తెలుగు సాహిత్యంలో వన్నెతగ్గని వ్యక్తుల్లో పాపినేని శివశంకర్ ఒకరు. ఆయన జన్మదినం సందర్భంగా ఆదర్శిని డాట్ కామ్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసం. ఎంవి రామిరెడ్డి శుభాకాంక్షల కవితా మాలిక!
డాక్టర్ పాపినేని శివశంకర్ వృత్తిగతంగా తెలుగు అధ్యాపకులు. ఆ రూపంలో ఒక ప్రాంతం- కొందరు శిష్యులకు మాత్రమే ఆయన పరిచయం. అయితే ఆయన సాహితీ త్రిముఖుడిగా తెలుగుజాతి మొత్తానికి తెలుసు. అనన్యమైన రచనా శిల్పంతో కవిత, కథ, సాహితీ విమర్శ ప్రక్రియల్లో తనదైన ముద్రను తెలుగుపాఠకులకు పరిచయం చేసిన వ్యక్తి పాపినేని శివశంకర్. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు పొందిన తెలుగు రచయితల్లో ఒకరు. ఆయన రాసిన రజనీగంధ కవితా సంపుటికి ఈ పురస్కారం దక్కింది. ఆయనకు పట్టు ఉన్న మూడు సాహిత్య రూపాలతో, అధ్యాపకత్వాన్ని కూడా మేళవిస్తే.. సాహితీ చతుర్ముఖుడిగా ఎన్నదగిన వారు పాపినేని శివశంకర్
అనన్యమైన శైలితో పాటు లోతైన భావసంపద ఆయన సొంతం. తాత్విక చింతనతో ఆలోచింపజేసేలా ఆయన రచనలు సాగుతాయి. సుమారు 400 వరకు కవితలు, వంద వరకు కథలు, 250 వరకు సాహిత్య వ్యాసాలు ఆయన రాశారు. ఆయన కవిత్వంలోనే ఎక్కువ కృషి చేశారు. స్తబ్దత, ఒక సారాంశం కోసం, ఆకుపచ్చని లోకంలో, ఒక ఖడ్గం, ఒక పుష్పం, రజనీగంధ కవితా సంపుటులు వెలువరించారు. అలాగే మట్టిగుండె, సగం తెరిచిన తలుపు కథా సంపుటులు కూడా వెలువడ్డాయి. మరో అయిదు సాహిత్య విమర్శ సంపుటులు కూడా వచ్చాయి. కథాసాహితి వారు ప్రతి ఏటా వెలువరించే ఉత్తమ కథల సంకలనాలకు ఆయన తొలినుంచి సంపాదకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన కవితలు, కథలకు అనేక పురస్కారాల కూడా లభించాయి.
పాపినేని శివశంకర్.. కేవలం కవి, రచయితగా మాత్రమే కాదు. భవిష్యత్ తరాల రచయితలను ప్రోత్సహించే, తీర్చిదిద్దే సీనియర్ గా కూడా పేరున్న రచయిత. ఆయన శిక్షణలో తయారైన వారు ఎందరో ప్రముఖ రచయితలు ఉన్నారు.
గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు
శిష్యుడిగా పాపినేని గారి అభిమానినయ్యానా, లేక
‘మట్టిగుండె’ కథ చదివి పరవశించిపోయి, ఆయన సాహిత్యానికి
వీరాభిమానిగా మారానా?
‘రెండూ’నేమో!
కాదు కాదు, మూడూ నాలుగూ అయిదూ ఆరూ… ఇంకా చాలా అభిమానాలు
ఆయన చుట్టూ అల్లుకుపోయాయి.
దర్పంలేని ఆహార్యం
కపటంలేని దరహాసం
నిరాడంబర బోధన
సృజనలో మూలాల శోధన
జ్ఞానచెలమల అన్వేషణ
ఆచరణీయ చేతలు
మెరమెచ్చుల్లేని మాటలు…
పాపినేని గారి తాలూకు
ప్రతి అంశమూ నాకొక ఇష్ట భాండాగారమే!
రివార్డులు, అవార్డులతో ఎత్తుపొడవులు కొలవలేని
శిఖరసమానులైన మా గురువుగారు
డాక్టర్ పాపినేని శివశంకర్ గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
శతమానం భవతి!
ఇవి కూడా చదవండి :
కరోనా హెచ్చరిక : ముందుంది ముసళ్లపండుగ
మూవీ రివ్యూ మిస్ ఇండియా కాదు ‘మిస్ చాయ్’
విజయశాంతి కోసం ట్రై చేయడం వర్తీయేనా?
ఏటీఎంకు వెళ్లకుండా నోట్ల కట్టలు ఏమయ్యాయి?
మానవ కంప్యూటర్ బిరుదును అసహ్యించుకున్న మేథావి
Discussion about this post