జనసేన పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఐపిఎస్ అధికారి వివి లక్ష్మీనారాయణ బిజేపి లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, వివిధ వర్గాల ప్రజలను కలవనున్నారు. ఆ తర్వాతే బిజేపి లో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను ఆయన సమర్థిస్తూ మాట్లాడుతుండటం గమనార్హం.
పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన లక్ష్మీనారాయణ గత సాధారణ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి రైతులతో సమావేశమైన విషయం తెలిసిందే. అప్పుడే సొంతంగా ఓ రాజకీయ పార్టీని స్థాపిస్తారని వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా జనసేన పార్టీలో చేరి, విశాఖపట్నం ఎంపీ సీటుకు పోటీ చేసి ఓడిపోయారు.ఎన్నికల తర్వాత పార్టీపరంగా లక్ష్మీనారాయణ క్రియాశీలకంగా వ్యవహరించలేదు. పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్లు గానే వ్యవహరించారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడం సాకుగా చూపి, జనసేన నుంచి వైదొలిగారు. తర్వాత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యటించి, యువత, రైతులతో సమావేశమై వివిధ సమస్యలపై చర్చించనున్నట్లు ప్రకటించారు.అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ఆయన ప్రశంసిస్తూ మాట్లాడారు.అంతేగాక బడ్జెట్ లో వివిధ రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత లభించింది అని పేర్కొన్నారు. కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన వివాదాస్పద చట్టాలు సీఎఎ, ఎన్సీఆర్,ఎన్పీఆర్ మంచి నిర్ణయాలని పేర్కొన్నారు. ఎవరు పడితే వారు వచ్చేయడానికి దేశం ధర్మశాల కాదని ఘాటుగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో లక్ష్మీనారాయణ త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు అని స్పష్టమవుతోంది.
ప్రజా సేవ చేసేందుకు రాజకీయ పార్టీ అవసరం అనే రీతిలో ఆయన భావిస్తున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సొంతంగా పార్టీని పెట్టడం లేదా, బిజెపి లో చేరడం మినహా మరో మార్గం లేదు. భవిష్యత్తులో బిజెపి, జనసేన కలిసి పని చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. జనసేన లో ఉండి బిజెపితో కలసి పనిచేయడం కంటే, నేరుగా బీజేపీ లో చేరడమే మంచి నిర్ణయమని లక్ష్మీనారాయణ భావించినట్లు స్పష్టమవుతోంది.
.
Discussion about this post