మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేయడంలో, విరుచుకు పడడంలో ఒక ప్రధానమైన లాజిక్ మిస్ అవుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలి నాటి నుంచి సూపర్ సిక్స్ హామీల గురించి పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఏ కారణంగా ప్రెస్ మీట్ పెట్టినా సరే.. ఆయన సూపర్ సిక్స్ లో ప్రభుత్వం ఫెయిలైంది అని సుదీర్ఘంగా ప్రస్తావిచకుండా ముగించడం లేదు. ఈ దశలో ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శల వలన ఆయనకు రాజకీయ ప్రయోజనం దక్కే అవకాశం తక్కువ. ఎందుకంటే ఈ విమర్శలు త్వరలోనే కాల దోషం పట్టి పోతాయి. ఆ సంగతి అవగాహన ఉన్న చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా ఆయన విమర్శలను పట్టించుకోకుండా తనదైన శైలిలో తాను పరిపాలన సాగిస్తూ ముందుకు వెళుతున్నారు.
కొన్ని ఉదాహరణలు చూద్దాం..
తల్లికి వందనం గురించి జగన్మోహన్ రెడ్డి పదేపదే మాట్లాడుతున్నారు. ఆ విషయంలో ఒకటి రెండు విమర్శలు రాగానే చంద్రబాబు.. 2025 మే నెల నుంచి ‘తల్లికి వందనం’ కార్యక్రమం అమలు చేయబోతున్న సంగతి ప్రకటించేశారు. ఆ తర్వాత జగన్ తన శైలి మార్చి.. గత ఏడాది ఇవ్వలేదంటూ కొత్త విమర్శలు ప్రారంభించారు. అయితే.. చంద్రబాబు ఈ మే నుంచి ఇస్తున్నట్టుగా ప్రకటించిన తర్వాత.. మళ్లీ గత ఏడాది ఇవ్వకపోవడం గురించి ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఈ విమర్శలకు తెలుగుదేశం దీటైన కౌంటరే ఇచ్చింది. అమ్మ ఒడి గురించి జగన్ గెలవక ముందే బాగా ప్రచారం చేసుకున్నప్పటికీ.. గెలిచిన తర్వాత రెండో విద్యాసంవత్సరం నుంచే ప్రారంభించారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పనిచేసి.. జగన్ విమర్శలకు విలువ లేకుండా చేశారు.
అదే సమయంలో.. కూటమి ప్రభుత్వం.. ఒక ఇంట్లో ఎందరు పిల్లలు ఉంటే అందరికీ ఈ పథకం కింద నిధులు ఇస్తుండడం ఒక హైలైట్ అయింది. జగన్ సర్కారు కాలంలో 48 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం అందగా, కూటమి ప్రభుత్వం 78 లక్షల లబ్ధిదారులను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది బడ్జెట్ లో 9407 కోట్ల రూపాయలు కూడా కేటాయించారు. ఇదంతా నిజమైతే.. జగన్ విమర్శలను జనం పట్టించుకోరు.
అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి నానా యాగీ చేశారు జగన్. అయితే.. ఈ ఉగాది నాటికి ఆ సదుపాయం ప్రారంభం కానుంది. అంటే జగన్ విమర్శలకు కాలదోషం పట్టిపోతున్నదన్నమాట. తన విమర్శలకు కొన్నాళ్లకు విలువలేకుండాపోవడం అనేది.. తనకు డేమేజి చేస్తుందని జగన్ గుర్తించడం లేదు. ఇవి కొత్త ప్రభుత్వం ఇచ్చిన కొత్త హామీలు గనుక.. ప్రభుత్వం వాటిని అమలు చేయగానే.. తాను డిమాండ్ చేయడం వలన మాత్రమే వారు అమలు చేశారని జగన్ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడం కూడా సాధ్యం కాదు.
కాలదోషం పట్టిపోయే విమర్శల మీదనే ఆధారపడి రాజకీయం చేయాలనుకుంటే.. ఈ ప్రభుత్వాన్ని జగన్ గట్టిగా ఎదుర్కోవడం కష్టం. ఆయన తన శైలి మార్చుకోవాల్సిందే అని విశ్లేషకులు అంటున్నారు.
Discussion about this post