
చాగంటి ప్రసాద్
90002 06163
తొలకరి జల్లులు పడి నేల చిత్తడి చిత్తడిగా తయారైంది. వానతోపాటు వచ్చిన చిరుగాలి కి పారిజాతం పువ్వులు జలజల రాలి నేలమీద తివాచీ పరిచాయి. అరుగుమీద పడక కుర్చీలో కూర్చున్న రాఘవ కి వాటిని చూడగానే సాకేత్ గుర్తుకొచ్చాడు.
చిన్నప్పుడు వాడు తన చిట్టి చిట్టి చేతులతో చెట్టు క్రింద పడిన పువ్వుల్ని ఏరి గుప్పెళ్ళ నిండా తెచ్చి చూపించేవాడు. వాటిని అల్మారా లో ఉన్న చిన్నికృష్ణుడి విగ్రహం ముందు పోసేవాడు. బుధ్ధిగా చేతులు కట్టుకొని , “చేతవెన్నముద్ద చెంగల్వ పూదండ” ! అని ముద్దు ముద్దుగా పద్యం చదివేవాడు. వాడి చిన్నతనం కళ్ళకి కట్టినట్టు, ఈ మధ్యే జరిగినట్టుగానే అనిపిస్తోంది. అప్పుడే వాడు పెద్దవాడు అయిపోయాడా ! నాకు ముసలితనం ముందే వచ్చేసిందా ! కాలం ఎంత వేగంగా పరిగెడుతోంది!.
“ఏం చేస్తున్నారిక్కడ! అబ్బాయి లైన్లో ఉన్నాడు”….. భార్య సునంద పిలుపు కి ఉలిక్కి పడ్డాడు. సాకేత్ ఫోన్ అనగానే గబగబ ఇంట్లోకి వెళ్ళాడు. ఫోన్ చెవులకి గట్టిగా అదిమి పెట్టి పట్టుకున్నాడు…..
” హలో ! ఎలా ఉన్నావు నాన్న”!
“బాగానే వున్నాను! మీరెలా ఉన్నారు నాన్నా ! అమ్మ చెప్తోంది బెంగ పెట్టుకున్నారని”!
“అబ్బే! అదేం లేదురా! ఏదో పరధ్యానం అంతే ! నువ్వు జాగ్రత్త! ఇంకా ఏంటి సంగతులు?’
“ఏముంటాయి నాన్న ! వచ్చి కొన్ని రోజులే కదా అయ్యింది ! ఇప్పుడిప్పుడే ఎడ్జస్ట్ అవుతున్నాను. మీరు, అమ్మ జాగ్రత్త!” …..అని ఫోన్ పెట్టేశాడు.
“అయ్యిందా ఫోన్? ఏముంటాయి రోజూ సంగతులు? ఒక్కరోజు ఫోన్ రాకపోతే కంగారు పడిపోతారు కదా! మరీ రోజు రోజుకి చంటిపిల్లాడైపోతున్నారు. వాణ్ణి కాస్త స్థిమితంగా ఉండనీయండి. అమెరికా మొన్ననేగా వెళ్ళాడు వాడికీ చదువు బిజీ కదా!”
” సర్లే! నాకు తెలుసులే” అని తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. అల్మారా లో ఉన్న కార్వాన్ రేడియో ఆన్ చేసాడు. కార్వాన్ రేడియో లో రాఘవ కి ఇష్టమైన హింది పాత పాట “దిల్ కహే రూక్ జా రే రూక్ జాయహీ పె కహీ జో బాత్ ఇస్ జగహె మె, హై కహీ పె నహీ” వింటూ మైమరిచిపోయాడు.
భోజనానికి రండి! రాఘవ గది తలుపు తట్టింది సునంద. తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. డైనింగ్ టేబుల్ మీద కంచంలో` గోంగూర పులుసు` ఘుమ ఘుమలు ఆస్వాదిస్తు కంచంముందు కూర్చున్నాడు. నాలుగు ముద్దలు తిని హఠాత్తుగా ఆగిపోయాడు.
“సాకేత్ కి ఈ పులుసంటే ఎంతిష్టమో ?. నువ్వు నెయ్యివేసి కలిపి పెడితే కడుపునిండా ఈ ఒక్క ఐటెమ్ రెండుసార్లు తినేవాడు”….. గొంతు జీరబోయింది. బెంగ గొంతులోకి వచ్చింది. గొంతు కి అన్నం అడ్డపడి పొరమారింది. ఖళ్ ఖళ్ మన్న దగ్గు వచ్చింది.
