ఒక పనిని అనుకున్న తర్వాత.. అందులో సక్సెస్ సాధించాలంటే.. దానికి మంత్రం ఏమిటి? ఒక్క పదంలో సక్సెస్ మంత్రాన్ని చెప్పమంటే ఏం చెబుతాం. అన్ని రకాల సక్సెస్ సూత్రాలను మేళవించి ఒకే ఒక్కమాటగా చెప్పదలచుకుంటే గనుక.. మనకున స్ఫురించే పదం ‘తదేకదీక్ష’.
మార్కెట్లో సక్సెస్ మంత్రాన్ని యువతరానికి నేర్పడానికి కొన్ని లక్షల పుస్తకాలు, లక్షలకు లక్షల యూట్యూబ్ వీడియోలు అందుబాటులో ఉన్న రోజుల్లో ఒకే పదంలో చెప్పడం అనేదే చిత్రం. అలా చెప్పాల్సి వచ్చినప్పుడు పట్టుదల, కార్యదీక్ష లాంటి పదాలు కూడా సమానంగా అనిపించవచ్చు. పట్టుదల, కార్యదీక్ష లాంటివి ఉండాల్సిందే.. కానీ అవి సడలిపోకూడదు. చేయదలచుకున్న పని తప్ప ప్రపంచంలో మరేమీ గుర్తుకు రాకూడదు. అందుకే ‘తదేక దీక్ష’ అని చెప్పుకోవడం.
కార్యసాధకుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో మన పురాణేతిహాసాల్లో సుభాషితాల్లో కొన్ని వందల వేల శ్లోకాలు చెబుతూనే ఉంటాయి. అలాంటివాటిలో ఇది కూడా ఒకటి. కాకపోతే- ఈ శ్లోకం చెప్పే మర్మం మాత్రం భిన్నమైనది.
క్వచిత్ భూమౌ శయ్యా క్వచిదపి చ పర్యఙ్క శయనః
క్వచిత్ శాకాహారీ క్వచిదపి చ శాల్యోదన రుచిః
క్వచిత్ కంథాధారీ క్వచిదపి చ దివ్యాంబరధరః
మనస్వీ కార్యార్థీ న గణయతి దుఃఖం న చ సుఖం
ఒక్కోసారి నేలనే పడకగా చేసుకుని నిద్రపోతుంటాడు- ఒక్కోసారి మంచి పాన్పు మీద పవళిస్తాడు. ఒక్కోసారి ఆకులు అలములు ఏది దొరికితే అది తింటాడు- ఒక్కోసారి ఎముకలతో కూడిన మాంసాహారాలను రుచిచూస్తుంటాడు. ఒక్కోసారి చిరిగిపోయిన గుడ్డలనే వేసుకుంటాడు- ఒక్కోసారి ఖరీదైన దుస్తులను ధరిస్తుంటాడు. ఒక పనిని పూర్తి చేయాలని మనసులో సంకల్పించిన వాడు- దుఃఖాలను, సుఖాలను వేటినీ లెక్కచేసే స్థితిలో ఉండడు. – అనేది శ్లోకభావం.
ఆకలి రుచెరగదు.. నిద్ర సుఖ మెరగదు.. అని సామెత! ఆకలిగా ఉన్నవాడు పంచభక్ష్య పరమాన్నాలే కావాలని కోరుకోడు. వాటికోసం వేచిచూడడు. ఏది దొరికితే అది తింటాడు. నిద్ర కూడా అంతే. పట్టుపరుపులే కావాలనే పట్టు ఉండదు. నిద్రొస్తే ఎక్కడైనా నిద్రపోతాం మనం. ఈ సామెత మనందరికీ తెలుసు.
కార్యార్థిగా.. సంకల్పించిన కార్యాన్ని పూర్తిచేయడంలో తదేక దీక్షతో ఉన్నవాడికి రుచి, సుఖమూ మాత్రమే కాదు కదా దుస్తుల విషయంలోనూ పట్టింపు ఉండదు. మనిషికి ప్రాథమిక అవసరాలుగా మన పెద్దలు చెప్పే మాట కూడూ గూడూ గుడ్డా మాత్రమే కదా! ఆ మూడింటిలోనూ ఇలాగే ఉండాలనే పట్టింపులేకుండా ఉండే దశ- చేపట్టిన పనిని పూర్తిచేయాలనే తదేకదీక్ష!
skills నైపుణ్యాల కంటె కూడా కించిత్ సడలని కార్యదీక్ష మనకు ముఖ్యం. అది ఉన్నప్పుడు మనం చేపట్టిన పనిని పూర్తిచేయడానికి అవసరమైన అన్ని నైపుణ్యాలను అప్పటికప్పుడు నేర్చుకోగలం. కానీ ఆ తదేక దీక్ష అనేదే లేకపోతే.. ఎన్ని నైపుణ్యాలు, ఎంత కుశాగ్ర బుద్ధి, ఎంతటి గొప్ప సంకల్పం ఉన్నా కూడా వృథానే.
బతకడం కోసం తినడం- తినడం కోసం బతకడం అనే రెండు రకాల కేటగిరీలు మనం వింటుంటాం. నిజానికి ఈ రెండూ అవసరమే!
తిండికోసం బతకడం ఏంటి- సక్సెస్ ముఖ్యం గానీ అని కొందరంటారు. సక్సెస్ సాధిస్తాం సరే.. మంచి తిండీ, సుఖాలూ అనుభవించకుండా ఆ సక్సెస్ ను ఏం చేసుకోవాలి? కాబట్టి రెండోదే కరెక్టు అనేవాళ్లూ ఉంటారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
కానీ జీవితం ఈ రెండు నిర్వచానల సంతులనంగా సాగాలి. ఈ శ్లోకభావాన్ని కూడా మనం అలవరచుకోవాలి. సంకల్పించిన పనిని పూర్తి చేసే పనిలో ఉన్నప్పుడు.. మొదటి తరహాలో.. ‘బతకడం కోసం మాత్రమే తినడం, ని ద్ర కోసం మాత్రమే పడుకోవడం, ఒళ్లు కప్పుకోడానికి మాత్రమే దుస్తులు .. అన్నట్టుగా ఉండాలి. సుఖాలను ఖాతరు చేయకుండా సాగాలి. సంకల్పం పూర్తయిన తర్వాత దశలో- మరో సత్యార్యానికి నడుంబిగించేందుకు ముందు ఉండగల విరామంలో సుఖాలను పూర్తిగానూ ఆస్వాదించవచ్చు.
‘పనిలో పడితే అంతేనా?’ – సరదాగా అంటారు ఎరిగినవారు..
‘అవును దాని అంతు చూసేదాకా అంతే’ అని దృఢంగా సాగాలి..
శుభోదయం.
.

Discussion about this post