుస్తూ.. దాంతో కేసీఆర్ కుటుంబాన్ని అమరవీరుల స్థూపానికి కట్టేసి కొట్టిస్తానని, సమాధి చేస్తానని ప్రతిన బూనారు.
విశేష ప్రజాభిమానం పొందిన జర్నలిస్టు ఒక రాజకీయ పార్టీ పంచన చేరగానే జర్నలిస్టు అనే కార్డు కోల్పోతాడనడం నిస్సందేహమే అయినా.. రెండు తెలుగు నేలల్లో ప్రతి పత్రికా, ప్రతి ఛానెల్ బహిరంగంగా ఏదో ఒక రాజకీయపార్టీ కొమ్ముకాస్తున్న ఈ తరుణంలో ఈ వాదన సహేతుకమైనదేనా? అన్నది చర్చించాల్సిన ప్రశ్న. కాకపోతే ఇండిపెండెంట్ జర్నలిజం నిజంగానే స్వతంత్రంగా ఉండకుండా ఒక పార్టీ పంచన చేరడం మాత్రం బాధాకరమే. అయితే, తాను బీజేపీలో చేరినా, ఉదయం క్యూన్యూస్ వార్తా విశ్లేషణలో జర్నలిస్టుగా అన్ని పార్టీలను (సొంత పార్టీ సహా) కడిగిపారేస్తానని, తెలంగాణ సమాజాన్ని చైతన్య పరచడంలో భాగంగా ఫిబ్రవరిలో తాను తలపెట్టిన మహా పాదయాత్ర ‘7200’ పక్షాన సాగుతుందని, దానికి బీజేపీకి సంబంధం లేదని మల్లన్న ప్రకటించారు. ఇది నిజంగా ఆచరణయోగ్యమైన పనేనా? అన్న సందేహం వస్తుంది.
ఏమిటీ 7200?
క్యూ న్యూస్ ఛానల్ తో పాటు ‘శనార్తి తెలంగాణ’ ఈ-పేపర్ నిర్వహిస్తున్న మల్లన్న ప్రతిసారీ ‘7200’ అనే మాట వాడుతున్నారు. దాని అర్థం చాలా మందికి మిస్టరీగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెలమ కుటుంబాల సంఖ్య (7200 అని వారి లెక్క) ను ప్రతిబింబించేలా దాన్ని వాడుతూ, రెండు కోట్ల కు పైగా ఉన్న కుటుంబాలను ఈ 7200 వెలమ కుటుంబాలు పాలిస్తూ దోచుకుంటున్నాయని చెప్పడం ఈ బృందం ఉద్దేశమట.
ఒక దళిత మహిళ అయిన తన భార్య బీజేపీ నాయకత్వానికి ఇచ్చిన మాటకు గౌరవమిస్తూ తానా పార్టీలో చేరానని, ‘మాకు అండగా మీరు ఉండాలంటే, మీకు అండగా ఉండే పార్టీ తో ఉండండి,’ అని తన బృంద సభ్యులు, అభిమానులు చెప్పిన మాటకు గౌరవం ఇచ్చానని కూడా మల్లన్న అంటున్నాడు. తానీ నిర్ణయం తీసుకునే ముందు 2000 మందిని సంప్రదించినట్లు చెప్పాడు. ప్రతి ఒక్కరికీ గడలు, ఎత్తుగడలు ఉంటాయని, ఒకవేళ మున్ముందు బీజేపీ, టీఆర్ఎస్‌తో చేతులు కలిపితే తాను వెంటనే ఆ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించాడు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
నా ఉద్దేశం ప్రకారం- కారణాలు ఏవైనా బీజేపీలో చేరి మల్లన్న పెద్ద తప్పు చేశారు. కేసులు ధైర్యంగా ఎదుర్కొని, జైళ్లకు వెళ్ళడానికి వెరవకుండా ఉంటే బాగుండేది. మతోన్మాద పార్టీ, అగ్రకుల పార్టీ అని బీజేపీ తెచ్చే నష్టం, కష్టం మాటలా ఉంచితే, ఇన్నాళ్లూ తాను చెప్పిన మాటలకు ఒక సాహసోపేతమైన జర్నలిస్టు చెప్పిన మాటన్న అమూల్యమైన విలువ ఉంది. ఆ అద్భుత అవకాశం ఇప్పుడు పోతుంది. నికార్సైన జర్నలిస్టు మల్లన్నను ఎదుర్కోవడం కన్నా, బీజేపీ నాయకుడు మల్లన్నను ఎదుర్కోవడం గులాబీ సేనకు చాలా సులువు.
తాను ఎంత నిష్పక్షపాతంగా ఉన్నా బీజేపీ ముద్ర పడుతుంది. మల్లన్న తరహా స్వతంత్ర భావజాలం, ప్రజల భాష మాట్లాడే స్వభావం, ప్రజాభిమానం ఉన్న నాయకుడిని అంతర్గతంగా తొక్కేయడం సహజం. ఇప్పుడున్న బీజేపీ నాయకుల్లో అందరూ మల్లన్నను, అయన రచించుకునే కార్యక్రమాలను నిండు మనసుతో ఆదరించి అక్కున చేర్చుకుంటారని అనుకోవడం దురాశే. అసలే ఊపు మీదున్న రాష్ట్ర బీజేపీ నాయకులు కాళ్ళు, చేతులు అడ్డంపెట్టి విసిగించకుండా ఉండరు.
సాధారణంగా జర్నలిస్టులు రాజకీయాల్లో చేరితే తాము పనిచేస్తున్న పత్రికలకు, సంస్థలకు రాజీనామా చేయడం రివాజు. ప్రముఖ ఎడిటర్ ఎం జే అక్బర్ పదవి పొందాక ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ అన్న క్లాజు ను పట్టించుకుని తాను ఎడిటర్షిప్ ను వదులుకుతున్నట్లు ప్రకటించారు. ఈ సంప్రదాయానికి భిన్నంగా, అద్భుతమైన ‘యాక్టివిస్ట్ జర్నలిజం’ వదిలేసి ఫక్తు ‘పొలిటికల్ యాక్టివిస్ట్ జర్నలిజం’ చేసి చూపిస్తానని మల్లన్న ధీమాగా ఉన్నాడు. విపత్కర సంక్లిష్ట రాజకీయ వాతావరణంలో తెలంగాణ ఉన్న నేపథ్యంలో మల్లన్న చేస్తున్న ఈ ప్రయోగం, ఈ సాహసం ఏమవుతుందో- క్లిక్ అవుతుందో, ఫట్ అవుతుందో- కాలమే నిర్ణయించాలి.
..డాక్టర్ ఎస్.రాము
సీనియర్ పాత్రికేయుడు, జర్నలిజం బోధకుడు
Discussion about this post