సునంద మంచినీళ్ళిచ్చి తలమీద కొట్టి, “కాసేపైనా మాట్లాడకుండా అన్నం తినలేరా?
“సాకేత్ తలుచుకున్నట్టున్నాడు ” అన్నాడు రాఘవ.
“అంత బెంగ పెట్టుకునే వారు , ఎందుకు వాణ్ని అమెరికా పంపించారు?”
“నీకు తెలియదు లే!” అని చేయి కడిగేసుకుని లేచిపోయాడు. వింతగా చూసింది సునంద.
మిట్టమధ్యాహ్నం . వేడిగాలి వంటిని తాకుతున్నా, అరుగుమీద అలాగే పడక కుర్చీలోనే కూర్చున్న రాఘవ ఆలోచనలు గతం వైపుకి పయనించాయి.
* * *
ఆ రోజు , “ ఒద్దు నాన్నోయ్! నాకు చదువొద్దు !” అంటూ సాకేత్ కళ్ళు ఉబ్బిపోయేలా అక్షరాభ్యాసం చేస్తున్నంత సేపు ఏడిచాడు. సునంద కూడా వాడ్ని పట్టుకో లేక పోయింది. నేలమీద పడి దొర్లేశాడు. బడికి వెళ్ళనని పేచిపెడితే ఎత్తుకుని క్లాసులో దింపడం ఇంకా గుర్తు. అలా దొర్లేసి ఏడ్చిన సాకేత్ ఎప్పుడూ చదువులో స్కూలు ఫస్టే! వాడికి చెస్ నేర్పించి , ఇంటికి వచ్చేకా కాసేపు వాడితో ఆడేవాడు. కొత్త పుస్తకాలకు అట్టలు వేసి వాటి మీద లేబెల్స్ అంటించి వాడి పేరు , ఫోర్త్ క్లాస్ , సెక్షన్- ఏ అని రాస్తే , వాడు తెగ సంబర పడిపోయేవాడు. క్లాసు క్లాసు కి వాడిలో చదువు మీద శ్రద్ధ పెరిగేది . ఎప్పుడు ఎదురు చెప్పేవాడు కాదు . చాలా సాత్వికం గా వుండేవాడు.
“అస్తమాను ఆ చదువు, మీ ఇద్దరి ఆటలు తప్ప వాడికి బయట ప్రపంచం తెలియకుండా పెంచుతున్నారు” అని సునంద పోట్లాడేది.
అవును ! వాడే ప్రపంచం. వాడితోటే ప్రపంచం. వాడికి కూడా నాన్నే ప్రపంచం. అలా వాడి చదువులో ఉన్న రోజులన్నీ వాడే సర్వస్వం అని గడిపిన రోజులవి. ఆఫీసు నుంచి ఇంటికి వస్తే ఇక బయటకి ఎక్కడకీ వెళ్లాలనిపించేది కాదు. ఆఫీసు ఫ్రెండ్స్ తో కూడా ఎంజాయ్ చెయ్యడం మానేశాడు. ఒక కొడుకు ప్రేమపాశం తండ్రిని అంతలా చుట్టేస్తుందా! అనిపించేది. వాడి ఆలోచన లేకుండా వుండడం తన వల్ల కాదేమో అనిపించేది. వాడితో ఆటలు ఆడడం , చదువు చెప్పడం ఇలా కాలం చాలావేగంగా పరుగెత్తింది..
ఐఐటి లో సీటు వచ్చి సాకేత్ దూరంగా ముంబై వెళ్ళినప్పడు, వాడికి జాగ్రత్తలు చెప్తుంటే…….
” వాడిప్పుడు చిన్నపిల్లాడు కాదు యువకుడు” అని సునంద నవ్వింది. వాడు తనని వదిలి వెళ్తుంటే, సునందకి తెలియకుండా చాటుగా ఏడ్చాడు. సాకేత్ ఏం.ఎస్ కోసం అమెరికా వెళ్లాకా చాలా ఖాళీ అయిపోయాడు. ఇప్పుడు వాడి ఆలోచనలతో మరింత బిజీ అయిపోయాడు.
* * *
హాయ్ ! సాకేత్ ! హౌ డు యు డూ ?” అంటూ …. భూమిజ వచ్చి సాకేత్ భుజం మీద చెయ్యి వేసింది.
“ప్రాక్టికల్స్ హడావుడి లో పడిపోయి నీకు ఫోన్ చెయ్యడం మర్చిపోయాను, సారి! మీ డాడీ కి ఫోను చేశావా! బెంగ గా ఉన్నావు!” .
“లేదు ! జస్ట్ లైక్ దట్!” అని తల అడ్డంగా ఊపాడు.
ఇద్దరు ఐఐటి క్లాస్ మేట్స్. ఒకరిని ఒకరు ఇష్ట పడ్డారు. కానీ అమెరికా వెళ్ళి ఎం.ఎస్ చేద్దామనే భూమిజ ప్రపోజల్ కి సాకేత్ ముందు ఒప్పుకోలేదు. “మా నాన్న ని వదలి నాలుగు ఏళ్ళు ఐ.ఐ.టి ముంబై లో ఉన్నాను. ఇంక నా వల్ల కాదు. ఎక్కడకి రాలేను. ఆయన ని చూడకుండా ఇంక ఉండలేను”….. అన్నాడు.
“అమ్మ కూచిల్ని చూశాం కానీ. ఇలా మరీ నాన్న కూచులు కూడా ఉంటారా!
“నీకు తెలియదు భూమి ! మా నాన్న శ్రమ జీవి, త్యాగ జీవి. నేను ఇంటర్ కొచ్చాకా, ప్రమోషన్ తీసుకుంటే ఎక్కడ ట్రాన్సఫర్ చేస్తారో , నా చదువు ఎక్కడ పాడైపోతుందో అని దాన్ని త్యాగం చేసాడు. నన్ను తెల్లవారుఝామున లేపి ఐఐటి కోచింగ్ క్లాసులకి దింపి , అక్కడే చెట్టుకింద కునుకుపాట్లు పడుతూ కూర్చునే వాడు. అక్కడ నుంచి ఇంటర్ క్లాసులకి దింపడం చేశావాడు. అలా నేను చదువులో ఉన్న రోజులన్నీ నేనే సర్వస్వం అని మా నాన్న గడిపిన రోజులవి.
ఒక రోజు వాన లో తడిసి నాకు చాలా జ్వరం వచ్చింది . అమ్మ నాన్న ఇద్దరు బాగా కంగారుపడిపోయారు. నాన్న అయితే ఆఫీసుకి సెలవు పెట్టేసి , పగలు, రాత్రి నన్ను వదలలేదు . నాన్న భోజనం కూడా సరిగ్గా తినక పోవడం చూసిన అమ్మ ……
“మీరే అంత కంగారు పడిపోతే , పిల్లాడు ఇంకా బెంగ పెట్టుకుంటాడు . ధైర్యంగా వుండండి! డాక్టర్ పర్వాలేదు అన్నాడు కదా! అని సర్ది చెప్పింది. నేను జ్వరం తగ్గి , లేచి ఉత్సాహంగా వున్నప్పుడే నాన్న మొహం లో చిరునవ్వు చూశాను. నా ప్రతీ పరీక్షల టైమ్ లో తనే పరీక్షలు రాస్తున్నంతగా కంగారు పడే వాడు. కానీ అది పైకి తెలియ కుండా , నాకు మాత్రం గొప్ప ఆత్మ విశ్వాసాన్ని కలిగించే మాటలు చెప్పేవాడు. పరీక్షలు జరుగుతున్నంత సేపు, నాకు ఎప్పుడు ఏం అవసరం వస్తుందో అని నాతో సమానంగా మేల్కొనే ఉండి, నాకు నిద్ర రాకుండా రాత్రిళ్ళు టీ కూడా కలిపి ఇచ్చేవాడు.
కానీ నా మనసు నాన్నకి ఎలా తెలిసిందో “ఏరా ! అమెరికా వెళ్ళి ఎం.ఎస్ చేస్తావా!” అని అడిగాడు.
“లేదు నాన్న ! క్యాంపస్ లో ఎలాగో మంచి జాబ్ వచ్చింది. ఎక్కడకి వెళ్ళాను అన్నాను..
“పర్లేదురా , అప్పుడే ఉద్యోగం ఎందుకులే ? చక్కగా ఏం .ఎస్ చెయ్యి” అని దగ్గరుండి పంపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు”.
“వాడు ముంబై వెళ్తేనే బెంగ పెట్టుకున్నారు , అమెరికా అవసరమా ఇప్పుడు! వాడ్ని వదిలి ఉండగలరా?…. అని అడిగింది అమ్మ .
“నీకు తెలియదు ! నువ్వు దీంట్లో జోక్యం చేసుకోకు అని అమ్మని కసిరాడు”.
“ఈ దూరం మానసికంగా మమ్మల్ని మరింత దగ్గర చేసింది” అని డల్ గా మాట్లాడుతుంటే…..
“డోన్ట్ తింక్ టూ మచ్ సాకేత్! నీ కెరీర్ సంగతి చూసుకో! నువ్వు ఎమ్.ఎస్ కంప్లీట్ అయిన వెంటనే పెద్ద జాబ్ గ్యారంటీ. నువ్వు నేను కలిసి కన్న డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చు. మన ఎమ్. ఐ. టి , గ్రేటెస్ట్ ఇనిస్టిట్యూట్. దీనిలో సీట్ రావడమే చాలా లక్”! ….అని నెమ్మదిగా తన చేత్తో అతని చేతిని కలుపుకుని బుగ్గలనాన్చుకుని ఉండిపోయింది.
* * *
మిట్ట మధ్యాహ్నం. భోజనాలయ్యాకా ఒక కునుకు తీయడం సునందకి అలవాటు. టీవీ చూస్తూ నిద్రలోకి జారుకుంది. ఏదో చప్పుడుకి హఠాత్తుగా మెళకువ వచ్చింది. ఆ శబ్ధం పడక గది లోంచి వినబడుతోంది. వెళ్ళి చూస్తే రాఘవ గది కప్ బోర్డ్స్ పైన ఉన్న చిన్న అటకమీద నుంచి అట్టపెట్టి దింపి అందులోంచి ఒకో వస్తువు బల్లమీద పేరుస్తున్నాడు.
“ఏంటండి ? ఎందుకు దింపారు ఇవన్నీ ?…. రాఘవ సమాధానం చెప్పలేదు. ఒకో వస్తువు తీసి బల్లమీద పేర్చాడు..
“చూసావా! సుందు ! ఇది సాకేత్ ఐదో తరగతి లో ఉండగా వాడికి డిబేట్ కంటెస్ట్ లో ఫస్ట్ వస్తే ఇచ్చిన బుక్. చిన్నగ్లోబ్ ని తన చేతిలోకి జాగ్రత్తగా తీసుకుని, ఇదేమో సెవెన్త్ లో వుండగా స్కూల్ ఫస్ట్ వస్తే బహుమతిగా ఇచ్చినది. ఇదేమో టెన్త్ జిల్లా ఫస్ట్ వస్తే ఇచ్చిన గోల్డ్ మెడల్. అన్నింట్లో వాడే ఫస్ట్ . నాకు గొప్ప గర్వంగా ఉండేది”. అని చిన్నపిల్లా డిలా గుండెలకి హత్తుకుని ఆనంద పడిపోయాడు.
“వాడు ఆణిముత్యమండి! అందుకనే అన్నీ మీరు చెప్పినట్టు విని బుద్ధిగా ఉండి, ఒక మంచి వ్యక్తి లా మారాడు. గొప్పగా చదువుకున్నాడు”…
“కానీ వాడి బాల్యాన్ని నేను పాడు చేసానేమోనని, బాల్యపు మధుర స్మృతులు లేకుండా పెంచానేమో అని మనసు పీకేస్తోంది. వాడిని బయటకి వెళ్ళి ఆడుకోనివ్వక, ఎవ్వరితో కలవనీయక, అతి భధ్రతా భావంతో, నాన్నే! ప్రపంచం అనుకునేలా పెంచానేమోనన్న అపరాధ భావం నా గుండెల్ని పిండేస్తోంది”….. అని కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకున్నాడు.
“ఊరుకోండి ! ఏ రోజూ తనకి కలిగిన బాధని నా దగ్గర చెప్పలేదు . ఒకసారి స్కూల్ వాళ్ళు ఏదో టూర్ వేశారు. మీరు వాణ్ణి వదల లేక పంపలేదు. వాడు కాస్త డల్ అవ్వడం నేను గమనించి , నాన్నతో గట్టిగా దెబ్బలాడదామా అని అడిగాను వాణ్ణి! , వద్దని నన్ను ఆపాడు. పైగా…..
“నాన్న నా మంచి గురించే కదమ్మా ఆలోచిస్తున్నారు” అని నన్ను వారించాడు , అలాంటి బంగారమండి సాకేత్.
“లేవండి! టీ త్రాగుదురు గాని. ఊరికే మనసు పాడు చేసుకోకండి”. అని సర్ది చెప్పింది.
* * *
పరీక్షలయ్యాక సాకేత్ వస్తానని ఫోన్ చేశాడు. కాలం చాలా మందకొడిగా కదుల్తోంది అనిపించింది రాఘవకి, ఎప్పుడు పరీక్షలు అవుతాయా, బయలుదేరానని వాడు ఎప్పుడు చెప్తాడా! అని ఆ తండ్రి గుండె ఆత్రంగా ఎదురుచూస్తోంది. సాకేత్ కి పరీక్షలు అయ్యాయి. తండ్రి ని ఎప్పుడు చూస్తానా ! అని అతని మనసు ఉవ్విళ్లూరుతోంది. యూనివర్శిటీ లో ఇంకా ఏవో ఫార్మాలిటీస్ ఉన్నాయని భూమిజ జ్ణాపకం చేసింది. అవన్నీ పూర్తి చేసుకుని , ఫ్లయిట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. ఊరు వెళ్ళే రోజు దగ్గర పడే కొలది సాకేత్ కి ఎక్సైటింగ్ గా ఉంది. టైమ్ ఉంది కదా ! అని షాపింగ్ కి వెళ్ళాడు. తల్లికి ఉపయోగపడేవి కొన్ని వస్తువులు కొన్నాడు. నాన్న కి ఏం తీసుకెళ్ళాలో అర్ధం కాలేదు.
“ఇంత కాలం నాన్న అంటే అంత ప్రేమ! ఇంత ప్రేమ! అని గొప్పలు కొడుతున్నావు , ఆయనకి ఏ గిఫ్ట్ ఇవ్వాలో కూడా తెలియదా! అని ఏడిపించింది. అంకుల్ హాబీస్ చెప్పు అంది. నాన్నకి పాత హింది సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఓకే ! నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది! అని తాను కూడా వెదకడం ప్రారంభించింది.
సాకేత్ షాప్ అంతా వెదికి ఒక గిఫ్ట్ సెలెక్ట్ చేసి భూమిజ కి చూపించాడు.
“అంకుల్ అభిరుచి కి తగ్గట్టుగా ఉంది”! … అని మెచ్చుకుని చేతిని సున్నితంగా నొక్కి వదిలింది.
సాకేత్ బ్యాగ్ లో దాన్ని అపురూపంగా పెట్టుకున్నాడు. భూమిజ కూడా ఎయిర్ పోర్ట్ కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చింది.
“నాకు భయం గా ఉంది. అక్కడకి వెళ్లాకా , నేను గుర్తుంటానా ! అని సందేహంగా అడిగింది.
“ఛ! అలా అంటావేమిటి భూమి !, ఐ నెవర్ ఫర్ గెట్ యు! బికాజ్ ఐ లవ్ యు.” అని భూమిజ చేతి వెళ్లని తన చేతి వేళ్ళతో కలిపి ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు. అతని వేడి ఊపిరి ఆమెని తాకగానే, ఎంతో ఆనందానికి లోనయింది. ఆమె కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లేయి. సాకేత్ ని వదల లేక వదల్లేక వదులుతూ ,
“రోజూ మెస్సెజెస్ పెడుతూ ఉండాలి”… అని తర్జని చూపెట్టింది. అలాగే ! అని నవ్వుతూ బై చెప్పాడు.
* * *
సాకేత్ వస్తున్నాడని తెలిసిన దగ్గరనుంచి రాఘవ హడావుడి ఇంతా అంతా కాదు. వాడికి అది ఇష్టం , ఇది ఇష్టం అని సునందని కదల నీయకుండా పిండి వంటలు చేయిస్తున్నాడు. మూల పడున్న చెస్ బోర్డు ని శుభ్రం చేసి హాల్ మధ్యలో ఉన్న టేబుల్ మీద పెట్టి ఉంచాడు. వాడు వేడి తట్టుకోలేడని , గది లో స్ప్లిట్ ఏ.సీ పెట్టించాడు.
“ తెల్లవారింది, అప్పుడే లేచిన సూర్యుడు ఆ ఇంటిని కొబ్బరి ఆకుల్లోంచి చిన్నగా పలకరిస్తున్నాడు. చల్లని చిరు గాలి తాకిడికి పారిజాత చెట్టు నుండి జల జల రాలిన పువ్వులు నేల ఖాళీ లేకుండా నిండి పోయి మెత్తని తివాచీ పరిచాయి..
అరుగుమీద పడక కుర్చీలో కూర్చున్నాడు రాఘవ. వీధిలో ఏ కారు శబ్ధం విన్నా సాకేత్ ఎక్కిన కారే అనే అనుకుని ఉలిక్కి పడుతున్నాడు, సునంద సాకేత్ గది నీటుగా సర్ది పెడదామని వెళ్లింది. గదంతా నీట్ గా సర్ది ఉండడం గమనించి , “ఓహో! ఈయన ఎప్పుడో సర్దేసారన్న మాట!, నాకెందుకిస్తారు ఛాన్స్” … అని నవ్వుకుని బయటకి వచ్చి అరుగు మీద నిలబడింది. కారు ఇంటిముందు ఆగింది. సాకేత్ గేటు తీసుకుని ఇంటి లోనికి వస్తూంటే, చేష్టలుడిగిన రాఘవ , సాకేత్ ని నిలువెల్లా చూసుకుంటూ , కళ్ళతో తడుముతూ ఉండిపోయాడు. అతని కళ్ళల్లో ఆనందాశ్రువులు జల జల పారిజాతం పువ్వుల్లా రాలేయి.
“ వాడి చేతుల్లోంచి బాగ్ తీసుకోవాలని ధ్యాస కూడా లేదేమిటండీ !” అంటూ సునంద సాకేత్ చేతుల్లోంచి బాగ్ తీసుకుంది. “ఎలా వున్నావు నాన్న ! అని అతన్ని హత్తుకుంది.
“బాగానే ఉన్నా అమ్మ! “ నాన్నా ! ఎలా వున్నారు” ? అని ఇద్దరి కాళ్ళకి నమస్కరించాడు. రాఘవ కొడుకుని దగ్గరకి తీసుకున్నాడు. ఈలోగా సాకేత్ ఫోన్ లో భూమిజ దగ్గర నుండి మెసేజ్ వచ్చింది “ వేర్ ఆర్ యు మై డియర్ !”అంటూ. “ రీచ్డ్ సెఫ్లి” అని రిప్లై పెట్టి ఫోన్ ఫాంట్ జేబులో పెట్టు కున్నాడు.
సాకేత్ వచ్చి ఒక వారం అవుతోంది. ఇలా హాల్ లో ముగ్గురం కూర్చుని ఎన్ని రోజులయిందో కదా! అని సునంద సంబర పడిపోతోంటే,, రాఘవ మాట్లాడ లేదు. సాకేత్ తల్లితో పాటు ఉయ్యాల ఊగుతూ మినప సున్ని వుండలు, జంతికలు ఇష్టంగా తింటున్నాడు. అమెరికా విశేషాలు అన్నీ తల్లికి పూస గుచ్చినట్టు చెప్తున్నాడు. సునంద కొడుకు చెప్పే విషయాలన్నీ ఆనందంగా వింటోంది….కానీ రాఘవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సాకేత్ తమతో ఉన్నా అతనికి విచిత్రంగా ఆనందం తో పాటు, బెంగ కూడా వచ్చేసింది… ఏదో వర్ణించ లేని అనుభవం జీవితంలో మొదటి సారి అతన్ని కుదిపేసింది. వాడు మళ్ళీ తిరిగి వెళ్లిపోతాడని ఈ గుండె ఆరాట పడుతోందా ? అతనికి అర్ధం కాలేదు. నోటిలోంచి మాటలు రావడం లేదు. అతని కేసి చూసి, సునంద……. “ వచ్చేదాకా గోల పెట్టారు. ఇప్పుడేమో అలా బెల్లం కొట్టిన రాయిలా పడున్నారు . ఒక్క మాట మంతి లేదేంటండీ ? వాడు ఇచ్చిన ఆ గ్రాంఫోనే సెట్ కూడా చూడ కుండా లోపల పెట్టారు ? అని గట్టిగా అంది.
“అబ్బే ఏమి లేదు! ఏది అది? చూస్తాను , అని తీసి . బావుందిరా!” అని చిన్నగా అన్నాడు. ఎంతో సంబరంగా హడావుడి చేస్తాడు అనుకున్న సాకేత్, అలా అనేసి ఊరుకొనేసరికి చిన్నబుచ్చుకున్నాడు. అది బయటకి తెలియనీయకుండా గదిలో మూల వున్న టేబుల్ మీద గ్రాంఫోనే రికార్డు సెట్ పెట్టి ఆన్ చేశాడు. అందులోంచి రాఘవకి బాగా ఇష్టమైన `దిల్ కహే రూక్ జా రే రూక్ జాయహీ పె కహీ జో బాత్ ఇస్ జగహె మె, హై కహీ పె నహీ` అనే మధురమయిన పాట గాలిలో విహారం చేసింది, అతని కి మరింత దిగులు పెంచేసింది.
ఇంక వినడం ఇష్టం లేక , “నాకు నిద్రోస్తోంది పడుకుంటా!” అని తన గది లోకి వెళ్లిపోయాడు. తండ్రి పరిస్థితి చూసి,…. తల్లితో…..
“ నేను ఇక యూ. ఎస్ వెళ్ళనమ్మా! ఇక్కడే ఏదో జాబ్ చూసుకుంటా . నాన్న చాలా క్రుంగి పోయినట్టున్నారు. మునుపటి హుషారు లేదు . నాకు భయం వేస్తోంది. `వెళ్లనూ ` అంటే , నన్ను బలవంతాన అమెరికా పంపారు. నేను లేకుండా ఉండలేరేమో నాన్న.”…, అని కళ్ళు తుడుచుకున్నాడు. “పర్వాలేదు నాన్న ! కాసేపు బెంగ! కాసేపు హుషారు! ఆయనకిది అలవాటే. నువ్వు నీ భవిష్యత్తు చూసుకో” అని సర్ది చెప్పింది.
“ ఏమిట్రా సాకేత్ ! అమెరికా వెళ్ళవా! చదివించిన చదువు అంతా వృధా యేనా ? అదేం కుదరదు వెళ్లాల్సిందే “ అని వాళ్ళ సంభాషణ వింటున్న రాఘవ గదిలోంచి బయటకి వస్తూ గట్టిగా అన్నాడు.
“ మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో వదిలి ….. అని నసుగుతుంటే,
“ నాకేం! ఉక్కు పిడి లా వున్నాను. రాత్రి నిద్దర లేక కాస్త బడలిక అంతే ! నా గురించి , అమ్మ గురించి ఆలోచించక ఆనందంగా ఉండి నీ చదువు, ఉద్యోగం చూసుకో! అని గబ గబ అనేసి తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొన్నాడు.
సాకేత్ వెళ్ళే రోజు వచ్చింది. “ వెళ్లొస్తాను నాన్న!” అని తండ్రి దగ్గరకు వచ్చి గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. ఒక్క క్షణం రాఘవ తన అస్తిత్వాన్ని పూర్తిగా మర్చిపోయి కాసేపు అనిర్వచనీయమయిన అనుభూతిని పొందుతూ వుండిపోయాడు, కాలం స్తంభించి పోతే బావుణ్ణు అని ఇద్దరు అనుకున్నారు ఒకేసారి. “ వర్జం వచ్చేస్తోంది బయల్దేరండి!” , అని సునంద తొందర పెట్టింది. తల్లిని బుగ్గమీద గట్టిగా ముద్దు పెట్టుకుని , తండ్రి కళ్ళల్లోకి చూడ లేక కారు ఎక్కేశాడు .
* * *
“సాకేత్ వెళ్లిపోయాకా , ఇల్లు చిన్నబోయింది అని సునంద ఒక పది సార్లైనా అంది. రాఘవ నుంచి ప్రతిస్పందన లేదు. ఈయన ఎలా వుంటున్నారో, ఒకసారి కదపాలి అనుకుంది…..
“ నాకు తెలియక అడుగుతాను , వాడు ఇక్కడ ఉండి పోతాను నాన్నా! అన్నా కూడా, ఎందుకు అమెరికా పంపారండి?” అని సందేహంగా అడిగింది.
“ నీకు అర్ధం కాదులే!. అని గట్టిగా పూర్వం లాగే సునంద మాట తోసేసాడు. సునంద ముఖం మాడ్చుకొని వంటింట్లోకి వెళ్లిపోయింది. సునంద కి కోపం వచ్చిందని తెలిసి,….. ఆమె బాధ కరక్టే గా! . ఒక్కగాని ఒక్క కొడుకు, దగ్గర ఉండాలని, వాడి ప్రేమ పొందాలని అనుకుంటోందేమో అనిపించింది…
ఆమె మీద చేతులేసి , అనునయంగా…..“ ఒసే పిచ్చిదాన ! నా మాట విను! వాడికంటూ ఒక సహవాసి దొరికింది. ఆ అమ్మాయి కూడా వీడిని వదిలిపెట్టి ఉండలేదని నేను గ్రహించాను. వాడి ఐ ఐ టి క్లాస్ మేటు. నేను వాడి క్యాంపస్ కి వెళ్ళినప్పుడే గ్రహించాను. ఆ అమ్మాయితో మాట్లాడు తుంటే వాడి కళ్ళల్లో మెరుపు . అందుకనే అమెరికా పంపాను. ఆ పిల్ల పేరు భూమిజ. ఎల్లప్పుడు వాణ్ణి నేను పట్టుకుని కూర్చుంటే , వాడి జీవితం అంతా నేనే ఉంటాను. మనమా! రెక్కలుడిగిన పక్షులం, వాడేమో కొత్త రెక్కలొచ్చి ఆకాశమే హద్దుగా ఎగరవలసిన వాడు, ఎదగ వలిసిన వాడు.. వీడితో పాటు అంత మంచి యునివర్సిటి లో సీటు సంపా దించింది అంటే, ఆ పిల్ల కూడా చదువులో చాలా తెలివైంది. వాడిని జాగ్రత్తగా చూసుకుంటుంది అని నాకు నమ్మకం ఉంది. వాడి మీద నా మితిమీరిన ప్రేమ, వాడి భవిష్యత్తుకి ఆడ్డంకి కాకూడదు. అందుకునే తప్పుకున్నాను. అందుకనే….. `నాలో ఉన్న వాడ్ని అర్ధం చేసుకోవడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది. నన్ను నేను మార్చుకోనే సమయం వచ్చింది……. అని తెరిపిన పడ్డ మనసుతో అన్నాడు. “అందుకనేనా అస్తమాను నాకు ఏమి తెలియదు! అర్ధమవ్వదు అనేవారు! మీకు ఎలా తెలిసింది వాళ్ళిద్దరూ ప్రేమించు కుంటున్నారని.?” “అనుక్షణం వాడి గురించి ఆలోచించే నాకు, వాడికి ఏదిష్టమో! ఏది అయిష్టమో! తెలియదా! వాడు అక్కడ ఉద్యోగం లో చేరాకా త్వరలో మనకి ఈ విషయం చెప్తాడు. నాకు విశ్వాసం వుంది. ఒక వేళ మన దగ్గర ఉన్నా , మన మీద ప్రేమతో ఆ అమ్మాయిని వదులుకుంటాడు, ఆ అమ్మాయి కోసం తపిస్తాడు . వాడు బాధగా ఉంటే మనం ఉండగలమా ? అందుకునే పంపించేశాను” అని గట్టిగా నిట్టూర్చాడు.
“మరి వాడు దగ్గర లేకుండా ఉండగలరా ఈ రాబోయే కాలమంతా!” “వాడు తిరిగి వెడుతూ నాకు అత్యంత విలువైన కానుక ఇచ్చాడు. అది చాలు జీవితాంతం బతికేయడానికి అని చేతులు గుండెల మీద వేసుకుని ఆ “పుత్ర గాఢ పరిష్వంగ అనుభూతి” ని మళ్ళీ తలుచుకున్నాడు..
🙏💐
.
Discussion about this post